Abn logo
Mar 30 2020 @ 04:52AM

గ్యాస్‌ కష్టాలు!

డోర్‌ డెలివరీలో తీవ్ర జాప్యం

బాయ్స్‌ కొరత అంటున్న డీలర్లు

కరోనా వైరస్‌ భయంతో విధులకు రావడం లేదని వివరణ

స్వయంగా వచ్చి సిలిండర్‌ తీసుకువెళ్లాలని సూచన

రవాణా ఖర్చులు తగ్గించి బిల్లు చెల్లించాలని సలహా


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): గ్యాస్‌ కష్టాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ మొదలైన కొద్ది రోజుల్లోనే వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. బుక్‌ చేసిన తరువాత ఎన్ని రోజులకు సిలిండర్‌ డెలివరీ అవుతుందో తెలియని పరిస్థితి. ‘‘కరోనా వైరస్‌ భయంతో గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ రావడం లేదు. అత్యవసరమైతే మీరే వచ్చి సిలిండర్‌ తీసుకువెళ్లండి. కావాలంటే రవాణా ఖర్చులు మినహాయించుకున్నా అభ్యంతరం లేదు’ అంటూ డీలర్లు  ఉచిత సలహా పారేసి చేతులు దులిపేసుకుంటున్నారు. 


వంట గ్యాస్‌కు వినియోగదారులు తిప్పలు పడుతున్నారు. అక్కడా ఇక్కడా అని లేకుండా జిల్లా అంతటా ఒకేలా పరిస్థితి ఉంది. సాధారణ రోజుల్లో గ్యాస్‌ బుక్‌ చేసిన 24 గంటల్లో సిలిండర్‌ డెలివరీ ఇచ్చేవారు. లాక్‌డౌన్‌ పుణ్యాన ఇప్పుడు మూడు రోజులైనా వస్తుందన్న గ్యారంటీ లేకుండా పోయింది. డీలర్‌కు ఫోన్‌ చేస్తే సరైన సమాధానం రావడం లేదు. ఏజెన్సీకి వెళితే కొన్ని మూసి ఉంటున్నాయి. ఏవో కొన్ని ఏజెన్సీలు తెరిచి ఉన్నా డెలివరీ కుర్రాళ్లు రావడం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఎలాగూ ఏజెన్సీ వరకు వచ్చారు కాబట్టి బుకింగ్‌ నంబరు చెప్పి సిలిండర్‌ మీరే తీసుకువెళ్లిపోవాలని ఓ ఉచిత సలహా పారేస్తున్నారు. డెలివరీ కుర్రాడితోనే పంపించాలంటే కొంత సమయం పడుతుందని, ఈ రోజు వస్తుందన్న గ్యారంటీ మాత్రం ఇవ్వలేమని కరాఖండీగా చెప్పేస్తున్నారు.


జిల్లాలో 7 లక్షల మంది వినియోగదారులు

విశాఖ జిల్లాలో సుమారు ఏడు లక్షల మందికి పైగా వంట గ్యాస్‌ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది ప్రతి నెలా సిలిండర్‌ బుక్‌ చేసుకుంటారు. ప్రస్తుతం అందరూ ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. హెచ్‌పీ, ఇండియన్‌, భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీలన్నింటిలోనూ ఒకేలాంటి పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు జిల్లా అధికారులు వెంటనే తగిన పరిష్కారం చూపాల్సి ఉంది.


ఈ సమస్య ఎందుకంట?

నగరంలోని గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో గ్యాస్‌ సిలిండర్లు డెలివరీ చేసే కుర్రాళ్లంతా దాదాపు ఆరిలోవ నుంచే రోజూ డ్యూటీకి వస్తారు. గ్యాస్‌ సరఫరాని ప్రభుత్వం నిత్యావసర సరుకుల జాబితాలో చేర్చడంతో అధికారులు డెలివరీ బాయ్స్‌కి పాసులు మంజూరు చేశారు. పాసు ఉన్నప్పటికీ ఐదు గంటల తర్వాత వీరు కూడా రోడ్లపై తిరగడానికి వీలులేదు. అంటే సాయంత్రం ఐదు గంటల్లోగా వీరు సిలిండర్ల డెలివరీ పూర్తిచేసి ఆరిలోవకు వెళ్లిపోవాలి. అలా వెళ్లకుండా పోలీసులకు దొరికితే కేసు నమోదవుతుంది. అందుకని వారు సాయంత్రం నాలుగు గంటలకు డెలివరీలన్నీ ముగించి ఇంటికి బయల్దేరి పోతున్నారు. దీనివల్ల సాధారణ రోజుల్లో జరిగే స్థాయిలో ఇప్పుడు సిలిండర్ల డెలివరీ జరగడం లేదు. ఇంతకు ముందు రాత్రి ఎనిమిది గంటల వరకు సరఫరా చేసేవారు. 


గేటు బయటే డెలివరీ

కరోనా సమస్య రాకముందు డెలివరీ బాయ్‌ సిలిండర్‌ తెచ్చి ఇంట్లో ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేవారు. అక్కడ ఉన్న ఖాళీ సిలిండర్‌ తీసుకువెళ్లిపోయేవారు. గ్యాస్‌ కంపెనీలు తాజాగా ఇందుకు ఒప్పుకోవడం లేదు. ‘సిలిండర్‌ ఇంట్లోకి తీసుకువెళ్లవద్దు. గేటు వద్దే డెలివరీ చేయండి. ఖాళీ సిలిండర్‌ అక్కడికే తీసుకురమ్మని చెప్పండి’ అంటూ గ్యాస్‌ కంపెనీలు ఆదేశాలు జారీ చేసినట్టు ఓ డీలర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ ఆదేశాల నేపథ్యంలో డెలివరీ కుర్రాళ్లు సిలిండర్లు సరఫరా చేయడానికి భయపడుతున్నారు. గేటు బయట పెట్టి వచ్చేస్తుంటే వినియోగదారులు గొడవకు దిగుతున్నారని, కొంతమంది కొట్టడానికి కూడా వస్తున్నారని, ఇలాగైతే తాము పనిచేయలేమని వాపోతున్నారు.


ఈ కారణం చూపించి చాలామంది కుర్రాళ్లు అసలు పనిలోకే రావడం లేదు. అడిగితే ‘కరోనా భయం మీకేనా... మాకు ఉండదా. మాకు సోకదా. మేము మనుషులం కాదా’ అంటూ ఎదురు సమాధానం చెబుతున్నారని మరో డీలరు వాపోయాడు. ఈ కారణం వల్లే సిలిండర్ల డెలివరీ సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. కంపెనీల నుంచి బుక్‌చేసిన మేరకు సిలిండర్లు వస్తున్నాయని, వాటిని డెలివరీ చేసే కుర్రాళ్లు సరిపడే సంఖ్యలో రాకపోవడం వల్లే ఆలస్యం అవుతోందని డీలర్లు చెబుతున్నారు. కారణం ఏదైనా వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.


కారులో వచ్చి తీసుకువెళ్లండి

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని ఓ డీలర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.... డెలివరీ చేసినందుకుగాను రవాణా ఖర్చులకు ప్రభుత్వం ఒక్కో సిలెండర్‌కు రూ.29.9 ఇస్తుందని, గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వారు గోదాముకు వచ్చి సిలిండర్‌ తీసుకుంటే ఆ డబ్బు మినహాయించుకుని మిగిలిన మొత్తం ఇవ్వొచ్చని చెబుతున్నారు. ద్విచక్ర వాహనంపై సిలిండర్‌ తీసుకువెళ్లాలంటే కచ్చితంగా ఇద్దరు ఉండాలని, అదే రెండుమూడు ఇళ్లవాళ్లు ఒకేసారి సిలిండర్‌లు బుక్‌చేసుకుని కారులో వచ్చి ఒకేసారి తీసుకువెళితే ఆదా అవుతుందని సూచిస్తున్నారు. అందరికీ కార్లు ఉండవు కాబట్టి పోలీసుల అనుమతి తీసుకుని ఆటోలో వచ్చయినా తీసుకు వెళ్లవచ్చని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement