కాకినాడ కల్చరల్, జనవరి 25: ప్రవచన కిరీటి, సహస్రావధాని గరికపాటి నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించ డంతో జిల్లాలో ఆయన సన్నిహితులు, అభి మానులు, బంధువులు సంతోషం వ్యక్తంచేశారు. గరికపాటి జన్మస్థలం పశ్చిమగోదావరి జిల్లా అయినా ఎక్కువభాగం మన జిల్లాతోనే ఆయన అనుబంధం పెనవేసుకుంది. అన్న వరానికి చెందిన శారదతో ఆయనకు వివాహ మైంది. ఉద్యోగరీత్యా వరంగల్ వెళ్లినా తిరిగి కాకినాడ వచ్చారు. స్నేహితులతో కలిసి శాంతినగర్‌లో కోనసీమ జూనియర్ కళాశాలను స్థాపించారు. కొంతకాలం ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలోనూ పనిచేశారు. ‘సాగర ఘోష’ అనే కావ్యాన్ని వెయ్యి పద్యాలతో రచించారు. కాకినాడ రామారావుపేటలోని ఈశ్వర పుస్తక బండాగారంలో నాలుగు అవధానాలు చేశా రు. అలాగే ఆంధ్ర సాహిత్య పరిషత్‌లో ప్రవ చనాలు, సాహిత్య సభలు నిర్వహించారు. రాజేశ్వరి నగర్‌లో ఆయనకు ఇల్లు ఉంది. ఇప్పటికీ సన్నిహితులు ఎందరో ఉన్నారు.