గంగమ్మో.. మాయమ్మో...!

ABN , First Publish Date - 2022-05-25T05:52:16+05:30 IST

డప్పులు మోగుతున్నాయి... పాదాలు చిందులేస్తున్నాయి

గంగమ్మో.. మాయమ్మో...!

కుప్పంలో వైభవంగా అమ్మవారి శిరస్సు ఊరేగింపు


డప్పులు మోగుతున్నాయి... పాదాలు చిందులేస్తున్నాయి... మేకపోతులు, కోళ్ల తలలు తెగుతున్నాయి... వీధులు ఎర్రబారుతున్నాయి.... టెంకాయలు పగులుతున్నాయి... కర్పూర హారతులు వెలుగుతున్నాయి.... పొంగళ్లు ఉడుకుతున్నాయి...  మనుసులు భక్తితో నిండుతున్నాయి... కుప్పం గంగజాతరలో మంగళవారం సంబరం అంబరాన్ని తాకింది.

కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర ఘట్టం అంతిమ దశకు చేరుకుంది. మంగళవారంనాడు అమ్మవారి శిరస్సు పుర వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింది. దండం పట్టుకున్న వంశపారంపర్య పూజారి పర్యవేక్షణలో ప్రత్యేక హారతులు, బలులు తొలిగా గంగబావి వద్ద ఇచ్చి అమ్మవారిని కదలించారు. ఎమ్మెల్సీ భరత్‌ గరిగను తీసుకుని ముందు భాగాన నడువగా, అమ్మవారి ఊరేగింపు అపార జనవాహిని నడుమ నెమ్మదిగా సాగింది. ప్రతి వీధి భక్తజనాలతో నిండిపోయింది. అడుగడుగునా అమ్మవారిని ఆపి స్థానికులు జంతు బలులిచ్చారు. హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు, పట్టణంలోని వీధులన్నీ రక్త ప్రవాహంతో ఎర్రబారాయి. గంగమ్మకు అన్న అయిన వేంకటేశ్వరస్వామికి కోపం వచ్చి చెల్లెలి తల నరికేశాడని, ఏడాదికోసారి శిరస్సును ఊరేగింపుగా తీసుకువచ్చి గంగమ్మకు పూర్ణరూపం ఇస్తారని ఈ ప్రాంతంలో చెప్పుకుంటారు. ఈ ఊరేగింపు అర్ధరాత్రి దాకా వీధుల్లో సాగి, ఆ తర్వాత ఆలయానికి చేరుకుంది. పూజారులు శిరస్సును గంగమ్మ దేహానికి అమర్చారు. కరోనా వల్ల గత రెండేళ్లపాటు జాతర జరగకపోవడంతో మొక్కులు తీర్చుకోవడానికి ఈ ఏడాది భక్తులు పోటెత్తి వచ్చారు. పట్టణంలోని ప్రతి ఇల్లూ బంధుమిత్రులతో కళకళలాడింది.

- కుప్పం






Updated Date - 2022-05-25T05:52:16+05:30 IST