గాంధీ మెచ్చిన గోడ పత్రిక

ABN , First Publish Date - 2020-08-30T05:59:49+05:30 IST

మొదట్లో దినపత్రికలనే తిప్పరాజువారి సత్రం గోడలపై అంటించేవారు. పాఠకులకు అది అంతగా అందుబాటులో ఉండదని ముఖ్యమైన వార్తలను స్వయంగా పెద్ద పెద్ద కాగితాలపై రాసి, ప్రతిరోజు గోడకు అంటించేవారు.

గాంధీ మెచ్చిన గోడ పత్రిక

మొదట్లో దినపత్రికలనే తిప్పరాజువారి సత్రం గోడలపై అంటించేవారు. పాఠకులకు అది అంతగా అందుబాటులో ఉండదని ముఖ్యమైన వార్తలను స్వయంగా పెద్ద పెద్ద కాగితాలపై రాసి, ప్రతిరోజు గోడకు అంటించేవారు. అతికించిన పత్రికలను గాడిదల నుంచి, ఆవుల నుంచి రేయింబవళ్ళు కాపాడటం ఒక సమస్యగా తయారయింది. దాంతో తిప్పరాజువారి సత్రం గోడనే నల్లగోడగా మార్చి చాక్ పీసులతో వార్తలు రాయటం ఆరంభించారు. పద్మనాభయ్య ఆరంభించిన ఈ గోడపత్రికకు నగరజ్యోతి అని నామకరణం చేసింది ముత్తరాజు గోపాలరావు. 


ఎనిమిది దశాబ్దాల క్రితం మాట. స్వాతంత్ర్యం కోసం దేశమంతా ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న కాలమది. ఆ కాలంలోనే తెలుగునాట తొలి గోడపత్రిక నెల్లూరులో అవతరించింది. దాని పేరు ‘నగరజ్యోతి’. నెల్లూరు ట్రంకురోడ్డులో ఉన్న తిప్పరాజువారి సత్రం గోడలపై నాలుగున్నర దశాబ్దాలపాటు ఆ పత్రిక ఒక వెలుగు వెలిగింది. బహుశా యావద్భారతదేశ చరిత్రలోనే తొలి గోడపత్రికగా నగరజ్యోతి స్థానం సంపాదించుకుని ఉండవచ్చు. బ్రిటిష్ పాలనలో పోలీస్ అధికారిగా పనిచేసిన నెల్లూరు వాసి తూములూరి పద్మనాభయ్య 1932లో ఈ గోడపత్రికను ఆరంభించారు.


సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన పద్మనాభయ్య స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నెల్లూరు లోని ఒక భూగృహంలో స్టెన్సిల్ మిషన్ ద్వారా రహస్య పత్రికను అచ్చు వేసి కొంతకాలం నడిపారు. అంతర్గతంగా పంపిణీ జరిగే కాంగ్రెస్ సర్క్యులర్లను, తన సహచరుల ద్వారా సేకరించిన ఇతర సమాచారాన్ని ఆధారం చేసుకొని ఆ రహస్య పత్రిక నడిచేది. గతంలో పోలీసు శాఖలో పని చేసి కూడా, ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణపై పద్మనాభయ్యను పోలీసులు అనేక నిర్బంధాలకు గురిచేశారు. స్వాతంత్ర్యం రాకమునుపే క్షయవ్యాధితో పద్మనాభయ్య అంతిమ శ్వాస విడిచారు. రహస్య పత్రికను నడిపుతూనే పద్మనాభయ్య గోడపత్రికను ఆరంభించారు. మొదట్లో దినపత్రికలనే తిప్పరాజువారి సత్రం గోడలపై అంటించేవారు. పాఠకులకు అది అంతగా అందుబాటులో ఉండదని ముఖ్యమైన వార్తలను స్వయంగా పెద్ద పెద్ద కాగితాలపై రాసి, ప్రతిరోజు గోడకు అంటించేవారు. అతికించిన పత్రికలను గాడిదల నుంచి, ఆవుల నుంచి రేయింబవళ్ళు కాపాడటం ఒక సమస్యగా తయారయింది. దాంతో తిప్పరాజువారి సత్రం గోడనే నల్లగోడగా మార్చి చాక్ పీసులతో వార్తలు రాయటం ఆరంభించారు. పద్మనాభయ్యకి సహచరులుగా ఉన్న ముత్తరాజు గోపాలరావు, ఇంద్రకంటి సుబ్రహ్మణ్యం ఈ గోడపత్రికను కొనసాగించటంలో పాలుపంచుకున్నారు. పద్మనాభయ్య ఆరంభించిన ఈ గోడపత్రికకు నగరజ్యోతి అని నామకరణం చేసింది ముత్తరాజు గోపాలరావు. కాగా, నగరజ్యోతి వెలుగులను నాలుగు దశాబ్దాల పాటు ప్రసరింప చేయగలిగినవారు ఇంద్రకంటి సుబ్రహ్మణ్యం. ఆయన జీవించినంతకాలం ‘నగరజ్యోతి’ ఆరిపోకుండా తన కంటికి రెప్పలాగా కాపాడారు.


ముత్తరాజు గోపాలరావు, ఇంద్రకంటి సుబ్రహ్మణ్యం ఇరువురూ గాంధేయవాదులే. ఇరువురూ సంఘ సేవకులే. అయినప్పటికీ, నగరజ్యోతిని నడపటంలో ఉభయులకు మధ్య కొంత పోటీ కొనసాగింది. తిప్పరాజువారి సత్రం గోడల్లో వారిరువురూ చెరొక గోడను వార్తల కోసం సొంతం అనిపించుకున్నారు. ముత్తరాజు గోపాలరావు చాలాసార్లు జైలుకు వెళ్లారు. ఆయన నూటికి నూరుపాళ్లు కాంగ్రెస్ వాది. ఆవేశపరుడుగా ప్రసిద్ధుడు. తెలంగాణలో సాయుధపోరాటం రోజుల్లో ఆత్మకూరు తాలూకాలో ఉన్న వాసిలి గ్రామానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు జి.సి. కొండయ్యకు ముత్తరాజు ఆశ్రయం ఇచ్చిన కారణంగా కాంగ్రెస్ పాలనలో కూడా ఆయనను పోలీసులు వేధింపులకు గురిచేశారు. ముత్తరాజు గోపాలరావు నగరజ్యోతిలో రాసే వార్తల్లో అక్షరాలు అంత గుండ్రంగా ఉండకపోయినప్పటికీ, సంచలనాత్మక వార్తలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయనకు వారసుడిగా గండవరపు హనుమారెడ్డి కొంతకాలం పాటు వార్తలు రాశారు. ముత్తరాజు గోపాలరావు ఇంద్రకంటితో పోటీ పడలేక చివరికి తన గోడను కూడా ఆయనకే అప్పగించేశారు.


ఇంద్రకంటి సుబ్రహ్మణ్యం 1902లో జన్మించారు. పదిహేడవ ఏటనే చదువుకు స్వస్తి చెప్పి, వెంకటగిరి వెళ్ళి బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించటంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి రాయవేలూరు సెంట్రల్ జైలుకు పంపారు. ఏ రకమైన పత్రికలోనూ కించిత్తు కూడా పని చేయకపోయినప్పటికీ, కేవలం నగరజ్యోతి ద్వారా మాత్రమే అచ్చమైన పాత్రికేయుడిగా ఇంద్రకంటి గుర్తింపు పొందారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. దేశం, దేశ స్వాతంత్ర్యం తప్ప ఇంద్రకంటి సుబ్రహ్మణ్యం తన కుటుంబం గురించి ఏనాడూ పట్టించుకోలేదు. 1938 నుంచి నగరజ్యోతికి వార్తలు రాయటం ప్రారంభించి తన జీవితాన్నంతా దానికే అంకితం చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ప్రీ ప్రెస్, మైన్ ఇండియా, ఫోరం పేట్రియాట్ తదితర పత్రికలను క్షుణ్ణంగా చదివి, అర్థం చేసుకొని, అందులో సామాన్య పాఠకుడికి అందుబాటులో ఉండే ముఖ్యమైన వార్తలను గుర్తుంచుకుని నగరజ్యోతిలో రాసేవారు. తమిళం రాకపోయినప్పటికీ, తమిళం వచ్చినవారి దగ్గరకు వెళ్ళి ముఖ్యమైన వార్తలు నగరజ్యోతి కోసం తర్జుమా చేయించుకుని వచ్చేవారు. రాత్రనక, పగలనక ఇంద్రకంటికి ఒకటే వ్యాపకం... వార్తలు, వార్తలు. అర్ధరాత్రి 12 గంటలయినా, ఒంటిగంటయినా మద్రాసు నుంచి గాని విజయవాడ నుంచిగాని వచ్చే రైలు ఎప్పుడు ఆగినా నెల్లూరు స్టేషన్లో వార్తాపత్రికల కోసం ఇంద్రకంటి ప్రత్యక్షమయ్యేవారు. దినపత్రికను కొనగలిగే స్తోమత లేకపోయినా ఎలాగో ఒకలా ఆ పత్రికలన్నిటినీ చదివి ముఖ్యమైన విశేషాలను నగరజ్యోతిలో రాసేవారు. మంచిమంచి కార్టూన్లను సైతం నగరజ్యోతి ద్వారా నెల్లూరు ప్రజానీకానికి అందించారు. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అవసరమైన వివిధ దేశాల చిత్రాలను కూడా గోడపత్రికపై వేస్తూ, ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించారు. ఆయన ఏ ఒత్తిడులకు లొంగకుండా తాను వాస్తవమని నమ్మినవాటినే నగరజ్యోతికి ఎక్కించేవారు. అంచేత ఇంద్రకంటి రాస్తున్న వార్తలన్నీ పూర్తిగా వాస్తవాలేనన్న నమ్మకం నెల్లూరు ప్రజానీకంలో ఉండేది. తన అవసరాల కోసం ఎవరిముందూ ఏనాడూ చేయి చాచని ఇంద్రకంటి, కేవలం నగరజ్యోతిలో వార్తలు రాయటానికి చాక్ పీసులకు డబ్బులు లేక అందరినీ అడగవలసివచ్చేది. ఒక రోజు గోడపై వార్తలు రాస్తున్న సమయంలో బ్రిటీష్ పోలీసులు ఇంద్రకంటిని అరెస్టు చేసి, జైలుకు పంపారు. అయినా గోడపత్రికను నడపటంలో ఇంద్రకంటి పట్టు వదలలేదు. ఒక్క వర్షాలు కురుస్తున్నప్పుడు తప్ప సంవత్సరం పొడవునా ప్రతిరోజూ, నగరజ్యోతిని నిర్వహిస్తూ దాదాపు నాలుగు దశాబ్దాలు వార్తలు రాశారు. ఈ గోడపత్రికను గాంధీ స్వయంగా తన ‘యంగ్ఇండియా’లో కొనియాడారు. 1976 సెప్టెంబర్ 19వ తేదీన ఇంద్రకంటి అస్తమించారు. ఆయన అస్తమయంతో నగరజ్యోతి కూడా శాశ్వతంగా ఆరిపోయింది.


ఇంద్రకంటి సుబ్రహ్మణ్యం తీవ్రమైన కాంగ్రెస్ వాది. కమ్యూనిస్టు ద్వేషి, ఆయన ద్వేషించిన కమ్యూనిస్టులకు మాత్రం ఆయనంటే అభిమానం, గౌరవం, సానుభూతి. గోడపత్రిక నగరజ్యోతియే తన జీవిత సర్వస్వం అనుకుని, రాత్రింబవళ్ళు దాని కోసం పాటుపడిన ఇంద్రకంటి సుబ్రహ్మణ్యం తెలుగు పత్రికల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. రష్యా, చైనా, స్పెయిన్, అమెరికా వంటి కొన్ని గోడపత్రికలు నడిపిన దేశాల కోవలోకి భారతదేశాన్ని తీసుకువెళ్ళిన ఘనత ఇంద్రకంటికే దక్కుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గల ఆధునిక వ్యాపార దుకాణాలు చూసినప్పుడల్లా ప్రపంచ పత్రికా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఏకైక గోడపత్రిక తీపి గుర్తులను పరిరక్షించుకోలేకపోయిన సంస్కృతి క్షమార్హం కాదని నేటి చరిత్రకారుల అభిశంసన.


బ్రిటిష్‌ వారు నమోదు చేసిన వివరాలు

స్థాపన: 1932. సైజు: 26 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు. ఒక రోజుకు: 3000 

అక్షరాలతో వార్తలు. చాక్ పీసులు: రోజుకు 15, వివిధ రంగుల్లోనివి. రోజుకు 19 నయాపైసలు. పత్రికల ఖర్చు: రోజుకు 25 పైసలు. టైము: రోజు 3 గం.లు రాసేందుకు.


ఈతకోట సుబ్బారావు


Updated Date - 2020-08-30T05:59:49+05:30 IST