గాంధీ నడయాడిన నేల

ABN , First Publish Date - 2022-08-10T05:29:14+05:30 IST

గాంధీ నడయాడిన నేల

గాంధీ నడయాడిన నేల
గాంధీజీ 1933 డిసెంబరు 29న చెరఖాతో నూలు వడికి ఖాదీ వస్త్రాలు ధరించాలని.. విదేశీ వస్త్రాలు భహిష్కరించాలని పిలుపిచ్చారు

- మూడు సార్లు విజయనగరం వచ్చిన మహాత్ముడు

- అశోక్‌ బంగ్లాలో బస చేసిన జాతిపిత

- పోరాటాలకు ఆర్థిక చేయూతనిచ్చిన జిల్లా వాసులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

మహాత్మాగాంధీ స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తి ప్రదాత. అహింస అనే ఆయుధం తో బ్రిటీష్‌ పాలకులపై పోరాడిన ధీరుడు. దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించిన ఉక్కు పిడికిలి. భరత మాతను బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగించేందుకు ఆయన జిల్లాలో మూడు సార్లు పర్యటించారు. ఆజాదీ కా అమృతోత్సవాల సందర్భంగా ఆయన పర్యటన విశేషాలపై ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం ప్రత్యేక కథనం.

బ్రిటిష్‌ పాలకులపై తిరుగుబాటు మొలైంది. 1920 కల్లా ఇది దేశమంతా విస్తరించింది. స్వాతంత్య్రం కోసం భారీగా పోరాటాలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికాలో ఉన్న గాంధీజీ స్వదేశానికి చేరుకున్నారు. ఆయన వచ్చాక పోరు కొత్తరూపు సంతరించుకుంది. బ్రిటీష్‌ పాలకులను గడగడలాడించేలా చేసింది. గాంధీజీ దేశ వ్యాప్తంగా తిరుగుతూ స్వాతంత్య్ర కాంక్షను రగిలించారు. దేశ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. ఇందుకోసం అనేక సమావేశాలు నిర్వహించారు. గాంధీజీకి విజయనగరంతో ఉన్న అనుబంధం, జిల్లా స్వాతంత్య్ర సమరయోధులపై నాలుగెస్సుల రాజు(న్యాయవాది) ఓ పుస్తకాన్ని రచించారు.


మూడు పర్యాయాలు

గాంధీజీ విజయనగరానికి మూడు పర్యాయాలు వచ్చారు. తొలుత 1921 మార్చి 30న విజయనగరం విచ్చేశారు. బరంపురం నుంచి బెజవాడ వెళుతూ ఇక్క డ అడుగుపెట్టారు. ఆహ్వానించేందుకు మహిళలు సైతం పోటీ పడ్డారు. పీపుల్స్‌ పార్కులో సమావేశాన్ని నిర్వహించారు. ఆ రోజుల్లోనే 10వేల మంది చుట్టుపక్కల ప్రజలు హాజరయ్యారంటే స్వాతంత్య్ర కాంక్ష ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 1921-22 ప్రాంతంలో సహాయనిరాకరణోద్యమం జరుగుతోంది. అలాగే హరిజనోద్ధరణ పేరుతో పోరాటం సాగుతుండేది. ఈ సమావేశంలోనే గాంధీజీకి సన్మాన పత్రం అందించారు. 


- రెండో పర్యాయం గాంధీజీ 1929 ఏప్రిల్‌ 30న వచ్చారు. విశాఖ పట్నం నుంచి దేశభక్త వెంకటప్పయ్య పంతులు జిల్లా కేంద్రానికి తీసుకు వచ్చారు. బ్యాంక్‌ మైదానంలో సమావేశాన్ని నిర్వహించారు. విదేశీ వస్త్ర బహిష్కరణ జరుగుతున్న కారణంగా నూలు వస్త్రాల ఆవశ్యకతను గాంధీజీ వివరించారు. ఖద్దరు వస్త్రాల తయారీ ద్వారా స్థానికంగా ఉపాధి లభ్యత గురించి తెలియజేశారు. విదేశీ వస్త్రాల వల్ల సంపద పరాయి దేశానికి వెళుతుందని వివరించారు. ఖాదీ నిధికి అనేక మంది విరాళాలు అందించారు. మద్యపానం, అంటరానితనాన్ని విడనాడాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని మతాలవారు సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు.


- గాంధీజీ మూడో పర్యాయం 1933 డిసెంబరు 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు విజయనగరంలో ఉన్నారు. ప్రస్తుత అశోక్‌ బంగ్లా లలో రాత్రి విడిది చేశారు. విజయనగరంలో గంట స్తంభం మీదుగా ప్రస్తుతం ప్రకాశం పార్కుగా ఉన్న ప్రదేశంలో సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా హరిజనవాడలో పర్యటించారు. విజయ నగరంలో మహిళలు గాంధీజీకి మంగళ హారతులతో ఆహ్వానం పలికారు. సన్మాన పత్రా న్ని అందించారు. అంటరానితనాన్ని రూపు మాపేందుకు ఆలయాల్లో వారికి ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు స్థానికులు గాంధీజీకి వివరించా రు. మనవ సేవ గురించి గాంధీజీ వివరించారు. ఈ సమావేశం జరిగేనాటికి ఉప్పు సత్యా గ్రహం(1932) జరుగుతోంది. దీని గురించి కూడా గాంధీజీ వివరించారు. అనేకమంది గాంధీజీకి విరా ళాలు అందించారు. మహిళలు తాము ధరించు కున్న బంగారు ఆభరణాలు సైతం విరాళంగా ఇచ్చారు. ఎం.గోపాలమ్మ అనే బాలిక తాను ధరించిన బంగారు గాజులను విరాళంగా ఇచ్చింది. దీన్ని మెచ్చుకున్న గాంధీజీ తన మెడలో ఉన్న పూల దండను పాప మెడలో వేశారు. ఇలా ఎంతోమంది విరాళాల వర్షం కురిపించారు. గాంధీ జీ మట్లాడుతూ నేను మీకు సుపరిచితుడిని, ఇది మూడో పర్యాయం రావటం అని వివరించారు. హరిజనులు మన సోదరులు అని, వారికి సౌకర్యా లు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేయాలని పురపాలకులకు పిలుపునిచ్చారు. హరిజనోభ్య దయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లంకాపట్నం హరిజన వాడ పర్యటన సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా నూలు దారం వడికి ఖాదీ వస్త్రాలను ధరించాలని కోరారు. గాంధీజీ తన తరువాతి కార్యక్రమం అనకాపల్లిలో ఏర్పాటు చేశా రు. దీంతో అక్కడకు చేరుకునేందుకు అలకా నంద గజపతి తన వాహనంలో పంపించారు. ఇలా గాంధీ నడయాడిన నేలగా విజయనగరం గుర్తిండి పోయేలా చారిత్రక అంశంగా మిగిలింది.


వారసులకు ఆత్మీయ సత్కారం 

విజయనగరం కలెక్టరేట్‌ సమావేశపు మందిరంలో మంగళవారం స్వాతంత్య్ర సమరయోధుల వారసులను సన్మానించారు. వేదుల సునీల్‌ (కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ మనవడు) పూసపాటి సుజాత (పాలకపాటి వెంకట నర్సింహరాజు మనవరాలు), ఆదిరాజు దేవకీనందరావు (తాట దేవకీనందరావు మనవడు), బొత్స వెంకట ప్రసాద్‌ (బొత్స ఆదినారాయణ కుమారుడు), పసుమర్తి వెంకట గణేష్‌ (పనుమర్తి వీరభద్ర స్వామి మనవడు), పూసపాటి అప్పలరాజు నర్సింహరాజు (పూసపాటి లక్ష్మీ నర్సింహరాజు మనవడు), కడిమిశెట్టి కృష్ణమూర్తి (కడిమిశెట్టి రామమూర్తి మనవడు), పూసపాటి వెంకట నారాయణరాజు (పూసపాటి బుచ్చి సీతారామచంద్ర రాజు మనవడు), అమ్ము రవి శంకర్‌ (ఆదిరాజు జగన్నాథశర్మ మనవడు), గేదెల వెంకట ఈశ్వరి (గొరిపాటి బుచ్చి ఆప్పారావు మనవరాలు)ని పూలమాలలు, దుశ్సాలువాలతో డీఆర్‌వో గణపతిరావు సమక్షంలో సత్కరిం చారు. అలాగే ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌ ప్రాంగణంలో సమాచార  శాఖ ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలతో కూడిన ఫొటో ప్రదర్శన ఆకట్టుకుంది. 

Updated Date - 2022-08-10T05:29:14+05:30 IST