శరవేగంగా గరుడ వారధి పనులు

ABN , First Publish Date - 2020-11-22T07:26:15+05:30 IST

తిరుపతిలో గరుడ వారధి పనుల్లో వేగం పెరిగింది.

శరవేగంగా గరుడ వారధి పనులు

190కి 185 పిల్లర్ల ఏర్పాటు 

బస్టాండు నుంచి నందిసర్కిల్‌ దాకా

జూన్‌లోపు నిర్మాణం పూర్తి


తిరుపతి - ఆంధ్రజ్యోతి : తిరుపతి రూపు మారుతోంది. స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌, టీటీడీ సంయుక్తంగా నిర్మిస్తున్న గరుడ వారధి నిర్మాణంతో శిల్పారామం నుంచి అలిపిరి దాకా రహదారి స్వరూపమే మారిపోతోంది.గరుడ వారధి  పిల్లర్లు  కొన్ని చోట్ల మూడు వరుసలు, మరికొన్ని చోట్ల రెండు వరుసలు ఏర్పాటు కావడంతో వారధి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి కూడా నగరప్రజలకు కలుగుతోంది.  రూ.684 కోట్ల బడ్జెట్‌తో శిల్పారామం సమీపంలోని మార్కెట్‌ యార్డు నుంచి కపిలతీర్థం వరకు 6 కి.మీ పొడవుతో ప్లైఓవర్‌ పనులకు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారధి నిర్మాణంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. పలుసార్లు నిర్మాణానికి బ్రేకులు పడి విపక్ష, ప్రజా సంఘాల పోరాటంతో వారధి నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. టీటీడీ వాటా నిధులు ఇంకా విడుదల కాకపోయినప్పటికీ స్మార్ట్‌ సిటీ వాటా నిధులతోనే ప్రస్తుతానికి పనులు జరుగుతున్నాయి. నిర్మాణ టెండరును దక్కించుకున్న ఆఫ్కాన్స్‌ సంస్థ 190 పిల్లర్లు, 150 స్పాన్లతో (ఒక స్పాన్‌ దూరం 40 మీటర్లు)తో పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం 185 పిల్లర్లు, 740 పైలింగ్స్‌ పూర్తయ్యాయి. ఈనెల లోపు తక్కిన 5 పిల్లర్లను కూడా పూర్తిచేయనున్నట్టు ఆఫ్కాన్స్‌ ప్రతినిధి రంగస్వామి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌లోపు బస్టాండు నుంచి నంది సర్కిల్‌ వరకు వారధి నిర్మాణం పూర్తి కానుందని చెప్పారు. 


సుబ్బలక్ష్మి కూడలి వద్ద ఇలా..

రామానుజ సర్కిల్‌ వద్ద రైల్వే బ్రిడ్జికి పైన మూడు రహదారుల వారధి ఉంటుంది. మధ్య రహదారి నంది సర్కిల్‌కు వెళితే....ఎడమవైపు ఉండేది ఆర్టీసీ బస్టాండుకు పీఎల్‌ఆర్‌ రోడ్డులో దిగిపోతుంది. ఇక కుడివైపు ఉండే  రహదారి నంది సర్కిల్‌ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలకోసం నిర్మిస్తున్నారు. రామానుజ సర్కిల్‌ నుంచి వారధి కింద రోడ్డు ఎలాగూ ఉంటుంది. అవి ఇప్పుడు ఎలాఉన్నాయో అదేవిధంగా ఉంటాయి. 


లీలామహల్‌ సర్కిల్‌ వద్ద ఇలా..

సుబ్బలక్ష్మి కూడలి నుంచి వచ్చే రెండు రహదారులు ఒకటి నంది సర్కిల్‌ వైపు వెళ్లగా, మరొకటి నంది సర్కిల్‌ నుంచి రామానుజ సర్కిల్‌ వైపు వెళుతుంది. ఇక్కడ ఈ వారధిపైన మరో వారధి వస్తుంది. కరకంబాడి రోడ్డులోని రెండు మద్దిమాన్ల నుంచి వచ్చే రహదారి నంది సర్కిల్‌ వైపు వెళుతుంది. లీలామహల్‌ కూడలి వద్ద వారధి కింద రహదారులు యధావిధిగా ఉంటాయి.



Updated Date - 2020-11-22T07:26:15+05:30 IST