అందలమెక్కించిన పార్టీపై.. అభాండాలు

ABN , First Publish Date - 2022-08-11T06:05:52+05:30 IST

మునిసిపల్‌ మాజీ చైౖర్మన్‌ గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీ నుంచి నిష్క్రమించారు. దీంతో ఆయన రాజకీయం జీవితం దాదాపు ప్రశ్నార్ధకరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అందలమెక్కించిన పార్టీపై..  అభాండాలు
గంజి చిరంజీవి

ప్రోత్సహిస్తే అవమానించారంటూ ప్రచారాలు

ఏకకాలంలో మూడు పదవులిచ్చిన టీడీపీకి ద్రోహం

పగలు సైకిల్‌... రాత్రయితే ఫ్యాన్‌ !

మంగళగిరిలో గంజి చిరంజీవి విచిత్ర వైఖరి

టీడీపీకి రాజీనామా ..


గుంటూరు,  ఆగస్టు 10: మునిసిపల్‌ మాజీ చైౖర్మన్‌ గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీ నుంచి నిష్క్రమించారు. దీంతో ఆయన రాజకీయం జీవితం దాదాపు ప్రశ్నార్ధకరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2014కు ముందునుంచే చిరంజీవి రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ ఆయన పేరు పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అప్పట్లో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు అనుచరునిగా కొనసాగుతుండేవారు. కాంగ్రెస్‌లో ఎంతకాలం పని చేసినప్పటికీ తనకు రాజకీయంగా    ఎలాంటి ఎదుగుదల లేదంటూ.. ఆయనే ఎన్నోసార్లు వాపోయారు కూడా! అలాంటి సందర్భంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పోతినేని శ్రీనివాసరావు స్నేహధర్మంగా భావిస్తూ చిరంజీవిని టీడీపీలోకి ఆహ్వానించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు నెల ముందు మునిసిపల్‌ ఎన్నికలు రాగా... టీడీపీ తరపున మునిసిపల్‌ చైర్మన్‌గా పోటీ చేసేందుకు సీనియర్‌ నాయకుడైన నందం అబద్దయ్య నిరాకరించారు. చేనేతవర్గం నుంచి ఆ స్థానాన్ని భర్తీ చేయించేందుకు ఇన్‌ఛార్జి హోదాలో పోతినేని శ్రీనివాసరావు మదిలో చిరంజీవి పేరు స్ఫురించింది. అప్పటికప్పుడే మునిసిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటింపజేశారు. ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఇదే సందర్భంలో చిరంజీవి మునిసిపల్‌ చైర్మన్‌గా అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఇంకో మెట్టు పైకి ఎగబాకే ప్రయత్నం చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చినప్పటికీ రాజకీయ చాణక్యనీతిని ప్రదర్శించాడు. ఆ సందర్భంలో టీడీపీ అధిష్టానం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిగా గుంటూరుకు చెందిన తులసీరామచంద్రప్రభు పేరును ప్రకటించగా ఆయన స్థానికేతరుడంటూ నియోజకవర్గంలో వ్యతిరేకత పెల్లుబికింది. అప్పుడు రాత్రికి రాత్రే అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితులను చిరంజీవి చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. రాయలసీమకు చెందిన ఓ ఎంపీ సాయంతో అధినేత చంద్రబాబుకు చెప్పించి ఒత్తిడి చేయించడం ద్వారా తన పేరును మంగళగిరి అభ్యర్థిగా చిరంజీవి ప్రకటింపజేసుకోగలిగారు.  ఆ ఎన్నికల ఫలితాల్లో చిరంజీవి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచాడనే ప్రకటన వరకు దాదాపు వెళ్లిపోయింది. బ్యాలెట్‌ పేపర్ల కౌంటింగ్‌లో సుమారు 200 పైగా ఓట్ల తేడాతో చిరంజీవి విజయం సాధించేశాడు. కౌంటింగ్‌ కేంద్రంలో ఉన్న ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం ఓటమిభారంతో నిరాశతో బయటకు రాబోతున్న సమయంలో.. కౌంటింగ్‌ సిబ్బంది లెక్కించడం మరిచిపోయిన పోస్టల్‌ ఓట్లను కూడ లెక్కించాలని చిరంజీవి హుకుం జారీ చేశాడు. దీంతో సిబ్బంది నాలుక్కరుచుకుని పోస్టల్‌ ఓట్లను లెక్కించారు. ఈ ఓట్లతో ఫలితం తారుమారైంది. పోస్టల్‌ ఓట్లన్నీ దాదాపుగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి అనుకూలంగా పోలవ్వడంతో చిరంజీవి 12 ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నారు.   2014 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయాన్ని సాధించి అధికారంలోకి రావడంతో చిరంజీవి హవా బ్రహ్మండంగా నడిచింది. చిరంజీవిని మునిసిపల్‌ చైర్మన్‌గా కొనసాగనిస్తూనే పార్టీ విధివిధానాలను అనుసరించి ఎమ్మెల్యేగా ఓడిన అభ్యర్థినే నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగించే సంప్రదాయాన్ని టీడీపీ అమలుచేయడంతో చిరంజీవి ఆ ఐదేళ్లు నియోజకవర్గానికి అనధికార ఎమ్మెల్యేగానే ఓ వెలుగు వెలిగాడు. అంటే ఏకకాలంలో చిరంజీవి మునిసిపల్‌ చైౖర్మన్‌గా, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆపై 


ఓడినా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పదవులను చేజిక్కించుకున్నాడు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో.. పార్టీలోకి కొత్తగా వచ్చి ఇలా ఒకేమారు ఇన్నేసి పదవులను దక్కించుకున్న నాయకుడు రాష్ట్రంలో మరెవ్వరూ లేరనే చెప్పాలి.

ఓడలు బండ్లూ, బండ్లు ఓడలు అవుతాయనే సామెత అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మారి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వచ్చీరావడంతోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై ప్రతీకార చర్యలకు దిగింది. ఈ  క్రమంలో మంగళగిరిలో కూడా ప్రతిపక్ష టీడీపి నాయకుల తప్పులపై గురిపెట్టింది. టిడ్కో ఇళ్ల కేటాయింపులో జరిగిన అవినీతి వైసీపీ పెద్దలకు ఓ పెద్ద బ్రహ్మాస్త్రంగా దొరికినట్టయింది. అంతే అప్పటినుంచి చిరంజీవిలో చిన్నగా మార్పు మొదలైంది. ఈ వ్యవహరంలో తనపై వచ్చిన అవినీతి ఆరోపణలనుంచి బయటపడేందుకు చిరంజీవి వైసీపీ పెద్దలతో లోపాయికారి స్నేహాలకు దిగినట్టు నియోజకవర్గంలో చెప్పుకుంటారు. దీంతో మంగళగిరిలో ఆయనకు పగలు సైకిల్‌, రాత్రికి ఫ్యాన్‌ అనే నిక్‌నేమ్‌ పడిపోయింది. దీనికితోడు పలు సందర్భాలలో పలువురు నాయకుల వద్ద ప్రైవేటుగా సాగిన చర్చల్లో కూడ చిరంజీవి వైసీపికి అనుకూలంగా మాట్లాడుతుండడం... పార్టీని విమర్శించి మాట్లాడడం వంటివి టీడీపి 

అధిష్టానం దృష్టికి సాక్ష్యాధారాలతో సహా చేరుతూ వచ్చాయి. 

అయినప్పటికీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవరిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మాత్రం చిరంజీవి విషయంలో చాల సానుకూల దృక్పథాన్నే ప్రదర్శించారు. చిరంజీవికి రాజకీయంగా మంచి ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆయన్ను చీరాల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని భావించారు. ఈవిషయాన్ని ఏడాదిన్నర కిందటే లోకేశ్‌ చిరంజీవికి స్వయంగా చెప్పారు. లోకేశ్‌ సూచనలను మొదట్లో చిరంజీవి గౌరవించి కొద్ది రోజులపాటు చీరాల నియోజకవర్గంలో పర్యటించారు కూడ! ఆ తరువాత ఎంచేతనో ఆయన అనూహ్యంగా చీరాలలో పోటీ చేయాలనే ఆలోచననను పూర్తిగా విరమించుకుని చీరాలవైపు వెళ్లడం మానేశారు. దీంతో చిరంజీవిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా లోకేశ్‌ నియమించి ఆయన్ను రాష్ట్రస్థాయి సమావేశాలకు ఆహ్వానిస్తూ రాష్ట్రస్థాయి నేతగా ప్రమోషన్‌ కూడ ఇచ్చారు. అయినప్పటికీ చిరంజీవిలో రేగిన అసంతృప్తి జ్వాలలు చల్లారలేదు. 

 తనను పార్టీలోకి ఆహ్వానించి ఏకకాలంలో మునిసిపల్‌ చైర్మన్‌గాను, ఎమ్మెల్యే అభ్యర్థిగాను అవకాశం కల్పించడంతోపాటు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా కూడా అద్భుతమైన అవకాశాలను ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పట్ల చిరంజీవి ఎంచేతనో వ్యతిరేకతను పెంచుకుంటూ వచ్చి ఆ పార్టీ నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వెడదామా! అన్న ఆలోచనతో పార్టీలో ముఖ్యంగా ఏడాదిన్నరగా అయిష్టంగానే కొనసాగుతూ వచ్చారు. చిట్టచివరికి పదిరోజుల క్రితం ఆయన పార్టీ నుంచి నిష్క్రమించాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ మేరకు ఢిల్లీలో కొందరు వైసీపీ పెద్దలను కలవడంతోపాటు మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి జగన్‌ను కూడ కలిసినట్టు మంగళగిరిలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో బుధవారం చిరంజీవి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో తనకు సముచిత స్థానాన్ని ఇవ్వకుండా అవమానాలకు గురిచేసినందునే తాను పార్టీనుంచి బయటకు వస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. తన భవిష్యత్‌ కార్యాచరణను మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తానని చిరంజీవి చెప్పినప్పటికీ ఆయన 


వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.. 

Updated Date - 2022-08-11T06:05:52+05:30 IST