వంటింట్లో గ్యాస్‌ మంటలు!

ABN , First Publish Date - 2022-05-16T06:30:17+05:30 IST

వంటింట్లో వంట చేయకుండానే గ్యాస్‌ మంటపుడుతోంది. ఒకవైపు పెరుగుతున్న ధరలు.. మరోవైపు తగ్గుతున్న తలసరి ఆదాయం, ఉపాధి అవకాశాలతో ప్రతీ కుటుంబంలో వంటగ్యాస్‌ కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న ఇతర నిత్యావసర సరుకుల

వంటింట్లో గ్యాస్‌ మంటలు!

ఆకాశాన్నంటుతున్న గ్యాస్‌బండ ధరలు

ఎల్‌పీజీ రూ.1078, కమర్షియల్‌ రూ.2615

జిల్లాలో 13 గ్యాస్‌ ఏజెన్సీలు, లక్షా పైచిలుకు వినియోగదారులు

సబ్సిడీలోనూ తప్పని కోత

మరోవైపు మండుతున్న నిత్యావసర సరుకుల ధరలు

మహిళలకు తప్పని వంటింటి కష్టాలు

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 15: వంటింట్లో వంట చేయకుండానే గ్యాస్‌ మంటపుడుతోంది. ఒకవైపు పెరుగుతున్న ధరలు.. మరోవైపు తగ్గుతున్న తలసరి ఆదాయం, ఉపాధి అవకాశాలతో ప్రతీ కుటుంబంలో వంటగ్యాస్‌ కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న ఇతర నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్‌ ధరలు పైపైకి ఎగబాకుతూ ప్రజల మీద గుదిబండలా మారుతున్నాయి. ఇప్పటికే ఆల్‌ టైం హై రికార్డులను తాకిన ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ఈనెల 1న పెరిగిన ధరలతో వినియోగదారులు మరింత ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వీటికి తోడు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సిలీండర్‌ ధరల పెంపు సామాన్యులను, రోజు వారి కూలీలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తోంది.

సామాన్యులపై గుది‘బండ’!!

ఇప్పుడిప్పుడే కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న భావనతో కాయకష్టం చేసుకుంటూ కొంత డబ్బును పోగును చేసుకుంటున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెరుగుతున్న సిలిండర్‌ ధర వారి వంటింట్లో వండకుండానే  నిప్పురాజేస్తోంది. ఈ నెల ప్రారంభంలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను పెంచడంతో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.2615, అలాగే ఐదు కిలోల ఎల్‌పీజీ కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.655, 14కిలోల వంట గ్యాస్‌ ధర రూ.1078 పెంచారు. ఇలా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు అమాంతం పెరుగడంతో నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. పట్టించుకోవాల్సిన పాలకులు ధరలు పెంచి సామాన్యులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజంతా ఎండనక, వాననక చెమటోడ్చి పని చేసిన సామాన్య ప్రజలకు కట్టెలపొయ్యితో కష్టాలు తప్పడం లేదు. పెరిగిన ధరలతో గ్యాస్‌ కొనలేని పరిస్థితి ఏర్పడి సామాన్యులు కట్టెలపొయ్యిని ఆశ్రయించక తప్పడం లేదు.

పట్టించుకోని పాలకులు

2014 మార్చి 1వ తేదీన సిలిండర్‌ ధర రూ.416 ఉండేది. ఇప్పుడు అది రూ.1078 చేరింది. ఈ ధరలతో లోలోపల మగ్గిపోవడం తప్ప, ఈ భారీ పెరుగుదలకు ప్రభుత్వాలను నిలదీసే చైతన్యం సగటు మనిషికి లేకుండా పోతోంది. తగ్గించాలనే ఆలోచన, నియంత్రించాలనే నిబద్ధత పాలకులకు లేదు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు కూడా ఇదేతీరున దాదాపు రెట్టింపునకు ఎగబాకడంతో డీజిల్‌ రూ.110, పెట్రోల్‌ రూ.120 వరకు చేరాయి. కరోనా కష్టాలు ఒక పక్క, ఉపాధి లేక మరోపక్క  నిత్యావసరాల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగడంతో సామాన్య ప్రజలపై పెనుభారంగా మారింది.కరోనా కాలంలో ఆహార ధాన్యాలు, ఉచిత సరుకులు అందజేస్తూ కొవిడ్‌ కట్టడి కోసం వ్యాక్సిన్లు, ఆరోగ్యపరమైన మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలు ప్రజల కోసమే వెచ్చిస్తున్నామని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రస్తుతం ప్రజలపై ధరల భారాన్ని మోపుతూ బతకలేని పరిస్థితికి తీసుకొస్తున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో సుమారు నాలుగు లక్షలకపైగా జనాభా ఉండగా.. దీనిలో లక్షకు పైచిలుకు వినియోగదారులున్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా 13 గ్యాస్‌ ఏజెన్సీలలో రెండు భారత్‌ గ్యాస్‌, రెండు ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా.. మిగితావి తొమ్మిది హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఏజెన్సీల ద్వారా జిల్లావ్యాప్తంగా ప్రజలకు వంట, కమర్షియల్‌ గ్యాస్‌లను సరఫరా చేస్తున్నారు. ఫలితంగా డెలివరీ చార్జీలు కలుపుకుంటే అదనంగా మరో రూ.30 అంటే ఒక వినియోగదారుడు గ్యాస్‌కు రూ.1100 చెల్లించాల్సి వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపై దృష్టి సారించి గ్యాస్‌ ధరలు తగ్గించి ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నారు.

ప్రజలకు దక్కని సబ్సిడీ

ఆడబిడ్డల కంట కన్నీరు రాకుండా అల్పాదాయక వర్గాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లను అందించడం కోసమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం తీసు కొచ్చామని గొప్పలు చెబుతూ వచ్చిన ప్రభుత్వం.. ఆడబిడ్డల నెత్తిన గ్యాస్‌బండ రూపంలో గుదిబండను మోపి కన్నీరు పెట్టిస్తోంది. పైగా ప్రజలకు దక్కాల్సిన సబ్సిడీలకు కోతలు విధిస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో మంటలు రేపుతోంది. ప్రజలకు ఇచ్చే రాయితీలో భారీగా కోతలు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఖజానా పై సబ్సిడీ భారాన్ని భారీగా తగ్గించుకుంటూ.. దీంతో గ్యాస్‌ ధర పెరిగినా ప్రతీసారి సామాన్య ప్రజలే బలికాక తప్పడం లేదు. నాలుగేళ్లలోనే గ్యాస్‌ సబ్సిడీపై కేంద్రం రూ.25వేల కోట్ల భారాన్ని తగ్గించుకుంటే సామాన్య ప్రజలకు మాత్రం ధరల భారం తప్పడం లేదు. ఓవైపు ధరలు భారీగా పెంచేస్తూ మరోవైపు రాయితీని ఎత్తేస్తుండడంతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. ఈ క్రమం లో ఉజ్వల పథకం కింద కలెక్షన్లు పొందిన పేదల ప్రజల పరిస్థితి అయితే మరింత దారుణంగా మారింది. జిల్లావ్యాప్తంగా ఉజ్వల పథకం లబ్ధిదారులు వందల సంఖ్యలో ఉండగా.. సిలిండర్‌ ధరలు మాత్రం భారీగా పెరుగుతుండడంతో ఈ పథకం లబ్ధిదారులు గ్యాస్‌ను రిఫిల్‌ చేయించుకోవడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. అయితే గ్యాస్‌ ధరలు ఎందుకు పెంచుతున్నారో? ఇప్పటి వరకు ప్రభుత్వాల ద్వారా స్పష్టమైన సమాధానం లేకపోవడంతో సామాన్య ప్రజల కు గ్యాస్‌ కష్టా లు తప్ప డం లేదు.

గ్యాస్‌ కంటే కట్టెలపొయ్యి నయమనిపిస్తోంది

: సామ దివ్యారెడ్డి, గృహిణి, విద్యానగర్‌ కాలనీ, ఆదిలాబాద్‌

ప్రస్తుతం గ్యాస్‌ ధరలు పెరిగిపోవడంతో గ్యాస్‌ సిలిండర్‌పై వంట చేసుకోవడం కష్టంగా మారింది. నాలుగేళ్ల కింద రూ.400 వచ్చిన గ్యాస్‌బండ, ప్రస్తుతం రూ.1100 చెల్లిస్తే కాని రాని పరిస్థితి ఉంది. మరోపక్క నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో గ్యాస్‌పొయ్యి కంటే కట్టెలపొయ్యి మేలనిపిస్తోంది.

ప్రజలపై ధరల భారం మోపడం సరైంది కాదు

: ముడపు నళినిరెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు

గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో ప్రజలకు అన్నివిధాల ధరల భారం లేకుండా చూస్తామన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలే కాకుండా వంట గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోప డం సమంజసం కాదు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, వంట సరుకులు, గ్యాస్‌ ధరల ను తగ్గించాలి. లేనియెడల ఈ ప్రభుత్వాలకు ప్రజలే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారు.

Updated Date - 2022-05-16T06:30:17+05:30 IST