అల్ల‌ర్ల‌తో అట్టుడుకుతున్న అగ్ర‌రాజ్యం.. వాషింగ్టన్‌లో గాంధీ విగ్ర‌హం ధ్వంసం..

ABN , First Publish Date - 2020-06-04T17:14:40+05:30 IST

జార్జి ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడి మ‌ర‌ణంతో అగ్ర‌రాజ్యంలో నిర‌స‌న‌లు మిన్నంటుతున్నాయి.

అల్ల‌ర్ల‌తో అట్టుడుకుతున్న అగ్ర‌రాజ్యం.. వాషింగ్టన్‌లో గాంధీ విగ్ర‌హం ధ్వంసం..

వాషింగ్ట‌న్ డీసీ: జార్జి ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడి మ‌ర‌ణంతో అగ్ర‌రాజ్యంలో నిర‌స‌న‌లు మిన్నంటుతున్నాయి. వారం రోజులుగా న‌ల్ల‌జాతీయుల ఆందోళ‌న‌ల‌తో యూఎస్ అట్టుడుకుతోంది. ఈ అల్లర్ల నేపథ్యంలో వాషింగ్టన్‌ డీసీలోని భారత ఎంబ‌సీ  కార్యాలయం వెలుపల ఉన్న‌ మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. దీంతో వెంట‌నే  పోలీసులు విగ్ర‌హాన్ని మూసివేశారు. ఈ ఘటనపై యూఎస్ పార్కు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, గాంధీ విగ్రహాన్ని నిర‌స‌నకారులు కూల్చివేయడంపై భార‌త్‌లోని అమెరికా రాయ‌బారి కెన్ జ‌స్ట‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న‌ క్షమాప‌ణలు కోరారు.






ఇదిలా ఉంటే... జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతంపై నిర‌స‌నలతో అట్టుడుకుతున్న అమెరికాలో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. 20 రాష్ట్రాల్లో ఆందోళ‌న‌కారులు త‌మ నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్నారు. ఫ్లాయిడ్‌కు న్యాయం జ‌ర‌గాలంటూ 'ఐ కాంట్ బ్రీత్' పేరిట నిర‌స‌న‌లు చేస్తున్నారు. మ‌రోవైపు అధ్య‌క్షుడు ట్రంప్ స్థానికంగానే ఆందోళ‌న‌ల‌ను అణ‌చివేయాల‌ని చెబుతున్నారు. అటు నిర‌స‌న‌కారులు మాట విన‌క‌పోతే ఆర్మీని దింపుతాన‌ని ట్రంప్ చెప్ప‌డంతో పెద్ద దుమారం రేగిన విష‌యం తెలిసిందే. కాగా, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, నగరాల మేయర్లు, సొంత పార్టీ రిపబ్లికన్‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆర్మీ మోహరింపుపై ట్రంప్ వెన‌క్కి తగ్గినట్లు స‌మాచారం.

Updated Date - 2020-06-04T17:14:40+05:30 IST