గంగమ్మా.. వెళ్లి రావమ్మా

ABN , First Publish Date - 2022-05-19T07:06:49+05:30 IST

చిత్తూరులో రెండు రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర బుధవారం రాత్రి అమ్మవారి నిమజ్జనోత్సవంతో ముగిశాయి. వేలాది మంది భక్తుల నడుమ సాగిన ఊరేగింపులో ఓం శక్తి భక్తుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

గంగమ్మా.. వెళ్లి రావమ్మా
రెండో రోజు అలంకారంలో నడివీతి గంగమ్మ

నిమజ్జనోత్సవంతో ముగిసిన చిత్తూరు జాతర 


ఆకట్టుకున్న ఓం శక్తి భక్తుల విన్యాసాలు


చిత్తూరు(కల్చరల్‌), మే 18: చిత్తూరులో రెండు రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర బుధవారం రాత్రి అమ్మవారి నిమజ్జనోత్సవంతో ముగిశాయి. వేలాది మంది భక్తుల నడుమ సాగిన ఊరేగింపులో ఓం శక్తి భక్తుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్తూరు నగరంతో పాటు చుట్టుపక్కల మండలాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచీ భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. తొలుతగా వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు, ఆయన సతీమణి సీకే లావణ్య, కుటుంబ  సభ్యులు కలిసి పొన్నియమ్మన్‌గుడిలో అమ్మవారి సారెకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ్నుంచి కళాకారుల ప్రదర్శనలు, బాణసంచా పేలుళ్ల నడుమ ఓటీకే రోడ్డు, బజారువీధి మీదుగా ఊరేగింపుగా వెళ్లి నడివీధి గంగమ్మకు సారె సమర్పించారు. నడివీధి నుంచి రాత్రి గంగమ్మ బజారువీధి నుంచి  నిమజ్జనానికి బయలుదేరగా భక్తులు కర్పూర హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బజారువీధి, శేషఫిరాన్‌ వీధి మీదుగా హైరోడ్డులోని చందన రమేష్‌ షాపింగ్‌మాల్‌ వద్దకు గంగమ్మ చేరుకున్నారు. అక్కడే భక్తుల కోసం ఆర్కెస్ట్రా నిర్వహించారు. ఇక, అగస్త్యీశ్వరాలయం నుంచి వందలాది మంది  ఓంశక్తి భక్తులు పలు విన్యాసాలతో బయలుదేరి దర్శించుకున్నారు. వీరు వీపులకు కొక్కేలు తగిలించుకుని లారీలు, ట్రాక్టర్లు, ఆటోలతో పాటు పలు వాహనాలను లాగారు. చందనా రమేష్‌ షాపింగ్‌ మాల్‌ వద్ద క్రేన్‌తో వేలాడుతూ గంగమ్మకు పూలదండ వేశారు. అనంతరం గంగమ్మను హైరోడ్డు మీదుగా కోర్టు డౌన్‌లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్తలు సీకేబాబు, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, సంతపేట, కొంగారెడి ్డపల్లె,  కట్టమంచి, గిరింపేట, ఇరువారం, చవటపల్లె, దొడ్డిపల్లె, మురకంబట్టు తదితర ప్రాంతాల్లోనూ గంగమ్మల నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఈ రెండు రోజులపాటు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. భక్తులకోసం పలువురు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 








Updated Date - 2022-05-19T07:06:49+05:30 IST