రూ. 60 వేలతో 6 లక్షల సంపాదన... నూనె రూపంలో గంజాయి!

ABN , First Publish Date - 2020-12-04T19:09:32+05:30 IST

నిషేధిత మత్తు పదార్థాలు, డ్రగ్స్‌ సరఫరా చేసే స్మగ్లర్లకు నగరం ప్రధాన కేంద్రంగా మారింది. ముఖ్యంగా గంజాయి సరఫరా విచ్చలవిడిగా జరుగుతోంది. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో సరఫరాను కొనసాగిస్తున్నారు. స్మగ్లర్లు గంజాయిని నూనెలా మార్చి సరఫరా చేస్తున్నారు.

రూ. 60 వేలతో 6 లక్షల సంపాదన... నూనె రూపంలో గంజాయి!

రూటు మార్చిన స్మగ్లర్‌లు

హషీష్‌ ఆయిల్‌ పేరిట ఆన్‌లైన్‌ విక్రయం

ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ద్వారా సరఫరా

పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): నిషేధిత మత్తు పదార్థాలు, డ్రగ్స్‌ సరఫరా చేసే స్మగ్లర్లకు నగరం ప్రధాన కేంద్రంగా మారింది. ముఖ్యంగా గంజాయి సరఫరా విచ్చలవిడిగా జరుగుతోంది. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో సరఫరాను కొనసాగిస్తున్నారు. స్మగ్లర్లు గంజాయిని నూనెలా మార్చి సరఫరా చేస్తున్నారు. ఈ నూనెను హషీష్‌ ఆయిల్‌గా వ్యవహరిస్తున్నారు. లీటరు పరిమాణం ఉండే ప్లాస్టిక్‌ సీసాల్లో  నూనెను నింపి, ఎవరికీ అనుమానం రాకుండా బస్సుల్లో తరలిస్తున్నారు. ఇలాంటి నూనెను స్మగ్లింగ్‌ చేస్తున్న వీరపల్లి లక్ష్మీపతి అనే యువకుడు కొద్ది రోజుల క్రితం రాచకొండ పోలీసుల బృందానికి చిక్కాడు. అతడిని విచారించగా.. హషీష్‌ ఆయిల్‌ గురించిన పలు వివరాలు వెలుగుచూశాయి.


గంజాయిని గానుగాడించి

పోలీసుల కఠిన చర్యల నేపథ్యంలో.. క్వింటాళ్ల కొద్దీ గంజాయిని సరఫరా చేయడం స్మగ్లర్‌లకు కష్టంగా మారింది. దాంతో గంజాయిని ద్రవరూపంలో విక్రయించేందుకు పథకం వేశారు. విశాఖ ఏజెన్సీలో ఎండబెట్టిన గంజాయిని గానుగాడించి మెత్తటి గుజ్జులా చేస్తున్నారు ఆ తర్వాత  ఆ గుజ్జును లీటర్‌ టిన్నులలో నింపి స్మగ్లర్‌లకు ఇస్తున్నారు. స్మగ్లర్లు లేఆ వారి మనుషులు మామూలు ప్రయాణికుల్లా బస్సుల్లో ప్రయాణిస్తూ నగరానికి తరలిస్తున్నారు. 


లీటరు నూనెను రూ. 60 వేల నుంచి రూ. 70 వేలకు స్మగర్లు కొనుగోలు చేస్తుండటం గమనార్హం. వైజాగ్‌ నుంచి వచ్చిన గంజాయి గుజ్జుకు నగరంలో ఆల్కహాల్‌ కలిపి దాన్ని హషీష్‌ ఆయిల్‌గా మారుస్తున్నారు. ఈ ప్రక్రియ అనంతరం లీటరు గంజాయి గుజ్జు రెండు లీటర్ల నూనెగా మారుతుంది.  


కోరిన ప్రాంతానికి డెలివరీ

అరకు నుంచి గంజాయి విక్రేత నగేష్‌ వద్ద లక్ష్మీపతి గంజాయి పేస్టును కొనుగోలు చేశాడు. దాన్ని మణికొండలో తాను ఉంటున్న గదికి తీసుకొచ్చేవాడు. అక్కడ ఆల్కహాల్‌ కలిపి, 10 మిల్లీలీటర్ల డబ్బాలలో నింపేవాడు.ఆ తర్వాత డంజో, స్విగ్గీ, ఉబెర్‌ వంటి డోర్‌ డెలివరీ యాప్‌లలో తన పేరు నమోదు చేసుకొని కొనుగోలుదారులకు కోరిన ప్రాంతానికి డెలివరీ అయ్యేలా ఏర్పాట్లు చేశాడు. ఈ నూనె కావాలనుకునేవారు ‘ఐటెమ్‌’ పేరుతో ఆర్డర్‌ చేయాలని ముందుగానే కస్టమర్లకు లక్ష్మీపతి చెప్పేవాడు. 150 మంది లక్ష్మీపతి వద్ద హషీష్‌ నూనెను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మీపతి ముఠాకు చెందిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామని.. ఆ ఇద్దరూ దొరికితే ఈ దందాలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.


రూ. 60 వేలతో 6 లక్షల సంపాదన

లీటర్‌ గంజాయి పేస్టును ఒక స్మగ్లర్‌ రూ. 60 వేలకు కొనుగోలు చేసి దాన్ని రెండు లీటర్ల హషీష్‌ ఆయిల్‌గా మారుస్తున్నాడు. తర్వాత ఆ నూనెను 10 మిల్లీలీటర్ల సీసాల్లో నింపుతారు. 10ఎంఎల్‌ డబ్బాను రూ. 3 వేల నుంచి రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. నగరంలోని చాలామంది యువకులు హషీష్‌ నూనెకు బానిసలైనట్లు పోలీసులు గుర్తించారు. రెండు లీటర్ల హషీష్‌ ఆయిల్‌ ద్వారా స్మగ్లర్లు రూ. 6 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-12-04T19:09:32+05:30 IST