గుప్పుమంటున్న గంజాయి

ABN , First Publish Date - 2021-07-31T04:16:48+05:30 IST

మెదక్‌ జిల్లాలో ఇటీవల గంజాయి వాడకం ఆనవాళ్లు బయటపడుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా పెద్దశంకరంపేట, మెదక్‌, రామాయంపేటతో పాటు పారిశ్రామిక ప్రాంతాలైన చేగుంట, నర్సాపూర్‌ ప్రాంతాల్లో కొంతమంది యువకులు, విద్యార్థులు, కార్మికులే లక్ష్యంగా గంజాయి అమ్ముతున్నారు.

గుప్పుమంటున్న గంజాయి

మెదక్‌ జిల్లాలో విచ్చలవిడిగా విక్రయాలు

విద్యార్థులు, కార్మికులే లక్ష్యం

మత్తుకు బానిసవుతున్న యువత


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూలై 30 : మెదక్‌ జిల్లాలో ఇటీవల గంజాయి వాడకం ఆనవాళ్లు బయటపడుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా పెద్దశంకరంపేట, మెదక్‌, రామాయంపేటతో పాటు పారిశ్రామిక ప్రాంతాలైన చేగుంట, నర్సాపూర్‌ ప్రాంతాల్లో కొంతమంది యువకులు, విద్యార్థులు, కార్మికులే లక్ష్యంగా గంజాయి అమ్ముతున్నారు. వ్యసనపరుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని నిర్జన ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. అలవాటు పడిన వారు మాత్రం అప్పు చేస్తూ కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేస్తున్నారు. జిల్లాకు గంజాయి ఎక్కువగా హైదరాబాద్‌, ధూళిపేట, నారాయణఖేడ్‌, పెద్దగుట్ట ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నట్లు సమాచారం.


అలవాటుకు కారణాలెన్నో !

జిల్లావ్యాప్తంగా గంజాయి విక్రయ ముఠాలతో చేతులు కలిపి గంజాయి విక్రయించడం, లేకుంటే అలవాటుగా చేసుకుంటున్న యువతను పరిశీలిస్తే.. తల్లిదండ్రుల పర్యవేక్షణ అంతంతమాత్రం ఉండటం, ఎవరి నియంత్రణ లేకపోవడంతోనే చెడుమార్గంలో పయనిస్తున్నారని పోలీసులు, ఆబ్కారి అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు యువకులు గంజాయి ముఠాలతో చేతులు కలుపుతూ కేసుల పాలై విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముఠా సభ్యులు కూడా ప్రత్యేక కోడ్‌ భాషను వాడుకుంటూ విక్రయిస్తున్నట్లు సమాచారం. 


ఏడాది కాలంగా పట్టుబడిన కేసులు

-ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధికి చెందిన చిన్నయగారి శ్రీకాంత్‌ అనే యువకుడు గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద రూ.21 వేల విలువ గల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

-ఈ నెల 25న మెదక్‌ పట్టణంలోని పిట్లం చెరువు దగ్గర గంజాయి విక్రయిస్తూ ఫతేనగర్‌ ప్రవీణ్‌, కొలిగడ్డ రాజు, రాజ్‌పల్లి గ్రామానికి చెందిన షేక్‌ హర్షద్‌ను జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టుకొని అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి 50 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

-గతేడాది జూన్‌ 21న పెద్దశంకరంపేటలో 40 కిలోల గంజాయిని జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

-గతేడాది అక్టోబరు 7న చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్టీల్‌ పరిశ్రమ వర్కర్స్‌ కాలనీల్లో రెండు గదుల్లో 600 గ్రాముల చొప్పున ఉన్న 90 గంజాయి ప్యాకెట్లను, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.10 వేలు ఉంటుంది. గంజాయిని విక్రయిస్తున్న చింటు కుమార్‌, బబ్లూ, అనిల్‌ మోహతాపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 


నిఘా పెడుతున్నాం

గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టి అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మత్తు పదార్థాల రవాణా కట్టడి బాధ్యత పోలీసులదే కాదు అందరిది. గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసినా.. చేరవేసే వ్యక్తుల గురించి తెలిసినా ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వండి. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

-సూరా కృష్ణ, ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ 

Updated Date - 2021-07-31T04:16:48+05:30 IST