Abn logo
Oct 27 2021 @ 13:13PM

గాల్లోకి సీఎన్‎జీ

చెత్త నుంచి గ్యాస్‌ ఉత్పత్తి.. గాల్లో మండిస్తున్న అధికారులు

అగ్రిమెంట్‌లో ఆలస్యం.. 

ఫిల్లింగ్‌కు అవాంతరాలే కారణాలు

ట్రై పార్టీ ఒప్పందం తర్వాతే సరఫరాకు అవకాశం


హైదరాబాద్‌ సిటీ: చెత్త నుంచి వెలువడుతున్న సీఎన్‌జీ వృథా అవుతోంది. సాంకేతిక అవాంతరాలు సీఎన్‌జీ సరఫరాకు అవరోధంగా మారుతున్నాయి. ట్రై పార్టీ ఒప్పందం జరగకపోవడంతో డంపింగ్‌ యార్డు నుంచి ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ను మండిస్తున్నారు. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో 2007 నుంచి 2012 వరకు 12 మిలియన్‌ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. 130 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెత్త కుప్ప నుంచి దుర్వాసన వస్తోంది. ఏటా వర్షాకాలంలో వెలువడుతున్న లీచెట్‌తో పరిసర ప్రాంతాల్లోని చెరువులు, భూగర్భ జలాలు కలుషితమవు తున్నాయి. దీని నివారణకు రూ.146 కోట్ల వ్యయంతో వ్యర్థాల కుప్పపై క్యాపింగ్‌ చేశారు.


చెత్త కుప్పలో 152 బోర్లు (డ్రిల్లింగ్‌) వేశారు. వ్యర్థాల నుంచి వెలువడే వివిధ రకాల వాయువులు పైన ఉండే బెలూన్‌లో చేరేలా ప్రత్యేక పైపులైన్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ వాయువుల్లో మిథేన్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, అమ్మోనియా, సల్ఫర్‌ డయాక్సైడ్‌ ఉంటాయి. మొదటి బెలూన్‌ నుంచి రెండో బెలూన్‌కు వెళ్లే క్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సిస్టమ్‌ ద్వారా వాయువులను శుద్ధి (స్క్రబ్బింగ్‌) చేస్తారు. దీంతో  కేవలం మిథేన్‌ మాత్రమే రెండో బెలూన్‌లో  చేరుతుంది. కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) విధానంలో వెలువడే మిథేన్‌ను రెండో బెలూన్‌ నుంచి సిలిండర్లలో నింపుతారు. ప్రస్తుతం అక్కడున్న వాహనంలోని 20 సిలిండర్లను నింపినట్టు ఓ అధికారి తెలిపారు. 

2 వేల కిలోలు

సీఎన్‌జీ సరఫరా కోసం వ్యర్థాల శాస్ర్తీయ నిల్వ, నిర్వహణ చేసే ప్రైవేట్‌ సంస్థ భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (బీఎన్‌జీఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కిలో సీఎన్‌జీని బీఎన్‌జీఎల్‌ రూ.46కు కొనుగోలు చేయనుంది. మారిన నిబంధనల నేపథ్యంలో గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(జీఏఐఎల్‌)తోనూ ట్రై పార్టీ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ సమగ్ర వ్యర్థాల నిర్వహణ విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే సిలిండర్ల సరఫరా ఆగినట్టు తెలుస్తోంది. దీంతో బెలూన్‌లో నిండిన అనంతరం గ్యాస్‌ను మండిస్తున్నారు. నేరుగా బయటకు వదిలిన పక్షంలో వాయు ఉద్ఘారాల వల్ల పర్యావరణంపై ప్రభావం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మండిస్తున్నామని, దీంతో కేవలం కార్బన్‌ డయాక్సైడ్‌ మాత్రమే వెలువడుతుందని, ఇతర వాయువులతో పోలిస్తే కాలుష్య ప్రభావం తక్కువగా ఉంటుందని ఓ అధికారి చెప్పారు. పేరుకుపోయిన వ్యర్థాల నుంచి గంటకు 600 క్యూబిక్‌ మీటర్ల వాయువులు వెలువడుతున్నాయి. నిత్యం 5 వేల కిలోల సీఎన్‌జీ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 వేల కిలోల సీఎన్‌జీ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అది కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకునే  పరిస్థితి లేదు.


జీఏఐఎల్‌తో ఒప్పందం జరిగిన తర్వాతే సీఎన్‌జీ సిలిండర్ల కొనుగోలు మొదలవుతుందని, అప్పటి వరకు గ్యాస్‌ను మండించాల్సిందే అని ఓ అధికారి తెలిపారు. బీఎన్‌జీఎల్‌, జీఏఐఎల్‌తో ట్రై పార్టీ ఒప్పందానికి సహకరించాలని ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు, నిర్వహణ సంస్థ ప్రతినిధులు పురపాలక శాఖ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను కోరినట్టు తెలిసింది. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అధికారులు చెబుతున్నారు. అయితే, కార్యరూపం దాల్చే వరకు  గ్యాస్‌ను వృథాగా మండించాల్సిందేనని తెలుస్తోంది. 

TAGS: GAS HYDERABAD

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...