Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాగార్జునకు ఫోన్‌ చేసి.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశా...

సినిమా గేమ్స్‌ నాకర్థం కాలేదు

ప్రపంచ భాషల్లోకి భగవద్గీత

జ్ఞానాన్ని అందరికీ తెలియజెప్పాలి

ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో గాయకుడు గంగాధర శాస్త్రి


ఘంటసాలను మరిపించే అద్భుత స్వర మాంత్రికుడు, సంగీత దర్శకుడు... గంగాధర శాసి్త్ర. భగవద్గీత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే తన లక్ష్యమని చెబుతున్న ఆయనతో 1-4-13న జరిగిన ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే కార్యక్రమం విశేషాలు...


ఘంటసాలలాంటి మీ స్వరం వరమా? శాపమా?

కచ్చితంగా ముందు వరమే! ఎందుకంటే.. కెరీర్‌ తొలిదశలో గుర్తింపు కోసం అలాంటి పోలిక పనికొస్తుంది. నాకు తెలిసి గాయకులు రెండు రకాలు.. హీరోలకు పాడడం వల్ల గుర్తింపు పొందేవారు. వారి పాట వల్ల ఎవరికైనా గుర్తింపు తెచ్చేవారు. ఘంటసాల, యేసుదాసు ఇలాంటివారే. ప్రస్తుత తరంలో బాగా ఊపున్న పాటలకే డిమాండ్‌ ఉంటోంది. అప్పట్లో ఉన్నవి కదిపే పాటలు.. ఇప్పుడు వస్తున్నవి కుదిపే పాటలు. ఘంటసాల వంటివారి పాటలు వినే అర్హత ప్రస్తుత తరానికి లేదు.


ఘంటసాలను పోలిన స్వరం అదే వచ్చిందా? సాధన చేశారా?

సాధన చేయగా చేయగా.. ఎవరు ఏ పని చేస్తే అదే అవుతారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఘంటసాల పాటలే ఎక్కువగా పాడాను. ఆయన పాటలు పాడినప్పుడు.. ఆయన స్వరమే వస్తుంది. వేరే పాటలు పాడినప్పుడు.. నా స్వరం వినిపిస్తుంది.


మీకు సినిమా అవకాశాలు రాకపోవడానికి కారణం?

నేను దాదాపు వంద సినిమాలకు పైగా పాడాను. నాకు అనవసరంగా వచ్చే డబ్బు వద్దు. నేను పాట కోసమే ఎవరితోనూ సంబంధాలు కొనసాగించను. పాడాల్సిందిగా నన్ను కోరితేనే పాడుతాను..


మీకు పాడడం రాకే నేటి పాటలను విమర్శిస్తారనే కామెంట్లు?

నేను కాలేజీ రోజుల్లో ఒక్క ఘంటసాలవి మాత్రమే గాక అన్ని పాటలూ పాడేవాడిని. కానీ, పాటల్లో అవసరం లేని కూతలు ఎందుకు? అలాంటి మార్గంలో నేను వెళ్లలేను. గాయకుడు స్వయంగా పరవశించి పాడాలి. ఇతరుల కోసం పాడే వాడు గాయకుడే కాదు.


జర్నలిజం వైపు ఎందుకు వచ్చారు?

సంగీతం నేర్చుకునేందుకు హైదరాబాద్‌ వచ్చాను. నా ఖర్చుల కోసమని కొన్ని ఉద్యోగాలు చేశాను. అందులో భాగంగా.. సినిమా జర్నలిస్టుగా చేశాను. పన్నెండేళ్లు జర్నలిస్టుగా ఉన్నాను.

సినిమాల్లో ఏం పాటలు పాడారు?

అన్నీ సాహిత్య, సంగీత ప్రధానమైన పాటలే పాడాను. దాసరి నారాయణరావు నన్ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. నేను కొన్ని గొప్ప పాటలూ పాడాను. కానీ, వాటిని తొలగించి.. వేరే వాళ్లతో పాడించడం చేదు అనుభవం.

ఒరేయ్‌ రిక్షా సినిమాలో ‘మల్లె తీగకూ పందిరివోలె..’ పాట తొలుత నేనే పాడాను. చాలా మంది అద్భుతం అన్నారు. కానీ, కేసెట్‌ విడుదల అయ్యే సరికి వేరే వారితో పాడించి అందులో పెట్టారు. అది తట్టుకోలేకపోయాను. ఆపాటకు నంది అవార్డు వచ్చింది.


మీకు ఎదురైన చేదు అనుభవం?

ఓ సారి నాగార్జునగారి ఆఫీసు నుంచి ఫోన్‌ వచ్చింది. నాకు కాస్త ఆలస్యం కావడంతో ఆయన వెళ్లిపోయారు. దాంతో నాగార్జున బావమరిది చలసాని రమేష్‌ మాట్లాడారు. నాగార్జున మిమ్మల్ని సంతోషపెట్టాలనుకుంటున్నారంటూ.. కొంత డబ్బు ఆఫర్‌ చేశారు. కానీ, నేను అభిమానంతో రాశానని, డబ్బుకోసం రాయలేదని చెప్పేశాను. కావాలంటే.. నాకొక పాట అవకాశం ఇవ్వాలని కోరాను. సరేనన్నారు. కొద్ది రోజులకు నాగార్జున పిలిపించి.. ఓ పాట పాడించారు. కానీ, అది క్యాసెట్‌లో లేదు. ఈ ‘గేమ్స్‌’ ఏమిటో నాకు అర్థం కాలేదు. చాలా బాధపడ్డాను. నాగార్జునకు ఫోన్‌ చేసి.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశాను.


‘సంపూర్ణ భగవద్గీత’ ప్రాజెక్టు చేపట్టడానికి కారణం?

ఘంటసాల గారి భగవద్గీతకు కొనసాగింపే.. నా ఈ ప్రాజెక్టు. భగవద్గీత మొత్తం దాదాపు 700 శ్లోకాలు.. వాటన్నింటికీ గాత్రం ఇవ్వాలనేది కోరిక. ఈ దిశగా రచయిత భారవి నన్ను ప్రోత్సహించారు. తన ఇల్లు అమ్మి అయినా సహాయం చేస్తానన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయింది. ఇది దేశ అస్తిత్వానికి, జ్ఞాన సంబంధమైన ఆస్తి కాబట్టి.. రాష్ట్రపతి, 108 మంది పీఠాధిపతుల సమక్షంలో విడుదల చేస్తాం. టీటీడీ కూడా దీనిని సపోర్ట్‌ చేయబోతోంది.


రజనీకాంత్‌, ఎన్టీఆర్‌లతో ప్రశంసలు పొందారుకదా?

సుబ్బిరామిరెడ్డిగారి పుట్టినరోజు వేడుకల్లో ‘మాణిక్య వీణా..’ పాడాల్సిందిగా కోరారు. అది పాడిన తర్వాత వేదిక మీద ఉన్న రజనీకాంత్‌.. మళ్లీ పాడించాల్సిందిగా అడిగారు. మళ్లీ పాడాక.. అందరూ వచ్చి నన్ను సన్మానించారు. ఇక భగవంతుడిగా ఆరాధించగల గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌. ఓసారి వేదికమీద పాడుతుంటే సభా ముఖంగా నన్ను ప్రశంసించారు.


మీ లక్ష్యాలు..?

భగవద్గీతను విస్తృతంగా ప్రపంచ భాషల్లోకి అనువదించాలి. అందరికీ చేర్చాలి. అసలు భగవద్గీతలో ఏముందో.. పిల్లల నుంచి పెద్దల దాకా గుర్తించేలా చేయాలి. ‘భగవద్గీత యూనివర్సిటీ’ని స్థాపించాలనే కోరిక ఉంది. మా ఫౌండేషన్‌ ద్వారా సేవ చేస్తాను.


Advertisement
Advertisement