రోహిత్, కోహ్లీ, బూమ్రాలను ఎంచుకుంటా.. సెహ్వాగ్‌కు కోపమొస్తుందేమో..!: గంగూలీ

ABN , First Publish Date - 2020-07-05T23:47:09+05:30 IST

భారత్ మళ్లీ క్రికెట్ ప్రపంచకప్ గెలవగలదన్న నమ్మకం 2003లో గంగూలీ సారథ్యంలోనే కలిగింది. బలమైన జట్టుగా...

రోహిత్, కోహ్లీ, బూమ్రాలను ఎంచుకుంటా.. సెహ్వాగ్‌కు కోపమొస్తుందేమో..!: గంగూలీ

కోల్‌కతా: భారత్ మళ్లీ క్రికెట్ ప్రపంచకప్ గెలవగలదన్న నమ్మకం 2003లో గంగూలీ సారథ్యంలోనే కలిగింది. బలమైన జట్టుగా ఫైనల్ వరకు వెళ్లి పోరాడి ఓడింది. అయితే 2019లో కోహ్లీ సేన కూడా అదే స్థాయిలో పోరాడింది. వరుణుడి దెబ్బతో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో 2003, 2019లలోని భారత జట్ల బలాబలాలను చూస్తే దాదాపు ఒకేలా ఉంటాయి. రెండు జట్లలో బలమైన జట్టు ఏదంటే చెప్పడమూ కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో 2003 భారత జట్టు సారథి గంగూలీకి ఓ విచిత్రమై ప్రశ్న ఎదురైంది. మయాంక్ అగర్వాల్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో గంగూలీకి ఈ ప్రశ్న ఎదురైంది. మయాంక్ మాట్లాడుతూ, 2019 జట్టు నుంచి ఎవరైనా ముగ్గురు ఆటగాళ్లను అప్పటి జట్టుకు ఎంపిక చేసుకోమని గంగూలీని కోరాడు. దీంతో డైలమాలో పడిన గంగూలీ చివరకు రోహిత్, కోహ్లీ, బూమ్రాలను ఎంపిక చేసుకున్నాడు.


"నేను నా జట్టులో ఈ ముగ్గురినీ తీసుకునేందుకు ఇష్టపడతా. అయితే ఈ విషయం తెలిస్తే సెహ్వాగ్‌ రేపు నాకు ఫోన్ చేసి ‘ఏమనుకుంటున్నావు నువ్వు..?’ అని కోప్పడతాడేమో. నా ఎంపికలో రోహిత్ టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్ వస్తాడు. నేను మూడో స్థానంలో బరిలోకి దిగుతా. కోహ్లీ మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు’ అంటూ గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే నాలుగో ఆప్షన్ కూడా ఇస్తే ధోనీని ఎంచుకుంటానని, అతడు కీపింగ్‌లో బెస్ట్ అని తెలిపాడు. అయితే మూడు ఆప్షన్స్ మాత్రమే ఉండడంతో ద్రావిడ్‌తో సరిపెట్టుకుంటానని, అతడు కూడా ఎంతో చక్కగా కీపింగ్ చేయగలడని గంగూలీ వివరించాడు.

Updated Date - 2020-07-05T23:47:09+05:30 IST