Abn logo
Feb 28 2021 @ 00:13AM

‘గ్యాస్‌’ కబుర్లు ఇంకెన్నాళ్లు....!?

వినియోగదారుల భద్రత గాలిలో దీపమే

అమలుకు నోచని బీమా సౌకర్యం

ఇష్టారాజ్యంగా ఏజెన్సీల తీరు

తనిఖీల పేరుతో రూ.13 కోట్ల బాదుడు

మెంటాడ, ఫిబ్రవరి 27: ప్రభుత్వ ఉదాసీనత.. గ్యాస్‌ ఏజెన్సీల నిర్లక్ష్యం వెరసి వంటగ్యాస్‌ వినియోగదారుల భద్రత గాలిలో దీపంలా మారింది. వారి హక్కులు నేతిబీర చందంగా మారాయి. రక్షణ ఎండమావిని తలపిస్తున్నాయి. గ్యాస్‌ ధరలను ఎప్పటికప్పుడు ఇష్టానుసారం పెంచేస్తూ సామాన్యుల నడ్డి విరచడంలో పోటీ పడుతున్న ప్రభుత్వం, ఏజెన్సీలు వినియోగదారుల కోణంలో అణుమాత్రం కూడా ఆలోచించడం లేదు. వారి అమాయకత్వాన్ని.. అవగాహన లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని బాధ్యాతా రహితంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి వినియోగదారునికీ ప్రమాద బీమా ఉంటుంది. కొత్తగా కనెక్షన్‌ ఇచ్చినప్పుడు బీమా ప్రీమియంతో కలిపి ఏజెన్సీలు వసూలు చేస్తాయి. దురదృష్టవశాత్తు గ్యాస్‌ ప్రమాదం చోటుచేసుకొని వినియోగదారు మరణిస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం/గ్యాస్‌ ఏజెన్సీలు ఐదులక్షల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలి. తీవ్రంగా గాయపడితే లక్ష చెల్లించాలి. ఆస్తినష్టం సంభవిస్తే అదనంగా మరో లక్ష ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లా చరిత్రలో ఒక్కరికి కూడా పరిహారం అందిన దాఖలాలు లేవు. జిల్లావ్యాప్తంగా 31 గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో సుమారు 5 లక్షల 50 వేల గ్యాస్‌ వినియోగదారులన్నారు. ఇప్పటివరకు ఎన్నో గ్యాస్‌ ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. బాధితులంతా బీమా పరిధిలోనే ఉన్నప్పటికీ ఒకటి, అర మినహా మిగతావారికి పరిహారం అందిన దాఖలాలు లేవు.

అవగాహన ఎక్కడ.....?

గ్రామీణుల్లో గ్యాస్‌ బీమా, హక్కుల విషయంలో కనీస అవగాహన ఉండడం లేదు. పట్టణ ప్రాంతీయులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వినియోగదారుల్లో అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఏజెన్సీలతో పాటు కేంద్రప్రభుత్వం పైనా ఉంది. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి వంటగ్యాస్‌ వాడకం, ప్రమాద ఘటన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీమా, హక్కులు తదితరాలపై వారిని వివరించాలి. ఎప్పటికప్పుడు గ్యాస్‌ రెగ్యులేటర్‌, ట్యూబు తదితరవాటిని తనిఖీ చేయాలి. జిల్లాలో అవి మచ్చుకైనా కనిపించడంలేదు.

వారే టెక్నీషియన్లు...!

ఎప్పటికప్పుడు తనిఖీ కోసం ప్రతి గ్యాస్‌ ఏజెన్సీ ఒక టెక్నీషయన్ను నియమించుకోవాలి. ఆర్థికభారం పేరుతో డెలివరీ బాయ్‌లతోనే ఆ పనిని మమ అనిపించేస్తున్నారు. దాదాపు 90 శాతం ఏజెన్సీల్లో ఇదే తంతు నడుస్తోంది.

దిక్కెవరు....?

జిల్లాలో అనేక గ్యాస్‌ ప్రమాదాల్లో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. కొన్నాళ్ల కిందట మెంటాడ మండలం గుర్ల గ్రామంలో ఇటువంటి ప్రమాదం జరిగి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆ కుటుంబం వీధినపడింది. ఇప్పటివరకు ఆ కుటుంబం వైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. ప్రమాదాలపై అధికారులు ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తే వారు నష్టపరిహరం దిశగా చర్యలు చేపట్టాలి. జిల్లాలో అలా జరిగిన దాఖలాలే లేవు

రూ.13 కోట్ల బాదుడు

ఎప్పటికప్పుడు వంటగ్యాస్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తూ.. ఇంకోవైపు వినియోగదారుల భద్రత, హక్కులను గాలికొదిలేస్తున్న ప్రభుత్వం, ఏజెన్సీలు ఐదేళ్లకోసారి తప్పనిసరి తనిఖీ(మెండేటరీ ఇన్‌స్పెక్షన్‌)పేరుతో వినియోగదారుల నుంచి కోట్లది రూపాయలు పిండేస్తున్నాయి. ఒక్కో వినియోగదారు నుంచి 236 రూపాయలు వంతున వసూలు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 5,50,000 కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు 13 కోట్ల రూపాయలను ఈ రూపంలో పిండేస్తున్నట్టు స్పష్టమవుతోంది. తనీఖీ చేయించుకోకుంటే ఇన్సూరెన్స్‌, సబ్సిడీ వంటివి రావని, అలాగే గ్యాస్‌ సరఫరా కూడా నిలిపేస్తామని అంటూ వినియోగదారులను పలురకాలుగా బెదిరిస్తున్నారు. దీంతో చేసేదిలేక మిన్నకుండిపోతున్నారు. మొత్తమ్మీద కొందరి స్వార్థానికి  గ్యాస్‌ వినియోగదారులు నిలువుదోపిడీకి గురువుతున్నారు.

నిబంధనలు పాటిస్తేనే బీమా 

జగదీష్‌బాబు, జిల్లా నోడల్‌ అధికారి

వినియోగదారులు గ్యాస్‌ వినియోగంలో సంబంధిత కంపెనీలు సూచించే నిబంధనలు, మార్గదర్శకాలును పాటిస్తేనే ప్రమాద ఘటనల్లో వారికి బీమా వర్తిస్తుంది. స్వయంకృతం వల్ల ఏమైనా జరిగితే అందుకు కంపెనీలు బాధ్యత వహించవు. గ్యాస్‌ వాడకంలో జాగ్రత్తలపై వినియోగదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సేఫ్టీ కిట్‌ ప్రోగ్రాం ద్వారా వారికి గ్యాస్‌ వినియోగంలో జాగ్రత్తల గురించి చెబుతున్నాం. ప్రతినెల ఓ శుక్రవారం మండల కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నాం. వినియోగదారుల భద్రత, హక్కుల విషయంలో రాజీపడం.


Advertisement
Advertisement
Advertisement