రోడ్డెక్కిన రక్తదాహం

ABN , First Publish Date - 2020-06-06T09:42:23+05:30 IST

బెజవాడలో గూండాయిజం గ్రూపులు కడుతోంది. విశాఖపట్నంలో గ్యాంగులు కత్తులు దూస్తున్నాయి. సీమలో ప్రత్యర్థుల హత్యకు సుపారీలు ముడుతున్నాయి. ఆధ్యాత్మిక నగరంలో పీకలు తెగుతున్నాయి.

రోడ్డెక్కిన రక్తదాహం

  • శాంతిభద్రతలపై కత్తిదూస్తున్న గ్యాంగ్‌లు
  • రాష్ట్రంలో విజృంభిస్తున్న హంతక సంస్కృతి
  • పాతరోజులు గుర్తుకు తెస్తున్న విజయవాడ
  • విశాఖలో దండుపాళ్యం, చిట్టిమామ పోరు
  • సీమలో ఫ్యాక్షన్‌ నేతల హత్యకు సుపారీలు
  • ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పగలే హత్య


(అమరావతి - ఆంధ్రజ్యోతి) : బెజవాడలో గూండాయిజం గ్రూపులు కడుతోంది. విశాఖపట్నంలో గ్యాంగులు కత్తులు దూస్తున్నాయి. సీమలో ప్రత్యర్థుల హత్యకు సుపారీలు ముడుతున్నాయి. ఆధ్యాత్మిక నగరంలో పీకలు తెగుతున్నాయి. వెరసి.. రాష్ట్రంలో ఆధిపత్య పోరుకు వర్గాలు తెగబడుతున్నాయి. ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఘటనలు పోలీసులకు సవాలుగా మారాయి.  రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖపట్నంలో రాయలసీమ ప్రాంత ముఠాలు మకాం వేసి రియల్‌ ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ వన్‌ టౌన్‌ ప్రాంతానికి చెందిన దండుపాళ్యం గ్యాంగ్‌, కంచరపాలెం ప్రాంతానికి చెందిన చిట్టిమామ గ్యాంగ్‌ తరచూ గొడవలకు దిగుతున్నాయి. గత నెలలో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు కత్తులు సిద్ధం చేసుకున్నాయి. ఈ గ్యాంగుల గురించి భయాందోళనలకు గురైన స్థానికులు ఇంతలో డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రెండు గ్యాంగ్‌ల్లోని పదహారు మందితోపాటు రెండు కార్లు, కత్తులు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకునాట్నరు. గ్యాంగ్‌లోని కీలక సభ్యులపై రౌడీషీట్‌ తెరిచి అందరినీ జైలుకు పంపారు.


వీధుల్లో కత్తుల విన్యాసాలు..

విజయవాడలో రెండు ముఠాలు కొట్టుకున్న దృశ్యాలు టీవీల్లో చూసిన వారికి సినిమా తరహాలో అనిపించాయి. స్నేహితులైన సందీప్‌, పండు రూ.రెండు కోట్ల విలువైన భూమి వ్యవహారంలో శత్రువులయ్యారు. ఒకరికొకరు సవాళ్లు విసురుకుని.. స్పాట్‌ ఎంపిక చేసుకుని మరీ కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. అయినా ఇవేవీ పోలీసులు పసిగట్టలేక పోయారు. ఇలాంటి ఘటన తాము ఊహించలేక పోయామని, షాకింగ్‌గా ఉందని బెజవాడలో పనిచేస్తున్న డీసీపీ ఒకరు అభిప్రాయపడ్డారు.  తిరుపతిలో నాలుగున్నర నెలల క్రితం నడిరోడ్డుపై జరిగిన హత్య కలకలం రేపింది. బెల్ట్‌ మురళీ అనే వ్యక్తిపై మాస్కులు ధరించిన ఆరుగురు ద్విచక్ర వాహనాలపై వచ్చి హతమార్చారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. రియల్‌ ఎస్టేట్‌  ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్గవ్‌ అనే యువకుడి హత్యకు ప్రతీకారంగానే మురళీని చంపారని తేలింది.  కత్తులతో వీపు, తలపై నరికేటప్పుడు.. ఆ మార్గంలో తిరుమలకు వెళుతున్న భక్తులు ఉలికిపాటుకు గురయ్యారు.


ఎక్కడికక్కడ కట్టడి చేస్తేనే..

రాజకీయ ప్రత్యర్థులపై వరుస దాడులకు దిగడం సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పతాక స్థాయికి చేరింది. సీమ నుంచి సిక్కోలు వరకూ ఎక్కడ బడితే అక్కడ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులపై దాడులు జరిగాయి. టీడీపీ ఏకంగా గుంటూరులో బాధితులు, క్షతగాత్రులకు షెల్టర్‌ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన బుద్ధా వెంకన్న, బొండా ఉమాపై గుంటూరు జిల్లాలో జరిగిన దాడులతో జాతీయ స్థాయిలో ఏపీ పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. కర్నూలులో టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడులకు తెగబడ్డారు. అధికారం మన చేతుల్లో ఉన్నప్పుడు పోలీసులు ఏమి చేస్తారులే అన్న ధీమాతోనే ఇలాంటివి జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడి కక్కడ రౌడీ షీట్లు తెరిచి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెడితే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదని పోలీసు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


సొంతవాళ్లపైకే కత్తులు..

రాయలసీమ జిల్లాల్లో ఒకప్పుడు ప్రత్యర్థులు, అపోజిషన్‌ పార్టీల్లోని వ్యక్తులను మట్టుబెట్టిన ముఠా లీడర్లు రూటు మార్చారు. ఇప్పుడు సొంతపార్టీలోని వారినే హతమార్చేందుకు సిద్ధపడుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన సుబ్బారెడ్డి అనే టీడీపీ నేత హత్యకు సుపారీ తీసుకున్న గ్యాంగ్‌ను ఇటీవలే కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొంత జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కుటుంబంపై సుబ్బారెడ్డి ఆరోపణలు చేశారు. ఆ కుటుంబంతో ఒకప్పుడు సన్నిహితంగా మెలిగిన ఈ నాయకుడు తర్వాతి కాలంలో రాజకీయంగా ప్రత్యర్థి అయ్యారు. అయితే అంతమొందించే అంత కక్షలు వారి మధ్య లేవనుకొంటున్న తరుణంలో ఇలాంటి ఘటన జరగడం రాజకీయ వర్గాల్లో కలవరపాటు తెచ్చింది. కుట్ర దారులు కూడా టీడీపీకి చెందిన వారేనని ఆ నేత ఆరోపిస్తున్నారు. కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వైసీపీలోని రెండు వర్గాలు ఆధిపత్య పోరులో భాగంగా దాడులకు తెగబడ్డాయి. తాజాగా విజయవాడలో టీడీపీకి చెందిన వ్యక్తులు దాడులు చేసుకున్నారు.

Updated Date - 2020-06-06T09:42:23+05:30 IST