గరికపాటి: అవధాన యోధుడు

ABN , First Publish Date - 2022-01-26T08:45:28+05:30 IST

ప్రవచన కిరీటి, సహస్రావధాని గరికపాటి నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో పశ్చిమగోదావరి జిల్లా పులకించింది. పెంటపాడు మండలం బోడపాడులో గరికపాటి..

గరికపాటి: అవధాన యోధుడు

పెంటపాడు, జనవరి 25: ప్రవచన కిరీటి, సహస్రావధాని గరికపాటి నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో పశ్చిమగోదావరి జిల్లా పులకించింది. పెంటపాడు మండలం బోడపాడులో గరికపాటి సూర్యనారాయణ, వెంకటరవణమ్మ దంపతులకు 1958 సెప్టెంబరు 15న ఆయన జన్మించారు. ఆయనకు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. అందరికంటే చిన్నవాడైన గరికపాటి వెంకట నరసింహరావు(నరసింహాచార్యులు) చిన్నప్పటి నుంచి సాహిత్యంపై మక్కువ. పాఠశాల విద్య అనంతరం పెంటపాడు డీఆర్‌ గోయెంకా కళాశాలలో తెలుగులో బీఏ చేశారు. రాజమండ్రిలో తెలుగు సాహిత్యంపై పీహెచ్‌డీ చేసారు. అనంతరం గురువు బేతవోలు రామబ్రహ్మం వద్ద సాహిత్యం మెరుగులు దిద్దుకున్నారు. తొలుత తాడేపల్లిగూడెంలోని ఓ ముద్రణ శిక్షణ కేంద్రంలో ఉద్యోగిగా చేరి, అక్కడ నుంచే తెలుగు ఉపాధ్యాయ వృత్తి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్‌లో తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు. అనంతరం కాకినాడలో స్థిరపడ్డారు. కాకినాడలోనే  గరికిపాటి జూనియర్‌ కళాశాలను ప్రారంభించారు. అందులో కష్టనష్టాలను చవిచూశారు.


ఆ క్రమంలో బోడపాడులో తనకున్న రెండున్నర ఎకరాల పొలాన్ని అమ్ముకున్నారు. తర్వాత నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చి అవధానంలో పట్టు సాధించారు. ఆధ్యాత్మిక ప్రవచనాల్లో రాటు దేలారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఏఐఎ్‌సఎఫ్‌ విద్యార్థి సంఘంలో పనిచేశారు.  కవిత్వం అంటే ఇష్టపడే గరికపాటి తన ఇద్దరు కుమారులకు  శ్రీశ్రీ, గురజాడ అని పేర్లు పెట్టుకున్నారు. సాగర ఘోష, మన భారతం పద్య కావ్యాలను ఆయన రాశారు. బాప్ప గుచ్చం పద్య కవితా సంపుటికి పేరు ప్రఖ్యాతులు లభించాయి. మా అమ్మ, ఆవాధన శతకం, శతావధాన భాగ్యం, శతావధాన విజయం, కవితా ఖండిక శతావధానం వంటి ఎన్నో రచనలు చేశారు. సాహిత్యంపై పరిశోధనలు కూడా చేశారు. 300కు పైగా అవధానాలు, ఎనిమిది అర్ధశత, శత, ద్విశత అవధానాలు పూర్తిచేశారు. సప్తవర్ణాలు కలిసిన పద్యం, ధార, ధారణ, చమత్కారం, కవిత్వం, సంప్రదాయం, సమస్యాపూరణం అనే ఏడు విశిష్ట లక్షణాలతో అవధాన ప్రక్రియ చేయడంలో గరికపాటిది ప్రత్యేక స్థానం. 1992 మేలో కాకినాడలో 1116 మంది పృచ్ఛకులతో 21 రోజులపాటు 750 పద్యాలు ఏకధాటి ధారణతో మహా సహస్రావధానిగా పేరుపొందారు. 1116 పద్యాలు (5000 పంక్తులు) కలిగిన స్వీయ కావ్యం ‘సాగర ఘోష’ను ఎనిమిది గంటల్లో ఏకధాటి మహాధారణ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 2001లో అమెరికాలో ఎనిమిది కంప్యూటర్లతో అష్టావధానాన్ని నిర్వహించారు. సాగర ఘోష, ధారధారణ, మా అమ్మ, శతావధాన భాగ్యం, అవధాన శతకం తదితర ఎన్నో పుస్తకాలను రచించారు. ‘ధారణా బ్రహ్మరాక్షసుడు, ‘అమెరికా అవధాన భారతి’ తదితర బిరుదులు పొందారు. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’లో నవ జీవన వేదం పేరిట ఆయన ప్రతిరోజూ ఉదయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేవారు. లెక్కలేనన్ని ప్రసంగాలు, అంతేస్థాయిలో సన్మాన పురస్కారాలు ఆయన పాండిత్యానికి దాసోహం అయ్యాయి. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయన సహచర విద్యార్థులు భాస్కరరాజు, బీవీఆర్‌ కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు హ ర్షం వెలిబుచ్చారు. 

Updated Date - 2022-01-26T08:45:28+05:30 IST