ఈ వెంకన్న గాంధీ వీరభక్తుడు

ABN , First Publish Date - 2022-08-13T05:23:01+05:30 IST

ఆయనో చిరు కూరగాయల వ్యాపారి. దినసరి ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఓరోజు దుకాణం కట్టేసి ఇంటికి వెళ్తున్నారు. కుమ్మరివీధిలోని రాజాం అమ్మవారి లోగిడిగా పిలవబడే పెంకుటింటి అరుగుపై పడిఉన్న మహాత్ముడి విగ్రహాన్ని చూశారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వారం రోజులుగా ఉన్నట్లు తెలుసుకుని చలించిపోయారు. ఎలాగైనా మహాత్ముడి విగ్రహానికి చిన్నపాటి షెల్టర్‌ వేయాలనుకున్నారు. ఇందుకు తన ఆర్థిక పరిస్థితి సహకరించదు. అలాగని చేయిచాపితే వారం రోజుల పాటు సహకరిస్తారో లే

ఈ వెంకన్న గాంధీ వీరభక్తుడు
కూలి పనులు చేసుకుంటున్న వెంకన్న

పాతికేళ్ల క్రితం విగ్రహం ప్రతిష్ఠ

గాంధీవీధిగా మారిన శెగిడివీధి

రోజూ దర్శనం తర్వాతే పనులకు..

ఏడాదిలో 3 సార్లు కార్యక్రమాలు

సహకారం అందిస్తున్న దాతలు

(రాజాం రూరల్‌)

అలమలకల పైడిరాజు ఆలియాస్‌ రాజాం వెంకన్న గాంధీజీ వీరభక్తుడు. ఆయనో దినసరి కూలీ. అద్దె ఇంట్లో జీవనం. అయినా రోజూ గాంధీ విగ్రహాన్ని దర్శించుకున్నాకే పనికి వెళ్తారు. అరకొర ఆదాయమే అయినా గాంధీ జయంతి, వర్ధంతి, స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిస్తారు. దాతల సహకారంతో పేదలకు అన్నదానం చేస్తారు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయనకు స్ఫూర్తి ఏంటి?.. ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం.. 

ఆయనో చిరు కూరగాయల వ్యాపారి. దినసరి ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఓరోజు దుకాణం కట్టేసి ఇంటికి వెళ్తున్నారు. కుమ్మరివీధిలోని రాజాం అమ్మవారి లోగిడిగా పిలవబడే పెంకుటింటి అరుగుపై పడిఉన్న మహాత్ముడి విగ్రహాన్ని చూశారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వారం రోజులుగా ఉన్నట్లు తెలుసుకుని చలించిపోయారు. ఎలాగైనా మహాత్ముడి విగ్రహానికి చిన్నపాటి షెల్టర్‌ వేయాలనుకున్నారు. ఇందుకు తన ఆర్థిక పరిస్థితి సహకరించదు. అలాగని చేయిచాపితే వారం రోజుల పాటు సహకరిస్తారో లేదో! మరేమీ ఆలోచించకుండా భవిష్యత్‌ అవసరాల కోసం దాచుకున్న రూ.500 ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే మహాత్ముడి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి అదేవీధిలో తాను ఉంటున్న ఇంటికి తీసుకువెళ్లారు. విగ్రహాన్ని శుభ్రం చేశారు. వీధి మొదట్లో చిన్నపాటి దిమ్మెను ఏర్పాటుచేసి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు చెలికాని లక్ష్మణరావుచే గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఆయనే రాజాంలో వెంకన్నగా సుపరిచితులైన అలమలకల పైడిరాజు. ఇదంతా 1996లో రాజాం పట్టణం శెగిడివీధిలో జరిగింది. మహాత్ముడి విగ్రహం ఏర్పాటు అనంతరం అది గాంధీవీధిగా పిలుస్తున్నారు. 

ఎక్కడిదా విగ్రహం?

1990లో ఓ నాటకాన్ని ప్రదర్శించేందుకు కొందరు కళాకారులు రాజాం వచ్చారు. నాటకంలో మహాత్ముడి ప్రస్తావన ఉండడంతో ఓ విగ్రహాన్ని తమతో తెచ్చుకున్నారు. నాటక ప్రదర్శన అనంతరం ఆ విగ్రహాన్ని అరుగుపై విడిచిపెట్టారని ప్రచారం. 

ఏడాదికి మూడుసార్లు కార్యక్రమాలు

రాజాం మాధవబజార్‌లో ఇప్పటికీ కూరగాయలు అమ్ముకుంటున్న వెంకన్న ఏడాదిలో మూడుసార్లు గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 15, గాంధీజీ జయంతి, వర్ధంతి క్రమం తప్పకుండా జరుపుతారు. దాతల సహకారంతో ఏటా అక్టోబరు 2న వెయ్యి మందికి అన్నదానం చేస్తారు. 

పాతికేళ్లుగా నిత్యపూజ

మహాత్ముడికి పూజ చేయడంతోనే వెంకన్న దినచర్య ఆరంభం అవుతుంది. పాతికేళ్లుగా చేస్తున్నారు. గతంలో రోజూ ఉదయం తనింట్లో పూజ చేశాక శివాలయానికి వెళ్తారు. అక్కడ పూజ చేసి పూలు తీసుకొచ్చి మహాత్ముడి పాదాల వద్ద ఉంచిన తర్వాతే కూరగాయల దుకాణానికి వెళ్లేవారు. వ్యాపారం సరిగా జరక్క రెండేళ్ల నుంచి దినసరి కూలీగా మారారు. అయినాసరే.. పనికి వెళ్లేముందు కచ్చితంగా మహాత్ముడి విగ్రహాన్ని దర్శించడం మానలేదు. ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా కార్యక్రమాలను ఆపలేదు. గాంధీజయంతి నాడు వ్యాపారవేత్త కొత్తా అనంతరావు అన్నదానానికి సహకారం అందిస్తున్నారు. ఇది తన అదృష్టమని ఆయన చెబుతున్నారు. 

ఇల్లు అమ్మి కూతుళ్ల పెళ్లి

వెంకన్నకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆయన గాంధీ వీధిలోని ఇల్లు అమ్మేసి కూతుళ్ల పెళ్లి చేశారు. ప్రస్తుతం లచ్చయ్యపేటలోని అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. భార్య పార్వతి గృహిణి కాగా కుమారుడు కూడా కూలీ పనులకు వెళ్తున్నారు. భార్య, కొడుకు ఎప్పుడూ తనకు అడ్డు చెప్పలేదని వెంకన్న తెలిపారు. 

గాంధీజీపై ప్రేమతోనే..: వెంకన్న, విగ్రహ ప్రతిష్ఠాపకుడు

గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువస్తే.. ఆయన విగ్రహం ఎండకు ఎండి వానకు తడుస్తుండడాన్ని జీర్ణించుకోలేక పోయాను. నాకు చేతనైనది చేశాను. తర్వాత దాతలు ముందుకొచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.



Updated Date - 2022-08-13T05:23:01+05:30 IST