ఇంటింటికీ గ్యాస్‌ ఎప్పుడో..!

ABN , First Publish Date - 2020-10-12T17:06:08+05:30 IST

కేజీ బేసిన్‌లోని సహజ వాయువులు వెలికితీసి పైపులైన్ల ద్వారా ఇంటింటికి వంట గ్యాస్..

ఇంటింటికీ గ్యాస్‌ ఎప్పుడో..!

నత్తనడకన పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌

1999లో ప్రతిపాదన.. 2001లో అనుమతి

20 ఏళ్లుగా సా..గుతున్న పథకం


భీమవరం: కేజీ బేసిన్‌లోని సహజ వాయువులు వెలికితీసి పైపులైన్ల ద్వారా ఇంటింటికి వంట గ్యాస్‌ సరఫరా కోసం ప్రతిపాదించిన పథకం సుమారు ఇర వైయేళ్లవుతోంది.ఐదేళ్ల క్రితం ప్రారంభించినా పైపులైను పనులకే పరిమితమైంది. ఈ పథకం కోసం 1999 ఏప్రిల్‌ 14న జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేశారు. ఈ బృందం ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించి ఇక్కడ కూడా అనుకూలత ఉందని నివేదించారు. 200 సంవత్సరాలకు సరిపడగా గోదావరి కృష్ణా బేసిన్లో చమురు సహజ వాయువులు ఉన్నాయి. 1995 ప్రాంతంలోనే కేజీ బేసిన్‌లోని సహజ వాయువులను పైపులైను ద్వారా గుజరాత్‌కు తరలించారు.  సహజ వాయువులు ఈ ప్రాంతానికి పూర్తిగా వినియోగించాలని అప్పట్లో ఉద్యమం సాగింది. పైకమిటీ ప్రతిపాదనతో నివేదిక ఇచ్చినా ప్రభుత్వ పాలకుల వైఫల్యం వల్ల ఇంకా పైప్‌లైన్‌ ద్వారా వంట గ్యాస్‌ ప్రాథమిక దశలోనే ఉంది.


మౌలిక వసతులు ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి వినియోగదారులు నెలకు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. చౌకగా ఇంటింటికీ గ్యాస్‌ అందే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతించి 20 ఏళ్లు కావస్తున్నా ఇంకా ఇళ్లకు చేరలేదు. 2018లో ఇళ్లకు పైపులైను వేసి మీటర్లు బిగించి వదిలేశారు. గతేడాది పనులు అంతగా సాగలేదు. తూర్పుగోదావరి నుంచి వస్తున్న మెయిన్‌ పైపులైను పనులకు కరోనా వల్ల ఈ ఏడాది అసలు అడుగు ముందుకేయలేదు. భీమవరంలో ఇళ్లకు పైపులైను వేసి వదిలేశారు. ఈ పథకాన్ని ఇంకా నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరుకు ప్రతిపాదించారు. గోదావరి గ్యాస్‌ అథారిటీ ద్వారా జాతీయ స్థాయిలో ప్రైవేటు సంస్థ కాంట్రా క్టుతో జిల్లాలో అన్ని పట్టణాలకు గ్యాస్‌ లైను ఏర్పాటుకు ఇంటింటికీ తిరిగి అగ్రిమెంట్లు రాయించుకున్నారు.


ఉభయ గోదావరి జిల్లాల్లోని కేజీ బేసిన్‌ ప్రాంతాల నుంచి 2015లో ప్రారంభమైన ప్రధాన పైప్‌లైన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేస్తున్నారు. మునిసిపాలిటీలో మంచినీటి పైపు లైన్లు, గ్యాస్‌ పైప్‌లైను ఏర్పాటు చేయడం వల్ల మంచినీటి పైపులైన్లు దెబ్బతిని చాలాచోట్ల లీకేజీ వచ్చి మున్సిపాలిటీలకు విపరీతమైన నష్టం వాటిల్లింది. రోడ్లు ధ్వంసం చేశారు, మరమ్మతులు చేయలేదు.


Updated Date - 2020-10-12T17:06:08+05:30 IST