గంజాయి ఇచ్చుకో.. బ్రౌన్‌షుగర్‌ పుచ్చుకో!

ABN , First Publish Date - 2022-05-07T17:46:30+05:30 IST

బ్రౌన్‌షుగర్‌, గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను

గంజాయి ఇచ్చుకో.. బ్రౌన్‌షుగర్‌ పుచ్చుకో!

  • ముంబై టు హైదరాబాద్‌ డ్రగ్స్‌ దందా
  • నలుగురి అరెస్ట్‌.. 
  • రూ. 23.61 లక్షల బ్రౌన్‌షుగర్‌, గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ : బ్రౌన్‌షుగర్‌, గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 23.61 లక్షలు విలువైన బ్రౌన్‌ షుగర్‌, 28 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోని నిందితులు బ్రౌన్‌ షుగర్‌ను, గంజాయిని ఇచ్చి, పుచ్చుకుంటూ దందా చేస్తుండడం గమనార్హం. శుక్రవారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.


ఈ కేసులో ప్రధాన నిందితుడు ముంబై, ధారావి ప్రాంతానికి చెందిన చాంద్‌ షహజాదా సయ్యద్‌ (43). ప్లంబర్‌ పనిచేస్తూ డ్రగ్స్‌ సరఫరాదారుడి అవతారమెత్తాడు. 2010లోనే ముంబైలోని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో పోలీసులకు చిక్కాడు. రెండో నిందితుడు షేక్‌ అబ్దుల్‌ ఆలం ఖాద్రి (40). కాలాపత్తర్‌ మొబైల్‌ షాపు నిర్వహిస్తున్నాడు. గతంలో బిస్కెట్ల వ్యాపారం చేసేవాడు. సంపాదన సరిపోకపోవడంతో గంజాయి సరఫరా చేయడం ప్రారంభించాడు. 2018లో విదేశీ (దుబాయ్‌) కరెన్సీ సరఫరా చేస్తూ కస్టమ్స్‌ అధికారులకు చిక్కడంతో కేసు నమోదైంది. మరో నిందితుడు ఖాద్రి స్నేహితుడు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్‌ ఖాసిం (34). ఉప్పల్‌లో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తుంటాడు.


ఖాసింపై 2018లోనే ఎన్‌డీపీఎస్‌ యాక్టు కింద కేసు నమోదై ఉంది. విశాఖ జిల్లా నుంచి రమేశ్‌ అనే వ్యక్తి వద్ద గంజాయి కొని ఖాసిం నగరానికి తెచ్చి రూ. 8వేలకు కేజీ చొప్పున ఆలం ఖాద్రికి అమ్మేవాడు. ఈ క్రమంలో ముంబైకి చెందిన షహజాదాతో ఖాద్రీకి స్నేహం ఏర్పడింది. షహజాదా అప్పటికే బ్రౌన్‌ షుగర్‌ దందా చేసేవాడు. దీంతో ఆలం ఖాద్రి అతడి నుంచి బ్రౌన్‌ షుగర్‌ తీసుకుని, అతడికి గంజాయి ఇచ్చేవాడు. ఇలా అందరూ కలిసి డ్రగ్స్‌ దందా చేసేవారు. ఖాద్రీ బ్రౌన్‌షుగర్‌ను స్నేహితుడైన రియల్‌ వ్యాపారి షాహెద్‌ కమాల్‌ (41)కు రూ. 2500కి గ్రాము చొప్పున అమ్మేవాడు. అతడు తన కస్టమర్లకు రూ. 7వేల నుంచి రూ.9వేలకు గ్రాము చొప్పున విక్రయించేవాడు.


డ్రగ్స్‌తో లింకులున్న పలువురు కాలాపత్తర్‌ పీఎస్‌ పరిధిలో ఉన్నారన్న సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితుల్లో చాంద్‌ షహజాదా సయ్యద్‌, షేక్‌ అబ్దుల్‌ ఆలం ఖాద్రి, షేక్‌ ఖాసిం, షాహెద్‌ కమాల్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు బ్రౌన్‌షుగర్‌ సరఫరాదారుడు మహేశ్‌, గంజాయి సరఫరాదారుడు రమేశ్‌లు పరారీలో ఉన్నారు.


మరో కేసులో యువకుడి అరెస్ట్‌

గంజాయితో పాటు ఎల్‌ఎస్‌డీ వంటి మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న యువకుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అల్వాల్‌కు చెందిన బ్రాండెన్‌ మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ 2017లో పట్టుబడ్డాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నాడన్న సమచారంతో రవీంద్రభారతి వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 11 ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు, 60 గ్రాముల గంజాయి, ఎక్స్‌ట్రసీ పిల్‌, ఎండీఎంఏ పైప్స్‌తో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.


డ్రగ్‌ బాధితులకు కౌన్సెలింగ్‌

మాదకద్రవ్యాల వినియోగదారులు, సరఫరా దారుల్లో మానసికంగా మార్పు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎర్రగడ్డలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ (ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం)లో వారికి కౌన్సెలింగ్‌/చికిత్స అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు చికిత్సాలయం హెచ్‌ఓడీ, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డా. ఎస్‌.శిరీషతో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ‘ది ఆశా గ్రూప్‌ హాస్పిటల్స్‌’, ‘ఫినిక్స్‌ రిహాబ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, అమృతా ఫౌండేషన్‌ సొసైటీలతో ఒప్పందం చేసుకున్నారు. నగరాన్ని డ్రగ్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు కౌన్సెలింగ్‌ చాలా అవసరమని, గతంలో చిక్కిన వారికి తరచూ డ్రగ్స్‌ టెస్టులు నిర్వహిస్తూ వారు డ్రగ్స్‌కు దూరమయ్యారా లేదా అనే విషయాలపై దృష్టి సారిస్తామని సీపీ చెప్పారు.

Read more