శ్రమజీవుల ‘బరువు’ తగ్గించాడు

ABN , First Publish Date - 2021-03-31T06:02:07+05:30 IST

పొలాల్లోనో... ఫ్యాక్టరీలోనో... లేదా ఆఫీసులోనో పని చేసేటప్పుడు వెన్నెముకపై అధిక బరువు పడుతుంది. ఓ రైతు బిడ్డగా ఆ బాధ ఎంతలా ఇబ్బంది పెడుతుందో గణేశ్‌రామ్‌ జాంగీర్‌కు తెలుసు. కానీ అందరిలా అతడు కూడా భరిస్తూ కూర్చోలేదు. ‘బరువు’

శ్రమజీవుల ‘బరువు’ తగ్గించాడు

పొలాల్లోనో... ఫ్యాక్టరీలోనో... లేదా ఆఫీసులోనో పని చేసేటప్పుడు వెన్నెముకపై అధిక బరువు పడుతుంది. ఓ రైతు బిడ్డగా ఆ బాధ ఎంతలా ఇబ్బంది పెడుతుందో గణేశ్‌రామ్‌ జాంగీర్‌కు తెలుసు. కానీ అందరిలా అతడు కూడా భరిస్తూ కూర్చోలేదు. ‘బరువు’ తగ్గించేందుకు ఓ బెల్ట్‌ కనుగొన్నాడు. ఎంతో మంది శ్రమజీవులకు వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తున్నాడు. ఎవరీ గణేశ్‌రామ్‌? ఏమిటా బెల్ట్‌ ప్రత్యేకత? 


వ్యవసాయ క్షేత్రాల్లో నిరంతరం పని చేసిన మా అమ్మా నాన్న, చుట్టుపక్కల వారిని ఆరా తీస్తే... తామూ ఆ బాధను అనుభవించినవాళ్లమే అని చెప్పారు. నొప్పి భరిస్తూనే పని కొనసాగించేవారని తెలుసుకున్నాను. 


ప్రస్తుత బిజీ జీవనంలో వెన్నుపూసపై నిరంతర భారం పడుతోంది. దీంతో దాదాపు అన్ని రకాల వృత్తులవారికీ వెన్ను నొప్పి సాధారణమైపోయింది. ఓ నివేదిక ప్రకారం భారత జనాభాలో 60 శాతం మంది వెన్నుపోటుతో ఇబ్బంది పడ్డవారే. కొందరు స్వల్ప నొప్పితో అసౌకర్యానికి లోనవుతుంటారు. మరికొందరిని దీర్ఘకాల సమస్యగా వేధిస్తుంటుంది. ఫలితంగా స్పైనల్‌కార్డ్‌ దెబ్బతినడమో... లేదంటే డిస్క్‌ పక్కకు జరగడమో సంభవిస్తుంది. గణేశ్‌రామ్‌కు కూడా ఇదే సమస్య ఎదురైంది. రాజస్తాన్‌ నాగౌర్‌ జిల్లా అతడిది. రైతు కుటుంబం కావడంతో ఖాళీ సమయాల్లో నారు పోయడం, కుప్ప నూర్చడం వంటి పనులు చేసేవాడు. అయితే రోజూ ఇంటికి రాగానే విపరీతమైన వెన్ను నొప్పితో బాధపడేవాడు. దానివల్ల కంటి నిండా నిద్ర లేక అవస్థలు పడ్డాడు. 


స్వీయ అనుభవం... 

‘‘వ్యవసాయ క్షేత్రాల్లో నిరంతరం పని చేసిన మా అమ్మా నాన్న, చుట్టుపక్కల వారిని ఆరా తీస్తే... తామూ ఆ బాధను అనుభవించినవాళ్లమే అని చెప్పారు. నొప్పి భరిస్తూనే పని కొనసాగించేవారు, పెయిన్‌కిల్లర్స్‌ తీసుకొని తాత్కాలిక ఉపశమనం పొందేవారు, నిద్దర పట్టక మద్యానికి బానిసలైనవారు వారిలో ఉన్నారు. వీరందరినీ చూసిన తరువాత నొప్పి నా ఒక్కడిదే కాదని అర్థమైంది. దీనికి పరిష్కారం... వెన్నుపూసపై భారం తగ్గించాలి. ఎలా? ఆలోచిస్తుంటే తట్టిందే ‘జైపూర్‌ బెల్ట్‌’. రెండేళ్ల కిందట దీన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టా. ఎనిమిది దేశాల్లో పేటెంట్‌ హక్కులు కూడా తీసుకున్నా. పని చేసేటప్పుడు ఈ బెల్ట్‌ ధరిస్తే వెన్నుపై యాభై శాతం భారం తగ్గుతుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు గణేశ్‌. 


అధిక శాతం రైతులే... 

ప్రస్తుతం అతడు రూపొందించిన బెల్ట్‌ని రాజస్తాన్‌, మహారాష్ట్రల్లోని రైతులు, భవననిర్మాణ, పరిశ్రమల్లోని కార్మికులు, గంటలకు గంటలు సీట్లకే అతుక్కుపోయే ఉద్యోగస్తులు... ఇలా ఎందరో ఉపయోగిస్తున్నారు. వీరిలో అరవై శాతంమంది రైతులే కావడం విశేషం. ‘‘బోష్‌, మారుతి సుజుకీ వంటి బడా కంపెనీలతో పాటు భారీ ప్రాజెక్టుల్లో పనిచేసే భవన నిర్మాణ కార్మికులు, స్పైనల్‌కార్డ్‌ సమస్యలున్నవారు కూడా ఈ బెల్ట్‌ వాడుతున్నారు’’ అంటాడు ఈ యువ ఇంజనీర్‌. 


కాలేజీ రోజుల్లోనే... 

‘జైపూర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌’లో బీటెక్‌ చదివే రోజుల్లోనే గణేశ్‌రామ్‌ తన ప్రాజెక్ట్‌లో భాగంగా తన గ్రామంలోని చాలామంది రైతులు, భవననిర్మాణ కార్మికులతో మాట్లాడాడు. ‘‘వారిని సంప్రతించినప్పుడల్లా ఒళ్లు నొప్పులు ఉన్నాయనేవారు. ముఖ్యంగా వెన్నునొప్పి విపరీతంగా బాధిస్తుందనేవారు. వారిలో అధిక శాతం పెయిన్‌ కిల్లర్స్‌ వాడేవారు. ఇంకొంతమంది మద్యం సేవిస్తే కానీ రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదని తెలిపారు. ఏదేమైనా నొప్పిని భరిస్తూ బతకడమే కానీ ఇంతైనా పరిష్కారం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక బెల్ట్‌ రూపొందించాను’’... వివరించాడు గణేశ్‌. 


ఎలా పనిచేస్తుందంటే... 

వెన్నెముకకు సపోర్ట్‌నిస్తూ, దానిపై అదనపు భారం పడకుండా చేస్తుందీ బెల్ట్‌. గణేశ్‌ మాటల్లో చెప్పాలంటే... ‘‘దీన్ని ఉపయోగించడం చాలా సులువు. జాకెట్‌లా భుజాలకు వేసుకోవాలి. అదేసమయంలో నడుము భాగంలో బెల్టులా పెట్టుకోవాలి. శరీరానికి ఎలాంటి ఇబ్బంది, ఒత్తిడి లేకుండా కుషన్స్‌, ప్యాడ్స్‌ ఉంటాయి. గతంలో ఏ పని చేసేవారో బెల్టు పెట్టుకున్న తరువాత కూడా అదే పని ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేసుకోవచ్చు. దీనివల్ల యాభై శాతం వెన్నుపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్‌ ‘నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌’కు ఎంపిక అయింది. వాళ్ల సహకారంతో దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను’’. 


జీవితమే మారిపోయింది... 

ఇంజనీరింగ్‌ తరువాత గణేశ్‌ జీవితమే మారిపోయింది. డిగ్రీ పూర్తవగానే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో కొంతకాలం పనిచేశాడు. అది వదిలేసి తన ఊరికి వెళ్లి ‘న్యూంద్రా ఇన్నోవేషన్స్‌’ నెలకొల్పాడు. వైద్యులు, మార్గదర్శకులు, శాస్త్రవేత్తల సహకారంతో తన ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్‌కు మెరుగులు అద్దడం ప్రారంభించాడు. చివరకు ‘జైపూర్‌ బెల్ట్‌’కు రూపం ఇచ్చాడు. ‘‘యంత్రగతి శాస్త్రం ప్రాథమిక సూత్రాల ఆధారంగా ఈ బెల్ట్‌ పని చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి వంద కిలోల బరువు ఎత్తుతున్నాడనుకోండి... అంత బరువునూ అతడు అదనంగా కూడగట్టుకోవాలి. అదే బెల్టు ధరిస్తే అందులో సగం భారం తగ్గుతుంది. ఎందుకంటే బెల్టు వల్ల ఒకేచోట కాకుండా వెనక భాగమంతటా బరువు సమానంగా పడుతుంది. దీంతో వెన్నుపై ఒత్తిడి తగ్గుతుంది. థర్మోప్లాస్టిక్స్‌, స్టీల్‌, ప్లాస్టిక్‌, కుషన్స్‌తో దీన్ని రూపొందించాను. ధర రూ.9వేలు’’ అంటున్న గణేశ్‌కు ఈ ప్రాజెక్ట్‌ తరువాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

Updated Date - 2021-03-31T06:02:07+05:30 IST