Abn logo
May 4 2021 @ 12:53PM

ఈటల ఒక మేక వన్నె పులి.. బీసీ ముసుగు కప్పుకున్న దొర: గంగుల

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒక మేక వన్నె పులి అని.. బీసీ ముసుగు కప్పుకున్న పెద్ద దొర అని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈటల హుజురాబాద్‌కు వెళితే బీసీ.. హైద్రాబాద్‌కు వస్తే ఓసీ. ఆయన సీఎం మీద మాట్లాడే స్థాయికి వచ్చారు. దేవరాయాంజల్ భూముల కోసం అప్పటి సీఎం వైఎస్‌తో మాట్లాడిన ఈటల.. ముదిరాజ్‌ల కోసం ఎందుకు మాట్లాడలేదు? నీ వ్యాపార భాగస్వాములు ఎవరైనా బీసీలు ఉన్నారా? ఇప్పుడు బీసీలు మీకు గుర్తుకు వచ్చారా? చీమలు పెట్టిన పుట్టలో పాములా మీరు చేరారు. సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకోము. మీరు బీసీలను ఎదగకుండా చేశారు. టీఆర్ఎస్ బీఫామ్ మాకు పవిత్ర గ్రంధం. బీ ఫామ్ మీద పోటీ చేసిన వారిని  ఓడించే ప్రయత్నం చేశారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్లు మీరు ఎలా సంపాదించారు? నీకు నువ్వు పెద్దగ ఊహించుకున్నావ్. పార్టీలో విభజన తెచ్చే ప్రయత్నం చేశావ్. పార్టీ ఓడితే ఈటల నవ్వుతారు, గెలిస్తే మొహం మాడ్చుకుంటారు. ఈటల ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీల నాయకులతో టచ్‌లో ఉన్నారు. అందుకే వారు మద్దతు ఇస్తున్నారు. హుజూరాబాద్‌లో కేసీఆర్ బొమ్మతో ఈటల గెలిచాడు. మీరు ఆరు సార్లు గెలవడం మీ గెలుపు కాదు కేసీఆర్‌ది. కేసీఆర్ బొమ్మ వల్లనే జానారెడ్డి లాంటి నాయకులు ఓడిపోయారు. ఎంపీపీగా ఉన్న కెప్టెన్ లక్ష్మికాంతరావు భార్య మీద కూడా అవిశ్వాసం పెట్టించారు. హుజురాబాద్‌లో త్వరలో పర్యటన చేస్తాం’’ అని గంగుల కమలాకర్ వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement