ఒకరి నుంచి మరొకరికి..

ABN , First Publish Date - 2021-10-28T06:21:38+05:30 IST

ఆ బాలుడి వయసు 17 సంవత్సరాలు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు.

ఒకరి నుంచి మరొకరికి..

గంజాయి సరఫరాలో లింక్‌

మత్తుకు బానిసలు విద్యార్థులే

పోలీసుల జాబితాలో 560 మంది

కౌన్సెలింగ్‌ ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయత్నం


ఆ బాలుడి వయసు 17 సంవత్సరాలు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. అతడి తల్లి ఉపాధ్యాయురాలు. తన బిడ్డను డిగ్రీలో చేర్చే ప్రయత్నాల్లో ఉన్న ఆమెకు ఓ రోజు పోలీసుల నుంచి ఫోన్‌కాల్‌ వెళ్లింది. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి వెళ్లిన ఆమె తన కుమారుడు గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడని తెలిసి దిగ్ర్భాంతికి గురయింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఈ ఒక్క బాలుడే కాదు.. ఇటువంటి ఎందరో విద్యార్థులు  ఒకరి ద్వారా మరొకరు.. గంజాయికి అలవాటుపడ్డారు. విజయవాడ పోలీసుల లెక్క ప్రకారం నగరంలో 560 మంది విద్యార్థులు, యువకులు గంజాయికి బానిసలయ్యారు. మాదకద్రవ్యాలపై రాష్ట్రం అంతటా చర్చ జరుగుతున్న తరుణంలో నగర పోలీసులు ఆయా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి, మాట్లాడారు. ఇప్పటికే నగరంలో గంజాయి తాగే స్నేహితుల మధ్య బలమైన లింక్‌ ఏర్పడినట్టు గుర్తించారు. గంజాయి ఎలా వస్తుందనే ప్రశ్నకు అందరి జవాబూ ఒక్కటే.. స్నేహితుల ద్వారా అందుతోందని. వారికి ఎక్కడి నుంచి వస్తోందనే ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వలేదు.


240 కేసులు... 8వేల కిలోలు

విజయవాడ నగర పోలీసులు దాడులు నిర్వహించి, ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 240 కేసులను నమోదు చేశారు. మన్యం నుంచి గంజాయి మొత్తం రవాణా అవుతోంది. సరఫరా కేంద్రం నుంచి జాతీయ రహదారి వెంబడి అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదంతా అత్యంత రహస్యంగా సాగుతోంది. ఒక కళాశాలలో పది మంది స్నేహితులు ఉంటే, వారిలో ఒకరి ద్వారా మిగిలిన వారికి గంజాయి అందడం మొదలైంది. ఇంట్లో తల్లిదండ్రులకు రకరకాల కారణాలు చెప్పి బయటకు వస్తున్న విద్యార్థులు స్నేహితులతో కలిసి వివిధ ప్రదేశాల్లో గంజాయి తాగడం మొదలుపెడుతున్నారు. ఇప్పటి వరకు పోలీసులకు చిక్కిన వాళ్లంతా అటువంటి వారే. ఇలా చిక్కిన వారి సంఖ్య 560కి చేరింది. ఈ లెక్క ఇంకా ఎక్కువగానే ఉంటుందనేది పోలీసులు అంచనా. గంజాయి వాడకం చైన్‌ మాదిరిగా మారడంతో పోలీసు వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


విపరీత మార్పులు

బుద్ధిమంతుల్లా ఉన్న తమ పిల్లల ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పులు రావడాన్ని గుర్తించామని చాలా మంది తల్లిదండ్రులు చెప్పారు. వారు అడిగిన దానికి కాదు.. లేదు అనే సమాధానాలు వస్తే విధ్వంసం సృష్టించేవారని ఆవేదనతో చెప్పారు. పోలీసుల నుంచి ఫోన్లు వచ్చే వరకు తమకు అసలు విషయం తెలియలేదని కొందరు తల్లులు కంటతడి పెట్టుకున్నారు. పోలీసుల కౌన్సెలింగ్‌తోపాటు నిత్యం పర్యవేక్షిస్తూ, తమ పిల్లలను గంజాయికి దూరం చేసిన తల్లులు కూడా ఉన్నారు.


ఏడాది కాలంగా ప్రత్యేక డ్రైవ్‌ 

కమిషనరేట్‌ పరిధిలో ఏడాది కాలంగా గంజాయి రవాణాపై నిఘా పెట్టడంతో పాటు, వాడకాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. గంజాయి ఉపయోగిస్తున్న 560 మంది విద్యార్థులు, యువకులను గుర్తించాం. వారికి మూడు నెలలకు ఒకసారి తల్లిదండ్రులు సహా పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కౌన్సెలింగ్‌ ద్వారా మార్పు తీసుకొస్తున్నాం.  - బత్తిన శ్రీనివాసులు, సీపీ

Updated Date - 2021-10-28T06:21:38+05:30 IST