గ్యాంగ్‌వార్‌!

ABN , First Publish Date - 2020-06-01T09:23:45+05:30 IST

ఒకరు ఇంటికి వెళ్లి వార్నింగ్‌ ఇస్తే...

గ్యాంగ్‌వార్‌!

సినీ ఫక్కీలో పరస్పరం దాడులు

తీవ్రంగా గాయపడిన ఒకరి మృతి

అపస్మారక స్థితిలో మరొకరు

గుంటూరు ఆస్పత్రికి తరలింపు

దాడుల్లో పాల్గొన్న వారిపై రౌడీషీట్‌


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఇద్దరు మిత్రుల మధ్య వివాదం.. మరొకరి వద్ద పంచాయితీ.. తెరమీదకు ఇద్దరు గ్యాంగ్‌లీడర్లు.. రాళ్లు, కత్తులతో సినీ ఫక్కీలో యుద్ధం.. చివరకు తీవ్ర గాయాలతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఒకరు మృతి చెందగా, మరొకరు గుంటూరు ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు. విజయవాడ పటమట డొంకరోడ్డులో జరిగిన ఈ గ్యాంగ్‌ వార్‌తో నగరం ఉలిక్కిపడింది. 


ఒకరు ఇంటికి వెళ్లి వార్నింగ్‌ ఇస్తే... మరొకరు షాపు వద్దకు వచ్చి గలాటా సృష్టించారు. ఇద్దర్లో ఎవరూ తగ్గలేదు. అనుచరులతో పరస్పరం వార్నింగ్‌లిచ్చుకున్నారు.. దాడులు చేసుకున్నారు. విజయవాడ పటమట డొంకరోడ్డులోని ఒక ఖాళీ ప్రదేశంలో శనివారం దాడులు చేసుకున్న వారిలో తోట సందీప్‌ ప్రాణాలు కోల్పోగా, పండు ప్రాణాపాయ స్థితిలో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


అసలేం జరిగింది?

ధనేకుల శ్రీధర్‌, ప్రదీప్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగస్వాములు. పెనమలూరులో ఓ ఖాళీ స్థలాన్ని డెవలప్‌మెంట్‌కు తీసుకున్నారు. దీనిలో 14 ఫ్లాట్లు నిర్మించాల్సి ఉంది. ప్రదీప్‌రెడ్డి రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత తన వల్ల కాదని చేతులెత్తేయగా, శ్రీధర్‌ మరికొంతమందిని భాగస్వాములను చేసుకుని నిర్మాణాన్ని పూర్తిచేశాడు. కొద్దిరోజుల తర్వాత తన వాటా గురించి ప్రదీప్‌రెడ్డి అడగడం మొదలుపెట్టాడు. శ్రీధర్‌ అందుకు సిద్ధపడలేదు. ఈ పంచాయితీ ‘స్పందన’ వరకు వెళ్లింది. సివిల్‌ వివాదం కావడంతో కోర్టులో తేల్చుకోవాలని చెప్పి పోలీసులు అర్జీని తిరస్కరించారు. 


రాజీకి ‘నాగాస్త్రం’

ఈ పంచాయితీ నాగబాబు అనే వ్యక్తి వద్దకు వెళ్లింది. ఇతడికి డొంకరోడ్డులో శివ బాలాజీ ఎంటర్‌ప్రైజస్‌ పేరుతో ఐరన్‌ వ్యాపారం చేస్తున్న తోట సందీప్‌, కానూరు సనత్‌నగర్‌లో ఉంటూ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న మణికంఠ అలియాస్‌ కేటీఎం పండుతో పరిచయం ఉంది. ఖరీదైన ఈ అపార్ట్‌మెంట్‌ వివాదంలో ఒకరి వైపు పూర్తిగా నిలబడి ఉంటానని డీల్‌ కుదుర్చుకున్న నాగబాబు ముందుగా రంగంలోకి తోట సందీప్‌ను దించాడు. తర్వాత అతడికి తెలియకుండా పండును సీన్‌లోకి తీసుకొచ్చాడు.


దీంతో ఆగ్రహించిన సందీప్‌ శనివారం సనత్‌నగర్‌లోని పండు ఇంటికి అనుచరులతో కలిసి వెళ్లాడు. పండు ఇంట్లో లేకపోవడంతో అతడి తల్లిపై కేకలు వేసి వచ్చాడు. ఇంటికి వచ్చిన పండు తల్లి ద్వారా విషయం తెలుసుకుని అదే కోపంతో నలుగురు అనుచరులతో కలిసి శివబాలాజీ ఐరన్‌ షాపు వద్దకు వెళ్లి గలాటా సృష్టించాడు. ఆ సమయంలో సందీప్‌ అక్కడ లేడు. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్‌లో పరస్పరం వార్నింగ్‌లు ఇచ్చుకున్నారు. 


సినీ ఫక్కీలో...

సందీప్‌ షాపు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలోకి పండు 20 మంది యువకులతో వచ్చాడు. సందీప్‌ బ్యాచ్‌ 25 మంది ఐరన్‌ రాడ్లు, కత్తులతో బైక్‌లపై యనమలకుదురు వెళ్లారు. పండు కనిపించకపోవడంతో ఫోన్‌ చేశాడు సందీప్‌. డొంకరోడ్డులోని ఖాళీ స్థలంలోకి రమ్మన్నాడు పండు. వెంటనే సందీప్‌ గ్యాంగ్‌ ఆ స్థలంలోకి వచ్చింది. అప్పటికే గాజు సీసాలు, కారం, కత్తులతో సిద్ధంగా ఉన్న పండు తన వద్దకొచ్చిన సందీప్‌ కళ్లల్లో కారం కొట్టి, కత్తితో దాడి చేశాడు. అనుచరులు గాజు సీసాలతో సందీప్‌ తలపై బలంగా కొట్టారు.


సందీప్‌ అనుచరులూ ప్రతిదాడి చేశారు. సందీప్‌ గ్యాంగ్‌ దాడిలో పండు గాయపడ్డాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందీప్‌ ఆదివారం రాత్రి చనిపోగా, పండు గుంటూరులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సందీప్‌ ఏడాదిన్నర క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడని సమాచారం. అతడికి చిన్నపాప ఉంది. సందీప్‌పైన పటమట పోలీస్‌స్టేషన్‌లో 13 కేసులు ఉన్నాయి. అతడిపై రౌడీషీట్‌ను ఇటీవలే మూసివేశారని సమాచారం. 


తల్లే రెచ్చగొట్టిందా?

సందీప్‌ను అంతం చేయాలన్న కసి పండులో పెరగడానికి అతడి తల్లే కారణమని ప్రచారం జరుగుతోంది. సందీప్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని పదేపదే చెబుతూ ఎంత ఖర్చయినా అతడి అంతు చూడాలని రెచ్చగొట్టినట్టు సమాచారం. పండుపై పెనమలూరు స్టేషన్‌లో సుమారు 13 కేసులు ఉన్నట్టు సమాచారం. అతడిని తల్లే ప్రతి కేసు నుంచి బయటకు తీసుకొచ్చేదని కొందరు చెబుతున్నారు. విద్యార్థులు, యువకుల అవసరాలను తీర్చుతూ వారిని తన వెంట తిప్పుకుంటున్నాడు. సందీప్‌ గ్యాంగ్‌తో ఫైట్‌కు దిగిన పండు బ్యాచ్‌ అంతా గంజాయి మత్తులో ఉన్నారని, మరికొంతమంది మద్యం మత్తులో ఉన్నారని సమాచారం. వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తున్న వీడియోల ఆధారంగా పటమట పోలీసులు నిందితులను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 20మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ గ్యాంగ్‌వార్‌లో ఉన్న ప్రతి యువకుడిపైనా రౌడీషీట్‌ తెరుస్తామని ఉపకమిషనర్‌ హర్షవర్థన్‌ తెలిపారు.


ఎవరీ ‘పండు’ ?

ఎవరు కొడితే మైండ్‌ బ్లాక్‌ అయిపోతుందో వాడే పండుగాడంటే. ఇది పోకిరి సినిమాలోని డైలాగ్‌. రౌడీ బ్యాచ్‌ ఎవరి చుట్టూ ఉంటుందో వాడే పండుగాడంటే. ఇది బెజవాడలోని పండు డైలాగ్‌. గ్యాంగ్‌వార్‌ తర్వాత ఈ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. అనుచరులకు గంజాయి, మద్యం ఇప్పించి సందీప్‌ వర్గంపై దాడి చేయించాడు. సందీప్‌ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. ఈ కేసుతో పండు అంటే ఎవరు అన్న ప్రశ్న మొదలైంది. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఈ గ్యాంగ్‌వార్‌ ఒక్కసారిగా కలకలం రేపింది. పండు, అతడి కుటుంబ సభ్యులపై ఏ ఒక్కరూ సదభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు.


సనత్‌నగర్‌లోని రామాలయం వద్ద పండు బంధువుల కుటుంబాలు నాలుగైదు ఉంటున్నాయి. ఈ కుటుంబాల పేరెత్తితేనే స్థానికులు హడలెత్తిపోతున్నారు. పండు తల్లి పద్మ రూ.10-15 వడ్డీలకు అప్పులు ఇస్తుంటుంది. సకాలంలో డబ్బులు ఇవ్వని వారిని వేధిస్తుంది. ఆమె అండదండలతోనే పండు పోకిరిగా మారాడని చెబుతున్నారు. నిత్యం పది మంది యువకులను వెంటేసుకుని డొంకలో తిష్ట వేస్తాడు. వారికి గంజాయి, మద్యం సమకూర్చుతాడు. పండు కుటుంబాలకు చెందిన వారే ఇతరులతో వివాదాలకు దిగడం, తిరిగి పోలీసు కేసులు పెట్టడం ఒక ఆనవాయితీ అని ఓ స్థానికుడు చెప్పారు. 

Updated Date - 2020-06-01T09:23:45+05:30 IST