బండ బాదుడు!

ABN , First Publish Date - 2022-07-07T08:12:57+05:30 IST

దేశ ప్రజలకు వంట గ్యాస్‌ మంట మరింత ఠారెత్తింది.

బండ బాదుడు!

గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెంపు.. తక్షణమే అమల్లోకి

హైదరాబాద్‌లో రూ.1105

మార్చి నుంచి 4 విడతలుగా ధరలు పెంచిన చమురు సంస్థలు

ఏడాది కాలంలో రూ.244 వడ్డన

దిగుమతులపైనే ఆధారపడ్డాం

అంతర్జాతీయ పరిస్థితే కారణం

దేశీయ చమురు సంస్థల వెల్లడి

‘ఉజ్వల’కే పరిమితమైన సబ్సిడీ


అమరావతి(ఆంధ్రజ్యోతి)/న్యూఢిల్లీ, జూలై 6: దేశ ప్రజలకు వంట గ్యాస్‌ మంట మరింత ఠారెత్తింది. బుధవారం తెలతెలవారుతూనే గృహ వినియోగదారులకు చమురు సంస్థలు భారీ షాక్‌ ఇచ్చాయి. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఏకంగా రూ.50 పెంచుతూ ప్రకటన జారీ చేశాయి. ఈ పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపాయి. అంతర్జాతీయ ధరలు పెరుగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు చమురు సంస్థలు తెలపడం గమనార్హం. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా గ్యాస్‌ సిలిండర్‌ల ధరలు రూ.1000 నుంచి రూ.1100 దాటేశాయి. ఇక, స్థానిక పన్నులు, రవాణా చార్జీల ఆధారంగా ఈ ధరల్లో మరికొంత వ్యత్యాసం ఉండనుంది. ఇదిలావుంటే, ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు చమురు సంస్థలు ప్రజలపై బండ భారం మోపాయి. మార్చి, మే మాసాల్లో వరుసగా బాదేసిన సంస్థలు.. జూన్‌లో కొంత విరామం ఇచ్చినా తాజాగా ధరలను వడ్డించేశాయి.


 దీంతో మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క గృహ వినియోగ గ్యాస్‌ బండపై రూ.153.50 చొప్పున భారం పడింది. అదేసమయంలో గత జూన్‌ నుంచి ఇప్పటి వరకు రూ.244 పెరగడం గమనార్హం. మరోవైపు గృహ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి నియంత్రించడంతో ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తోంది. దీంతో సాధారణ వినియోగదారులు పూర్తి మొత్తం చెల్లించాల్సి వస్తోంది.  ఈ ఏడాది మార్చి, మే నెలల్లో గృహ వినియోగ వంట గ్యాస్‌ ధరను చమురు సంస్థలు మూడు సార్లు పెంచాయి.


మార్చి 22న రూ.50, మే 7న రూ.50, మే 19న రూ.3.50 చొప్పున వడ్డించాయి. తాజాగా బుధవారం మరో రూ.50 పెంచడంతో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క బండపై రూ.153.50 చొప్పున ధరలు పెరిగిపోయాయి. మొత్తంగా ఏడాది కాలంలో ఒక్కొక్క బండపై రూ.244 భారం పడింది. మరోవైపు.. గతంలో గృహ వినియోగదారులకు ఉన్న సబ్సిడీని 2020 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు పూర్తిగా ఎత్తేసింది. సబ్సిడీ కేవలం అత్యంత నిరుపేదలైన ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే వర్తించనుందని, సిలిండరుకు రూ.200 చొప్పున 9 కోట్ల పేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో సాధారణ వినియోగదారులు మార్కెట్‌ ధరలకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి సాధారణ వినియోగదారులకు కూడా ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద ఇచ్చేవారు. దీనికి మించితే మాత్రమే మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేయాల్సి ఉండేది. అయితే.. ఈ కోటాను కూడా కేంద్రం 2020లోనే ఎత్తేసింది. దేశంలో 27.41 మిలియన్‌ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌ వినియోగిస్తున్నారని, అయితే.. దీనిలో సింహభాగం 16 మిలియన్‌ టన్నుల వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నామని చమురు సంస్థలు చెబుతున్నాయి. దీంతో దిగుమతి వ్యయం, అంతర్జాతీయ ధరలు వంటివి ప్రభావం చూపుతున్నాయని తెలిపాయి. కస్టమ్‌ సుంకాలు, పోర్టు డ్యూస్‌, ఫ్రైట్‌ చార్జీలు ఇలా అనేక ఖ ర్చుల కారణంగానే ధరలు పెంచాల్సి వస్తోందన్నాయి. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ నానాటికీ క్షీణిస్తున్న పరిస్థితి మరింత ప్రభావం చూపిస్తోందని తెలిపాయి. 


రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కూడా ధరల పెంపునకు ఓ కారణమని  చమురు సంస్థలు చెప్పాయి. గ్యాస్‌ ధరల పెంపును ప్ర జా వ్యతిరేక నిర్ణయంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. మహారాష్ట్ర సర్కారును కూల్చేసేందుకు చేసిన ఖర్చును ఈ రూపంలో దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చేత్తో 50 మంది మహావికాస్‌ అఘాడీ రెబల్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. మహారాష్ట్రలో అధికారం దక్కించుకోగానే మరో చేత్తో సిలిండర్‌ ధరను రూ.50 పెంచారని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి మహేశ్‌ తపసే విమర్శించారు.


ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

ఢిల్లీలో మంగళవారం వరకు రూ.1003గా ఉన్న 14.2 కేజీల గ్యాస్‌ బండ ధర రూ.1053కు చేరింది. హైదరాబాద్‌లో రూ.1055 నుంచి రూ.1105కు, విజయవాడలో రూ.1025 నుంచి రూ.1075కు ధరలు ఎగబాకాయి. ముంబైలో రూ.1052, చెన్నైలో రూ.1079, కొల్‌కతాలో రూ.1068.50కి పెరిగాయి. 

Updated Date - 2022-07-07T08:12:57+05:30 IST