సీఎం సొంత జిల్లాలో ఇంత ఘోరమా

ABN , First Publish Date - 2020-09-20T17:18:43+05:30 IST

గండికోట ప్రాజెక్టులో అమాంతంగా బ్యాక్‌వాటర్‌ పెరగడంతో తాళ్లప్రొద్దుటూరులోని..

సీఎం సొంత జిల్లాలో ఇంత ఘోరమా

ముంచేశారు..!

అమాంతంగా బ్యాక్‌ వాటర్‌ పెరగడంతో ఇళ్లలోకి చేరిన నీరు

తలదాచుకునే తావు లేక చెట్టుకొకరు, పుట్టకొకరు

నిర్వాసితులను పరామర్శించిన టీడీపీ, బీజేపీ నేతలు


కొండాపురం(కడప): గండికోట ప్రాజెక్టులో అమాంతంగా బ్యాక్‌వాటర్‌ పెరగడంతో తాళ్లప్రొద్దుటూరులోని ఇళ్లలోకి నీరు చేరింది. పరిహారం అందక, పునరావాసం లేక నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 13 టీఎంసీలకు పైగా గండికోట ప్రాజెక్టులో నీటిని నిలపడంతో బీసీ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరి ప్రాణభీతితో నిర్వాసితులు ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. రెండు స్కూళ్లలో పునరావాసం ఏర్పాటుచేసినా అందరికీ సరిపోక పోవడంతో పిల్లాపాపలతో సామాన్లను ఎత్తుకొని చెట్టుకొకరు, పుట్టకొకరు వెళ్తున్నారు.


నిర్వాసితుల తరపున కోర్టుకు వెళ్తాం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి 

ఇంతగా వానలు ముంచెత్తుతున్నా, నీళ్లు అవసరం లేకున్నా అంతమందిని నీటిలో ముంచాలా అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. తాళ్లప్రొద్దుటూరులోని ఇళ్లలోకి నీరు చేరడంతో ఆయన నిర్వాసిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గండికోటకు అనుసంధానంగా ఉన్న అన్ని రిజర్వాయర్లు ఇప్పటికే కళకళలాడుతున్నాయని, ఎప్పటిలాగే 12టీఎంసీలు నీటిని నింపి, నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాత నీళ్లను పెంచాలన్నారు. నీళ్లు ఆపకపోతే వారి తరపున కోర్టును ఆశ్రయించి న్యాయం చేస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.


సీఎం సొంత జిల్లాలో ఇంత ఘోరమా: టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గండికోట ముంపువాసులకు ఘోరం జరుగుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తాళ్లప్రొద్దుటూరులో ముంపునకు గురైన బీసీ కాలనీని పరిశీలించి నిర్వాసితుల కుటుంబాలతో మాట్లాడారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ మైనార్టీ నేత అమీర్‌బాబు నిర్వాసితులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కనీసం గడువు ఇవ్వకుండా ఉన్నఫలంగా నీళ్లు పెంచి నిర్వాసితులను ఖాళీ చేయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఉన్నట్లుండి నీళ్లు వదిలితే  రైతులు, పాడిపశువులు, పిల్లాపాపల పరిస్థితి ఏమిటని ప్రభుత్వంపై మండిపడ్డారు. నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించి గడువు ఇచ్చిన తర్వాతే వారిని ఖాళీ చేయించాలన్నారు. నిర్వాసితులకు టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా తమకు సౌకర్యాలు కల్పించలేదని, ఇప్పటికిప్పుడు ఎక్కడకు వెళ్లాలని, మాకు మీరైనా న్యాయం చేయాలంటూ వారి ఎదుట నిర్వాసితులు వాపోయారు.



Updated Date - 2020-09-20T17:18:43+05:30 IST