గాంధీ రచనలు మరిన్ని వెలుగులోకి తేవాలి

ABN , First Publish Date - 2022-08-20T06:08:41+05:30 IST

‘మహాత్మా గాంధీ జీవనమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం.జీవన, విద్యా విధానంలో ఇటీవల వచ్చిన మార్పుల మూలంగా గాంధీ గురించి యువత మరిచిపోయే పరిస్థితి వచ్చింది. సత్యశోధన వంటి పుస్తకాల ద్వారా మళ్లీ గుర్తుతెచ్చుకునే అవకాశం వుంది.’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.

గాంధీ రచనలు మరిన్ని వెలుగులోకి తేవాలి
సుప్రీం సీజే ఎన్వీరమణకు గాంధీ జ్ఞాపికను అందజేస్తున్న కరుణ, ధర్మారెడ్డి తదితరులు

 ‘సత్యశోధన’ పుస్తకావిష్కరణలో సుప్రీం సీజే ఎన్వీరమణ


తిరుపతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ‘మహాత్మా గాంధీ జీవనమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం.జీవన, విద్యా విధానంలో ఇటీవల వచ్చిన మార్పుల మూలంగా  గాంధీ గురించి యువత మరిచిపోయే పరిస్థితి వచ్చింది. సత్యశోధన వంటి పుస్తకాల ద్వారా మళ్లీ గుర్తుతెచ్చుకునే అవకాశం వుంది.’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.తిరుచానూరు సమీపంలోని రాహుల్‌ కన్వెన్షన్‌ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం మహాత్మాగాంధీ ఆత్మకథ సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పునర్ముద్రించిన సత్యశోధన పుస్తక ప్రతులను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీకి సంబంధించి ఇంకా అనేక రచనలను కూడా పునఃముద్రించే బాధ్యత కరుణాకర రెడ్డి తీసుకోవాలని కోరారు.‘సత్యశోధన...గాంధీ ఆత్మకథ  ప్రతి రాజకీయ నాయకుడూ తప్పక చదవాల్సిన పుస్తకమని గతంలో నన్ను కలిసిన సందర్భంలో కరుణ చెప్పారు. హక్కులకోసం అహింసా మార్గంలో ఉద్యమాన్ని నిర్మించి, సామాన్య మానవుడు మహాత్ముడిగా పరిణామం చెందడం ఆయన ఆత్మకథలో చూడవచ్చు. గాంధీ వారసులుగా మనం గర్వించాలి. సహజంగా ఆత్మకథలు అతిశయోక్తులతో సత్యదూరంగా వుంటాయి. కానీ సత్యశోధన వాస్తవానికి దగ్గరగా, మంచిచెడులు ఉన్నది ఉన్నట్టుగా రచించిన తొలి పుస్తకంగా నాకు అనిపించిందని సీజే చెప్పారు. ‘గాంఽధీ 1921లో మొదటిసారి, 1933లో రెండో సారి తిరుపతికి వచ్చారు.అప్నటి పెద్దంగడి వీధి, ఇప్పటి గాంధీరోడ్డులో ఆయన తిరిగినట్టు చరిత్ర చెబుతోంది. రెండు సార్లు ఆయన సందర్శించడం తిరుపతివాసుల అదృష్టంగా భావించాలి.ఆయన మార్గం అందరికీ అనుసరణీయం’అన్నారు.అంతకుముందు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో ఎందరో మహామహులతో పరిచయమైందన్నారు. అది తనపై ఎంతో ప్రభావం చూపిందన్నారు. అప్పట్లో గాంధీ ఆత్మకథపై విమర్శనాత్మక రచనలను చదివానని, అయితే మరో కోణాన్ని విస్మరించానన్నారు. గొప్ప గమ్యాన్ని చేరడానికి చేసే ప్రయాణం కూడా అంతే గొప్పగా వుండాలన్నారు. లేదంటే అరాచకమే మిగులుతుందన్నారు. గతంలో తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడినై చేసిన పనులను, తర్వాత రాజకీయాల్లో చేయాల్సి వచ్చిన తప్పిదాలను సీజే ఎదుట నిందితుడిగా చేతులు కట్టుకుని ఒప్పుకుంటున్నానన్నారు.టీటీడీ ఈవో ధర్మారెడ్డి గురించి ప్రస్తావిస్తూ 2006లో ఇద్దరు దుర్మార్గుల మాటలు విని ఆయనకు తీరని అన్యాయం చేసినందుకూ క్షమాపణలు చెబుతున్నానన్నారు.అనంతరం ప్రసంగించిన సీజే  చేసిన తప్పులను కరుణాకర రెడ్డి ఒప్పుకోవడం చిన్న విషయం కాదన్నారు.క్రియాశీలక రాజకీయాల్లో వుండి కూడా కరుణాకర రెడ్డి నిర్భయంగా మాట్లాడిన ఈ పరిణామం భవిష్యత్తులో ఎటువేపు దారి తీస్తుందో అర్థం కావడం లేదని, వేచి చూడాల్సి వుందన్నారు. ఇంత మంచి నాయకుడిని తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ప్రజలకు అభినందనలు తెలపడంతో పాటు కరుణాకర రెడ్డికి అండగా నిలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, మేయర్‌ శిరీష, చిత్తూరు,తిరుపతి,అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు హరినారాయణన్‌, వెంకట్రమణా రెడ్డి, గిరీష, ఎస్పీలు రిషాంత్‌ రెడ్డి, పరమేశ్వర రెడ్డి, కమిషనర్‌ అనుపమ అంజలి,టీటీడీ జేఈవో సదాభార్గవి,మానవవికాస వేదిక కన్వీనర్లు శైలకుమార్‌, సాకం నాగరాజు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T06:08:41+05:30 IST