గుప్పుమంటున్న గంజాయి

ABN , First Publish Date - 2021-10-19T04:30:54+05:30 IST

సిద్దిపేట జిల్లాలో గంజాయి గుప్పుమంటున్నది. ఇదివరకు పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి చాపకిందనీరులా గ్రామాలకూ వ్యాపిస్తున్నది. మత్తుకు యువత, విద్యార్థులు చిత్తవుతున్నారు.

గుప్పుమంటున్న గంజాయి

బానిసవుతున్న యువత 

సిద్దిపేట పట్టణ శివారులో అడ్డాలు

పట్టించుకోని పోలీస్‌, ఆబ్కారీ శాఖలు


సిద్దిపేట క్రైం, అక్టోబరు 18 : సిద్దిపేట జిల్లాలో గంజాయి గుప్పుమంటున్నది. ఇదివరకు పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి చాపకిందనీరులా గ్రామాలకూ వ్యాపిస్తున్నది. మత్తుకు యువత, విద్యార్థులు చిత్తవుతున్నారు. మత్తుకు బానిసై నేరాలకు పాల్పడుతూ బంగారు భవిష్యత్తును బలిపెడుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారాలు కూడా క్రమంగా మత్తుకు బానిసవుతున్నారు. జిల్లాకేంద్రం శివారు ప్రాంతాల్లోని పొన్నాల పినాకిని క్లబ్‌ మత్తుకు వేదికవుతున్నాయి. క్లబ్‌లోని చెట్ల కింద, పత్తి మార్కెట్‌ గ్రౌండ్‌, గర్ల్ప్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో అడ్డాలు ఏర్పాటు చేసుకొని గుప్పుగుప్పున గంజాయి ఊదేస్తున్నారు. మత్తుకు అలవాటుపడుతున్న వారిలో ఎక్కువగా 20 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. విద్యార్థులు, యువకులతోపాటు కూలీ చేసుకునేవారు కూడా మత్తుకు బానిసవుతున్నారు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు విషయం తెలుసుకొని గుట్టుచప్పుడుకాకుండా తమ పిల్లలను రీహ్యాబిలిటేషన్‌ సెంటర్లకు పంపిస్తున్నారు.


హైదరాబాద్‌ నుంచే..

హైదరాబాద్‌కు చెందిన ముఠాలు మధ్యవర్తుల సహకారంతో స్థానికంగా గంజాయి విక్రయిస్తున్నాయి. సిద్దిపేట పట్టణంలోని నాసర్‌పురా, గణేష్‌ నగర్‌, దోబీగల్లీ, బారాహిమామ్‌, బోయిగల్లీ, నర్సాపూర్‌ చౌరస్తాల్లో గంజాయి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గంజాయితోనే ఆగకుండా డ్రగ్స్‌ కూడా చేరవేస్తున్నారని తెలుస్తున్నది. ఇటీవల పోలీసుల తనిఖీల్లో కొకైన్‌ పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. కొకైన్‌ను తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగదాంపల్లి శివారులో తనిఖీలు చేపట్టారు. సిద్దిపేటలో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా, వారందించిన సమాచారం మేరకు సిద్దిపేట రూరల్‌ మండలం చిన్నగుండవెళ్లి శివారులోని మామిడితోటలో దాచిఉంచిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆశతో పలువురు డ్రగ్స్‌ పెడలింగ్‌కు పాల్పడుతున్నారు. ఒక్కసారి డ్రగ్స్‌ రవాణాచేస్తే నెల మొత్తానికి సరిపడా డబ్బు వస్తుండటంతో ఈ పనిచేస్తున్నారు. వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటుపడుతున్నారు. జిల్లాలో గంజాయి, మత్తుపదార్థాలు యథేచ్ఛగా సరఫరా అవుతున్నా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడంలేదు. మత్తుపదార్థాలను అరికట్టాల్సి ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు మొక్కుబడిగా స్పందిస్తున్నారు. 

Updated Date - 2021-10-19T04:30:54+05:30 IST