పైప్‌లైన్‌తో ఇంటింటికీ గ్యాస్‌

ABN , First Publish Date - 2021-04-12T05:30:00+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేసే

పైప్‌లైన్‌తో ఇంటింటికీ గ్యాస్‌

  • సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు కింద ఎంపికైన వికారాబాద్‌ జిల్లా 
  • త్వరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేసే పనులకు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేసే సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు కింద మూడేళ్ల కిందట వికారాబాద్‌ జిల్లా ఎంపికైనా ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. ఇటీవల ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో త్వరలో జిల్లాలో సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పైపులైన్‌ ద్వారా నేరుగా ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేయాలనే ఉన్నత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టు అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద పైపులైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేయడమే కాకుండా గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలకు కూడా సరఫరా చేయనున్నారు. ఈ పనులను మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ చేపట్టనున్నట్లు తెలిసింది. 


మీటర్‌ రీడింగ్‌ ప్రకారం గ్యాస్‌ ఛార్జీలు

వికారాబాద్‌ జిల్లాలో 1,82,012 వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, 3,198 కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో హిందుస్తాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం సంస్థలు డొమెస్టిక్‌, కమర్షియల్‌, ఇండస్ట్రియల్‌ గ్యాస్‌ సరఫరా చేస్తున్నాయి. ఇంటింటికీ తాగునీటి పైపులైన్‌ ఏ విధంగా ఏర్పాటు చేశారో అదే తరహాలో గ్యాస్‌ సరఫరా చేసే విధంగా స్టీల్‌, ఎండీపీఈ పైప్‌లైన్లు వేయనున్నారు. సిటీ గేట్‌ స్టేషన్‌, మదర్‌, సిటీ గేట్‌ స్టేషన్ల ద్వారా పైపులైన్‌తో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేస్తారు. మొదట పట్టణాలు, ఆ తరువాత మండల కేంద్రాలు, గ్రామాల్లో గ్యాస్‌ పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. పైప్‌లైన్‌ ఏర్పాటు చేసే ముందు ప్రజలు ఏ మేర పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరాను కోరుకుంటున్నారనేది తెలుసుకునేందుకు నిర్మాణ సంస్థ అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా కోరుకునే వారికి అడిగిన వెంటనే కనెక్షన్‌ ఇచ్చే విధంగా పాయింట్లు ఏర్పాటు చేస్తారు. కనెక్షన్‌ తీసుకున్నవారు నెలకు ఎంత గ్యాస్‌ వినియోగించారనేది తెలుసుకునేందుకు మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. మీటర్‌ ఆధారంగా వినియోగదారులు గ్యాస్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 


వేచి చూసే పరిస్థితి ఉండదు...

ఇదిలా ఉంటే, గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసిన తరువాత 24 నుంచి 72 గంటల్లోగా డెలివరీ చేస్తున్నారు. పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా ప్రారంభిస్తే ... గ్యాస్‌ కోసం వినియోగదారులు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. గ్యాస్‌ సిలిండర్‌ కోసం బుక్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్‌ ప్రకారం ధర చెల్లిస్తుంటే, పైపులైన్‌ ద్వారా కనెక్షన్‌ తీసుకుంటే ఎంత గ్యాస్‌ వినియోగిస్తే ఆ మేరకు అప్పటి ధర చెల్లించాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-04-12T05:30:00+05:30 IST