పోర్టులో మాంగనీస్‌ ఓర్‌ దొంగిలిస్తున్న ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-09-29T06:36:42+05:30 IST

పోర్టులోని యార్డుల్లో నిల్వచేసిన మాంగనీస్‌ ఓర్‌ను తస్కరిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సరకు రవాణాకు వినియోగించిన రెండు టిప్పర్లు, లోడింగ్‌ చేసిన ఎక్స్‌కవేటర్‌తోపాటు చోరీకి గురైన 250 మెట్రిక్‌ టన్నుల మాంగనీస్‌ ఓర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోర్టులో మాంగనీస్‌ ఓర్‌ దొంగిలిస్తున్న ముఠా అరెస్టు
విలేకరుల సమావేశంలో మట్లాడుతున్న సీపీ మనీష్‌కుమార్‌సిన్హా

రెండు టిప్పర్లు, 250 టన్నుల ఓర్‌ స్వాధీనం

తొమ్మిది మంది అరెస్టు

పరారీలో మరో ఇద్దరు

విశాఖపట్నం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): పోర్టులోని యార్డుల్లో నిల్వచేసిన మాంగనీస్‌ ఓర్‌ను తస్కరిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సరకు రవాణాకు వినియోగించిన రెండు టిప్పర్లు, లోడింగ్‌ చేసిన ఎక్స్‌కవేటర్‌తోపాటు చోరీకి గురైన 250 మెట్రిక్‌ టన్నుల మాంగనీస్‌ ఓర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన అభిజీత్‌ ఫెర్రోటెక్‌ కంపెనీ 3,645 మెట్రిక్‌ టన్నుల మాంగనీస్‌ ఓర్‌ను కొనుగోలుచేసి ఈ నెల 18న షిప్‌ నుంచి అన్‌లోడ్‌ చేసి, పోర్టు బయట ఉన్న సినర్జీ షిప్పింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యార్డులో స్టాక్‌ ఉంచింది.  సినర్జీ షిప్పింగ్‌ కంపెనీ ప్రతినిధులు దీనికి కాపలాగా ఉండే బాధ్యతను రావూస్‌ సెక్యూరిటీ అండ్‌ హౌస్‌కీపింగ్‌ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది. ఇదిలావుండగా ఈ నెల 24న సినర్జీ కంపెనీ ప్రతినిధులు స్టాక్‌ను పరిశీలించగా 250 మెట్రిక్‌ టన్నుల సరకు తక్కువైంది. దీంతో అదే రోజు హార్బర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి క్రైమ్‌ ఏసీపీ సీహెచ్‌.పెంటారావు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. వన్‌టౌన్‌లోని కొబ్బరితోటకు చెందిన చల్లపల్లి యల్లాయమ్మ ముఠా చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. దీంతో యల్లాయమ్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను సరకుని రైల్వే న్యూకాలనీకి చెందిన అబ్దుల్‌ రెహమాన్‌కు అప్పగించినట్టు తెలిపింది. రెహమాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తన లారీల ద్వారా సరకుని రాయ్‌పూర్‌ తరలించేందుకు వీలుగా ముందుగా బొబ్బిలిలోని ఒక పరిశ్రమ ఆవరణలో నిల్వ చేసినట్టు వివరించడంతో పోలీసులు అక్కడికి వెళ్లి చోరీకి గురైన మాంగనీస్‌ ఓర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎల్లాయమ్మ, రెహమాన్‌పాటు వారికి సహకరించిన భూపేష్‌నగర్‌కు చెందిన వాసుపల్లి రమణ, అల్లిపురానికి చెందిన వాసుపల్లి నూకరాజు, అయికన రాజు అలిఆస్‌ ఎరుగు, రైల్వే న్యూకాలనీకి చెందిన గొరికి దుర్గారావు, మనోరమ థియేటర్‌ దరి లక్ష్మీదేవి పేటకు చెందిన చెల్లపల్లి సత్తిరాజు, పాతపోస్టాఫీస్‌కు చెందిన మహ్మద్‌ అక్రమ్‌, అల్లిపురానికి చెందిన మహ్మద్‌ ఇస్తేకర్‌ని అరెస్టు చేశారు. ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌ ఎల్లేశ్వరరావుతోపాటు లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్టు సీపీ తెలిపారు. ఇదిలావుండగా యల్లాయమ్మ మొదట్లో పోర్టు బయట ఉన్న యార్డులో రాలిపోయిన బొగ్గు, ఐరన్‌, మాంగనీస్‌ ఓర్‌లను ఏరుకుని జీవించేది. కాలక్రమేణా పోర్టు, యార్డులపై పట్టు సంపాదించింది. యార్డుల్లో కాపలాఉండే  సెక్యూరిటీ గార్డులను ప్రలోభపెట్టి రాత్రిపూట యార్డులోని సరకుని దొంగిలించి అమ్మేయడం మొదలుపెట్టింది. దీంతో పోర్టు యార్డుల్లో ఆమె ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. కొంతమంది అనుచరులను ఏర్పాటు చేసుకుని వారిని పోర్టు యార్డుల్లోకి పంపించి సరకు ఎక్కడుందో గుర్తించడం, అక్కడ సెక్యూరిటీని ప్రలోభపెట్టి రాత్రిపూట లారీల్లో తరలించేవారు. ఈ క్రమంలో ఆమెపై 19 కేసులు, టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సస్పెక్ట్‌షీట్‌, కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ కూడా ఉందని డీసీపీ వి.సురేశ్‌బాబు అన్నారు.  ఏసీపీ సీహెచ్‌.పెంటారావు, సీఐ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T06:36:42+05:30 IST