చిరు వ్యాపారికి గ్యాస్‌ సెగ

ABN , First Publish Date - 2021-03-04T08:25:18+05:30 IST

చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటూ పొట్ట పోసుకునే వారిని గ్యాస్‌ ధర ఠారెత్తిస్తోంది. హోటళ్లు, మెస్‌ల నిర్వాహకులు..

చిరు వ్యాపారికి గ్యాస్‌ సెగ

ధర పెరుగుదలతో సతమతం..

మూడు నెలల్లో సిలిండర్‌పై రూ.292 భారం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటూ పొట్ట పోసుకునే వారిని గ్యాస్‌ ధర ఠారెత్తిస్తోంది. హోటళ్లు, మెస్‌ల నిర్వాహకులు.. వాణిజ్య సిలిండర్ల వినియోగంతో వ్యాపారాలు చేసేవారు.. అటు ధర పెంచలేక, ఇటు పెరుగుతున్న భారాన్ని భరించలేక సతమతమవుతున్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ బండ ధర ఒక నెలలోనే రూ.96 పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. గడిచిన మూడు నెలల్లో కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.291.68 పెరిగింది. డిసెంబరులో 1,481.32 ఉండగా, జనవరి నాటికి రూ.1,677.32కు చేరింది. మార్చి వచ్చేసరికి రూ.1,773కు చేరింది. దీంతో టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు, మెస్‌లు నిర్వహించే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో లక్ష వరకు కమర్షియల్‌ సిలిండర్లు ఉన్నాయి. ప్రతి రోజు 6-8 వేల వరకు ఈ సిలిండర్ల పంపిణీ జరుగుతోంది. అటు పెట్రోల్‌, ఇటు గ్యాస్‌ ధరలు పెరగడంతో టిఫిన్‌ ధరలనూ పెంచేస్తున్నారు. ప్రతి టిఫిన్‌పై రూ.5-10 పెంచడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఓ వైపు పెరిగిపోతున్న పెట్రోల్‌ ధరలతో సతమతమవుతున్న జనం మరోవైపు నింగినంటుతున్న వంట గ్యాస్‌ ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. మూడు నెలల్లోనే డొమెస్టిక్‌ గ్యాస్‌ బండపై రూ.225 పెరిగింది. అయితే సబ్సిడీ రూ.40 మాత్రమే ఇస్తుండటంతో జనం జేబులకు చిల్లుపడుతోంది. డిసెంబరులో రూ.100, ఫిబ్రవరిలో రూ.100, మార్చి 1న రూ.25 ధర పెరిగింది. మూడు నెలలకు కలిపి జనంపై ఏకంగా రూ.225 భారం పడింది. 


యాప్‌ల బంపర్‌ ఆఫర్లు..

ఓవైపు వంట గ్యాస్‌ ధరలు భారీగా పెరుగుతుండగా.. తమ ద్వారా గ్యాస్‌  బిల్లు చెల్లిస్తే డబ్బు ఆదా చేసుకోవచ్చంటూ ఊరిస్తున్నాయి కొన్ని యాప్‌లు.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్లలో ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌పై గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకుంటే రూ.20 ఆదా చేసుకోవచ్చు. అమెజాన్‌ యాప్‌పై యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే రూ.300వరకు ప్రయోజనం పొందవచ్చు. అంతేనా ఫ్రీచార్జ్‌ యాప్‌ ద్వారా బిల్లు చెల్లిస్తే రూ.25 వరకు, మొబిక్విక్‌పై 2ు సూపర్‌ క్యాష్‌, ఇలా రకరకాల యాప్‌లు ఆఫర్లు అందిస్తున్నాయి. గుగూల్‌పే, పేటీఎం, ఫోన్‌పే లాంటి యాప్‌లు రూ.50-500 వరకు ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. 



Updated Date - 2021-03-04T08:25:18+05:30 IST