గాంధీ ‘మార్గం’

ABN , First Publish Date - 2022-08-13T05:35:15+05:30 IST

కర్నూలు జిల్లా చరిత్రలో గాంధీ అడుగు జాడలు ఉన్నాయి.

గాంధీ ‘మార్గం’
ఆత్మకూరులో వంద మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ

జిల్లాలో రెండు సార్లు పర్యటించిన జాతిపిత
స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని రగిల్చిన ఆయన అడుగుజాడలు


కర్నూలు జిల్లా చరిత్రలో గాంధీ అడుగు జాడలు ఉన్నాయి. ఆయన  జాతీయోద్యమంలో భాగంగా రెండుసార్లు జిల్లా పర్యటనకు వచ్చారు. 1921, 1929 సంవత్సరాలో ్ల గాంధీ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన  జిల్లా ప్రజలనుద్దేశించిన చేసిన ఉపన్యాసాలు లక్షలాది మందిలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. వేలాది మందిని శాంతి సంగ్రామంలో మమేకం చేశాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న జిల్లా చరిత్రలో నమోదైన ఆనా టి గాంధీ అడుగు జాడలను స్పృశిద్దాం.  

- కర్నూలు,కల్చరల్‌

 భారత స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో భాగంగా మహాత్ముడు స్వరాజ్య నిధికి, ఖద్దరు వస్త్ర వ్యాప్తికి, విరాళాల సేకరణకు కర్నూలు జిల్లాలో పర్యటించారు. 1921లో కర్నూలు, 1929లో పత్తికొండను ఆయన సందర్శించారు. ఆయన పర్యటనలో స్వరాజ్య నిధికి భూరి విరాళాలు అందాయి. అంతా ఖద్దరు వస్త్రాలు ధరించి, ఖద్దరు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. 1921 సెప్టెంబర్‌ 29న మహాత్ముడు రైలులో ప్రయాణించి ద్రోణాచలం (డోన్‌) మీదుగా కర్నూలు చేరుకున్నారు.  కర్నూలు   పాతనగరంలోని తుంగభద్ర నది ఒడ్డున భారీ సభ ఏర్పాటు చేశారు. మహాత్ముడు ప్రయాణిస్తున్న రైలు డోన్‌లో కొద్దిసేపు అగుతుందని తెలుసుకున్న ప్రజలు ఆయనను చూసేందుకు డోన్‌ రైల్వేస్టేషన్‌కు వందలాదిగా తరలివచ్చారు. డోన్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి బండ్లు కట్టుకొని మహాత్ముని దర్శనం కోసం ఎదురు చూశారు. అయతే ఉదయం రావాల్సిన రైలు రాత్రి పదకొండు దాటినా జాడ లేకపోవడంతో కొందరు వెళ్లిపోయారు. మరికొందరు ఆయన్ను చూసివెళ్లాలని అక్కడే ఉండిపోయారు. రైలు అర్ధరాత్రి 12గంటలకు డోన్‌కు చేరుకుంటుందని రైల్వే అధికారులకు వర్తమానం అందింది. పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ సమాచారం తిరిగి సమీప గ్రామాలకు చేరడంతో మహాత్ముడ్ని చూసేందుకు మళ్లీ జనం డోన్‌ రైల్వేస్టేషన్‌ చేరుకున్నారు. సరిగ్గా 12 గంటలకు రైలు డోన్‌ చేరుకుంటూనే జనం ఆనందంతో గాంధీజీ...జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఆ రైలులో థర్డ్‌క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లో నిరంతర ప్రయాణాల వల్ల మహాత్ముడు అలసిపోయి నిద్రిస్తున్నారు. ప్రజల నినాదాలు ఆయన నిద్రకు ఎక్కడ అంతరాయం కలిగిస్తాయోనని ఆయన వెంట ఉన్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, జిల్లాకు చెందిన హరి సర్వోత్తమ రావు, కొండా వెంకటప్పయ్య పంతులు వంటివారు ఆందోళన చెందారు. చివరకు కొండా వెంకటప్పయ్య పంతులు చొరవ తీసుకొని బయటి ప్రజలతో మహాత్ముడు గాఢ నిద్రలో ఉన్నారు. రేపు ఉదయం వారితో మాట్లాడిస్తానని, అప్పటి వరకు ఓపిగ్గా ఉండాలని చెప్పారు. మరుసటి రోజు ఉదయం వరకు ప్రజలు శాంతంగా రైల్వేస్టేషన్‌లోనే మహాత్ముని దర్శనానికి ఉండిపోయారు. మహాత్ముడు నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరమే బయట జనం గురించి విచారించారు. వారంతా రాత్రి నుంచి తన దర్శనానికి వేచి ఉన్నారని అనుచరుల ద్వారా  తెలుసుకొని బాధపడ్డారు. అనంతరం బయటకు వచ్చి జనానికి వందనం చేశారు. మహాత్ముడ్ని చూసి ఆనందంలో ప్రజలు పులకించి పోయారు. జనాలను ఉద్దేశించి హిందీలో ఆయన ప్రసంగించారు. ఆయన ఉపన్యాసాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు తెలుగులో అనువాదం చేశారు. ‘మొదట మీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇంతసేపు మిమ్మల్ని ఎదురు చూసేలా చేసినందుకు..’ అని గాంధీజీ అనగానే ప్రజల్లో ఆయన పట్ల అభిమానం మరింత పెరిగింది. గట్టిన చప్పట్లు కొట్టసాగారు. మహాత్ముడు తిరిగి కొనసాగించారు. ‘బ్రిటీషు వారి దాస్య శృంఖలాలను పగులకొట్టి, మనం స్వేచ్ఛను సాధించుకునే రోజు దగ్గరలో ఉంది. అందుకు మీరంతా సహకరించాలి. స్వరాజ్య పోరాటం కోసం కాంగ్రెస్‌ వారు చేస్తున్న కృషికి మీ అందరి చేయూత కూడా అవసరం. ఏ ఉద్యమమైనా ఆర్థిక చేయూత లేనిదే రాణించలేదన్న విషయం మీకు తెలియంది కాదు. కాబట్టి యథారీతిగా మీరు తోచిన విరాళం సమర్పించి మాకు బాసటగా నిలుస్తారని విశ్వసిస్తున్నాను. మద్యపానం, విదేశీ వస్త్రాధారణ త్యజించి స్వదేశీ వస్త్రధారణకు ప్రాధాన్యత ఇవ్వండి...జైహింద్‌!’ అంటూ ముగించారు. ఆయన ప్రసంగానికి పరవశులైన ప్రజలు   తమ వద్ద ఉన్నదంతా స్వరాజ్య నిధికి విరాళంగా ఇచ్చారు. కొందరు వెండి, బంగారు ఆభరణాలు కూడా సమర్పించుకున్నారు.

 పత్తికొండలో ఖాదీ ఉద్యమ స్ఫూర్తి...

1929 మే 21న మహాత్ముడు జిల్లాలోని పత్తికొండలో పర్యటించారు. నాటి పత్తికొండ పురవాసులతోపాటు, సమీప గ్రామాల ప్రజలు బండ్లు కట్టుకొని మహాత్ముని చూసేందుకు తరలి వచ్చారు. పత్తికొండ పంచాయితీ బోర్డు కార్యాలయం ముందున్న ఖాళీ స్థలంలో మహాత్ముని ప్రసంగం ఏర్పాటు చేశారు. మహాత్ముని రాకకు గాంధేయ వాది, తాలూకా బోర్డు అధ్యక్షుడు, యువకుడు అయిన సంజీవరెడ్డి, బోర్డు సభ్యులు తొమ్మండ వెంకట నరసయ్య, బజా ర్‌ రెడ్డి, అగ్రహారం నర్సింహారెడ్డి, ఐద్రావతి పత్రికా సంపాదకుడు వనం శంకర శర్మ వంటి వారంతా  ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలయ్యే సరికి అక్కడ ఒక జాతర వాతావరణం నెలకొంది. జాతిపిత రాక అందరికీ ఒక పండువలా ఉంది. స్వదేశీ ఖాదీ వస్త్ర ఆవశ్యకతను గురించి వివరిస్తూ విరాళాలు సేకరిస్తున్న మహాత్ముడు కడప జిల్లా పర్యటన ముగించుకొని జమ్మలమడుగు మీదుగా చాగలమర్రి, చేరుకొని అక్కడ ఆళ్లగడ్డలో కోటిరెడ్డి భార్య రామసుబ్బమ్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో విరాళాలు సేకరించి, అక్కడి నుంచి ప్యాపిలి మీదుగా, జొన్నగిరి, తుగ్గలి ప్రాంతాలు దాటి, పత్తికొండ చేరుకున్నారు. మహాత్మునికి జయజయ నాదాలు మిన్నంటాయి. స్థానికులు మాట్లాడిన అనంతరం మహాత్ముడు ప్రసంగించారు. కొండా వెంకటప్పయ్య తెలుగు అనువాదం చేశారు. ‘సభాసదులారా...ఇప్పటికి నేను అనేక ప్రాంతాలు దర్శించాను. కరువు కాటకాలతో మగ్గుతున్నా, సీమ వాసుల్లో ఉన్న స్వతంత్ర్యేచ్ఛ నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో స్వదేశీ ఉద్యమానికి, ఇప్పుడు ఖాధీ ఉద్యమానికి విరాళాలు అందిస్తున్నారు. చాలా అభినందనీయం...’అంటూ ప్రసంగించారు. మహాత్ముని ప్రసంగం పూర్తయ్యాక వనం శంకర శర్మ లేచి ప్రజల వద్ద సేకరించిన రూ.1,116 మహాత్మునికి సమర్పించారు. అలాగే నూతన ఖాదీ వస్త్రాలు గాంధీజీకి సమర్పించారు. ఆ వస్త్రాలను కూడామహాత్ముని సూచన మేరకు వేలం వేయగా, రూ.20వచ్చాయి. దాన్ని మహాత్మునికి సమర్పించారు. పి.బజార్‌ రెడ్డి తన తులం బంగారం ఉంగరాన్ని వేలం వేసి మహాత్మునికి రూ.22 సమర్పించారు. మాణిక్య రావు తన చేతికి ఉన్న ఉంగరాన్ని వేలంవేసి   గాంధీజీకి అంద జేశారు. అలా పోగైన విరాళాలు రూ.1,234 మహాత్మునికి అందాయి.

 మహాత్ముడికి కర్నూలు నగర వాసుల భూరీ విరాళాలు

1921 సెప్టెంబర్‌ 30న మహాత్ముడు డోన్‌ నుంచి కర్నూలు పట్టణానికి చేరుకున్నారు. అప్పటికే కర్నూలులోని ఆనాటి గాంధేయవాదులు మేడం వెంకయ్య శ్రేష్టి, కామగారి రామచంద్రరావు, లక్ష్మణస్వామి మొదలియార్‌లకు నాటి మద్రాసు కాంగ్రెస్‌ కమిటీ వర్తమానం పంపింది. దీంతో వారు ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు. మహాత్ముని రైలు కర్నూలు చేరుకునే సరికి ఉదయం పది గంటలైంది. మహాత్ముడు పట్టణంలోకి వచ్చేస్తున్నాడని తెలిసి ప్రజలు ప్రధాన రహదారుల వెంట బారులు తీసి నిలబడ్డారు. మహాత్ముడు ప్రయాణించే వీధుల్లో రంగురంగుల కాగితాలతో, పచ్చటి పూల తోరణాలతో అలంకరించారు. కర్నూలు పట్టణమే కనువిందుగా తయారైంది. కాంగ్రెస్‌ జెండాలన్నీ ప్రతి పౌరుడు తమ ఇళ్లపై ఎగుర వేశారు. ప్రధాన వ్యాపార కూడళ్లన్నీ మూసి ఉంచారు. పాతనగరంలోని మేడం వెకయ్య శ్రేష్టి ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. ఆయన ఇంటనే మహాత్ముడు బస చేస్తారు. కర్నూలు రైల్వే స్టేషన్‌లో మహాత్ముడు రైలు దిగి ప్రజలకు  అభివాదం చేశారు. ఆయన స్టేషన్‌ బయటకు రాగానే గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మేడం వెంకయ్య శ్రేష్టిని మహాత్మునికి పరిచయం చేశారు. ‘మీగురించి విన్నాను’ అంటూ అని మహాత్ముడు అనగానే ‘మీ అంతటి వారు మా పట్టణానికి రావడం మా పురవాసుల అదృష్టం’ అంటూ సాదరంగా ఆహ్వానిస్తూ స్టేషన్‌ బయట ఉన్న మోటారు కారులో మహాత్ముడిని ఎక్కించారు వెంకయ్య శ్రేష్టి. మహాత్ముడు బయటకు రాగానే మంగళవాద్యాలు మిన్నంటాయి. కార్యకర్తలు, గాంధేయ వాదులు, ప్రజలు ‘మహాత్మా గాంధీజీ జిందాబాద్‌’ అంటూ జయజయ నినాదాలు చేశారు. వేంకయ్య శ్రేష్టి ఇంట ఫలహారం పూర్తయ్యాక వెంకయ్య శ్రేష్టి ఒక పళ్లెంలో వెయ్యి నూట పదహారు రూపాయల డబ్బు, ఆకు, వక్కలు పెట్టి సమర్పించారు.

జనసముద్రం...తుంగభద్ర తీరం

పాతనగరానికి దక్షిణ దిక్కులో ఉన్న తుంగభద్ర ఇసుక తెన్నెలపైన మహాత్ముని సభ ఏర్పాటు చేశారు. ఆనాడు సుమారు పాతిక వేల జనవాహిని మహాత్ముని చూసేందుకు కదలి వచ్చారు. కొండా వెంకటప్పయ్య, గాడిచర్ల, మౌలానా ఆజాద్‌, మేడం వెంకయ్య, ఆయన మిత్రబృందం వేదికపై ఆశీనులై ప్రసంగించారు. నాటి మున్సిపల్‌ ఛైర్మన్‌ రామస్వామయ్య సంస్థ, కర్నూలు వాసులు పట్టణ ప్రజల తరపున సన్మాన పత్రాలు సమర్పించారు. ఈ పత్రాలు కలప పెట్టెలో పెట్టి వేలం వేశారు. 450 రూపాయలకు ఒక వ్యక్తి దక్కించుకున్నాడు. అనంతరం మహాత్ముని ప్రసంగాన్ని గాడిచర్ల అనువదించారు. ‘ప్రజలారా...మీరిచ్చిన స్వాగతానికి వందనాలు. ఈ ప్రాంతంలో తాండవిస్తున్న క్షామాన్ని నా పర్యటనలో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. అలాగే మనక స్వరాజ్యం సిద్ధించేందకు సమయం ఆసన్నమైంది. స్వదేశీ ఉన్నమంలో మనం విజయం సాధిస్తే అన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. మీకొక్క ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. బ్రిటీషు వారు తమ దమన నీతితో ఎంతగా రెచ్చగొట్టినా మనం శాంతంగా ఉంటూ ఈ ఉద్యమం సాగించాలి’ అని ప్రసంగించారు. అనంతరం రెండు రోజుల్లో రాబోయే మహాత్ముని జన్మదిన సందర్భంగా గాడిచర్ల హరి సర్వోత్తమ రావు మహాత్మునికి కొత్త ఖద్దరు వస్త్రాలు అందజేశారు. అక్కడి నుంచి మహాత్ముడు బళ్లారి బయల్దేరి వెళ్లిపోయారు.

 నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు శుక్రవారం వంద మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో జానకీరామ్‌ పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి దుద్యాల రస్తా, పాతబస్టాండ్‌, గౌడ్‌సెంటర్‌, కేజీ రోడ్డు, రఘునాథ్‌ సెంటర్‌ మీదుగా నంద్యాల టర్నింగ్‌ వద్దకు చేరుకుంది. ఆ తర్వాత తిరిగి గౌడ్‌ సెంటర్‌ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌, మార్కెట్‌ యార్డు, తహసీల్దార్‌ కార్యాలయం మీదుగా విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో ర్యాలీ చేపట్టారు.

- ఆత్మకూరు

Updated Date - 2022-08-13T05:35:15+05:30 IST