పరిహారం గగనమే..!

ABN , First Publish Date - 2022-08-20T06:10:36+05:30 IST

పరిహారం గగనమే..!

పరిహారం గగనమే..!

విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు శాపం

భూములు పోయి.. కౌలు కూడా అందక అవస్థలు

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని అపహాస్యం చేసిన ప్రభుత్వం

రియల్‌ వెంచర్లలో ప్లాట్లు కోల్పోయిన వారి పరిస్థితి దారుణం

జీవో ఇచ్చి ఏడాదిన్నర అయినా అమలు శూన్యం

పరిహారం అందక మూడేళ్లుగా నిర్వాసితుల ఎదురుచూపులు


ఎంతెంత దూరం అంటే.. చాలాచాలా దూరం.. అనేలా ఉంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతుల పరిస్థితి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 700 ఎకరాలు ఇచ్చిన వారి సమస్యలు పరిష్కరించకుండా కావాలనే రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. పొట్టనింపే పొలాన్ని ఫణంగా పెట్టిన వారు కొందరైతే, నీడనిచ్చే ఇంటిని కోల్పోయిన వారు ఇంకొందరు. రియల్‌ వెంచర్లలో ప్లాట్లు అప్పగించి అతీగతీ లేకుండా ఆశగా ఎదురుచూస్తున్న వారు మరికొందరు. మూడేళ్లుగా పరిష్కారం కాక, పరిహారం అందక రాష్ట్ర ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. 

- (ఆంధ్రజ్యోతి, విజయవాడ) 


భూమీ లేదు.. కౌలూ లేదు..

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములిచ్చిన రైతాంగం, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం గాలి కొదిలేసింది. జిల్లా యంత్రాంగం కూడా దీనిని పట్టించుకోవడమే మానేసింది. విమానాశ్రయ విస్తరణ కోసం గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బుద్ధవరం, కేసరపల్లి, అజ్జంపూడి, దావాజీగూడెం, అల్లాపురం, చిన్న అవుటపల్లి గ్రామాలకు చెందిన రైతులు తమ విలువైన భూములు ఇచ్చారు. అమరావతి రాజధాని తరహాలోనే గన్నవరం రైతుల నుంచి కూడా ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు తీసుకున్న కిందటి ప్రభుత్వం ప్యాకేజీని కూడా ప్రకటించింది. కౌలు సదుపాయాన్ని కూడా కల్పించింది. గన్నవరం రైతుల నుంచి 2015, సెప్టెంబరు 15 నాటికి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అప్పగించింది. భూములిచ్చిన రైతుల్లో కొంతమందికే కౌలు వచ్చింది. మూడు విడతల తరువాత అసలు కౌలు ఇవ్వడమే మానేశారు. ప్రతి విడతకు దాదాపు రూ.5 కోట్ల మేర కౌలు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.35 కోట్ల మేర చెల్లించాల్సి ఉన్నా, ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. రైతులు ఇచ్చిన భూముల్లోనే రన్‌వే, నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మించారు. దీంతో రైతులకు భూములు లేకుండాపోయాయి.. కౌలు కూడా రాలేదు.  

అద్దెల మోతతో అవస్థలు

ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు అద్దె ఇళ్లలో జీవిస్తున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పించే వరకు అద్దె చెల్లిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు అద్దె డబ్బు కూడా ఇచ్చింది. ఈ ప్రభుత్వం మాత్రం దానిని పక్కన పెట్టేసింది. అడిగితే జీవో ఇచ్చామని చెబుతోంది. జీవో వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటివరకు అతీగతీ లేదు. దాదాపు రూ.50 లక్షల మేర అద్దె చెల్లించాల్సి ఉంది. అద్దె రాక, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పించక నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 

రియల్‌ వెంచర్ల ప్లాట్లదారులకు పాట్లు

విమానాశ్రయ విస్తరణలో భాగంగా పలు ప్రైవేట్‌ రియల్‌ వెంచర్లలోని ప్లాట్లను కూడా తీసుకోవాల్సి వచ్చింది. ప్రైవేట్‌ వెంచర్లలో ప్లాట్లు కోల్పోయిన వారికి ప్లాట్‌ టు ప్లాట్‌ ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. చర్యలు తీసుకునేలోపే ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కన పెట్టింది. ఓవైపు ప్లాట్లు కోల్పోయి, మరోవైపు ప్రత్యామ్నాయ ప్లాట్లు రాక రియల్‌ యజమానులు అగచాట్లు పడుతున్నారు.

గన్నవరం-పుట్టగుంట రహదారి దుస్థితి

విమానాశ్ర యానికి అప్పగించిన భూముల్లో గన్నవరం-పుట్టగుంట రోడ్డు ఉంది. ఈ రోడ్డును గత ప్రభుత్వం మళ్లించింది. ఇందులో ఒక బ్రిడ్జి మిగిలిపోయింది. దీని పనులను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదు. రోడ్డు మళ్లింపు పనులు కూడా ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉన్నాయి.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకే జీ అపహాస్యం

విమానాశ్రయ విస్తరణలో నిర్వాసితులుగా మారిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పించడం అపహాస్యంగా మారింది. నిర్వాసితులు 480 మందికి పైగా ఉన్నారు. వీరికి చిన్న అవుటపల్లిలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పించేందుకు గత ప్రభుత్వ హయాంలో 48 ఎకరాలను సేకరించి లే అవుట్‌ వేశారు. మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. నిర్వాసితులకు మోడల్‌ ఇళ్లను కట్టించి ఇవ్వాలని అప్పట్లో భావించారు. ఈలోపు ఎన్నికలు వచ్చి వైసీపీ అధికారంలోకి రావడంతో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పక్కకుపోయింది. మోడల్‌ ఇళ్లు కాదని, రూ.9 లక్షలు చెల్లిస్తామని చెప్పింది. దీనికి నిర్వాసితులు అంగీకరించారు. ఆ రూ.9 లక్షలు కూడా రెండు దశల్లో ఇస్తామని చెప్పినా ఒప్పుకొన్నారు. ఈ జీవో వచ్చి సంవత్సరమైనా ఇప్పటికీ నిర్వాసితులకు మొదటి విడత డబ్బు ఇవ్వలేదు.






Updated Date - 2022-08-20T06:10:36+05:30 IST