పేటలో 200 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-12-06T05:24:29+05:30 IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో రూ.24లక్షలు విలువచేసే 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

పేటలో 200 కిలోల గంజాయి పట్టివేత
గంజాయి వివరాలు తెలుపుతున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్‌

సూర్యాపేట క్రైం, డిసెంబరు 5: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో రూ.24లక్షలు విలువచేసే 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ వెల్లడించారు. జిల్లా టాస్క్‌ ఫోర్స్‌, సీసీఎస్‌, మద్దిరాల పోలీసులు సంయుక్తంగా మద్దిరాల మండల పరిధిలోని పోలుమళ్ల క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, రెండు కార్లలో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. అనంతగిరి మండలం పలరాంతండాకు చెందిన భూక్యా సాయి, మద్దిరాల మండలం తూర్పుతండాకు చెందిన భూక్యా నవీన్‌కుమార్‌, ఆత్మకూర్‌(ఎస్‌) మండలం గట్టికల్లు గ్రామానికి చెందిన గుండు నరేష్‌ విశాఖపట్నం జిల్లా చింతూరు ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు రవాణా చేస్తున్నారు. వీరి నుంచి రూ.24లక్షలు విలువచేసే 200కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లను, సీజ్‌ చేసి ముగ్గురు నిందితులను రిమాండ్‌కు పంపారు. వీరు విశాఖపట్నంలో కిలో గంజాయి రూ.1000కు కొనుగోలుచేసి మహారాష్ట్రలో రూ.4వేలకు విక్రయిస్తున్నారు. నిందితుడు భూక్యా సాయిపై ఇప్పటికే ఏపీ రాష్ట్రం చింతూరులో కేసు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ మోహన్‌కుమార్‌, సీసీఎస్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌, తుంగతుర్తి సీఐ రవి, మద్దిరాల ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:24:29+05:30 IST