జనంలోకి గాంధీ సూత్రాలు

ABN , First Publish Date - 2022-08-11T06:43:58+05:30 IST

మహాత్ముడి సందేశాలు, సమాజానికి అందించిన సూత్రాలను ప్రజలకు గుర్తుచేయడంతో పాటు, ప్రతి ఒక్కరిలో గాంధీ తత్వం అలవడేలా ఓ కార్యక్రమం రూపొందిస్తున్నామని గాంధీ సెంటర్‌ అధ్యక్షుడు ఆచార్య బాలమోహనదాసు పేర్కొన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గాంధీ సూత్రాలను విశ్వవ్యాప్తం చేసే దిశగా తమ ఆలోచనలు సాగుతున్నాయని, ఇందుకోసం సుమారు వెయ్యి మంది విద్యార్థులతో స్వచ్ఛందంగా పనిచేసే గాంధీ సేవాదళం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని వివరించారు.

జనంలోకి గాంధీ సూత్రాలు
గాంధీ సెంటర్‌ అధ్యక్షుడు ఆచార్య బాలమోహనదాసు

గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా అమలుకు యత్నం 

వెయ్యి మంది విద్యార్థులతో గాంధీ సేవాదళం ప్రతిపాదన

గాంధీ సెంటర్‌ అధ్యక్షుడు ఆచార్య బాలమోహనదాసు


మహాత్ముడి సందేశాలు, సమాజానికి అందించిన సూత్రాలను ప్రజలకు గుర్తుచేయడంతో పాటు, ప్రతి ఒక్కరిలో గాంధీ తత్వం అలవడేలా ఓ కార్యక్రమం రూపొందిస్తున్నామని గాంధీ సెంటర్‌ అధ్యక్షుడు ఆచార్య బాలమోహనదాసు పేర్కొన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గాంధీ సూత్రాలను విశ్వవ్యాప్తం చేసే దిశగా తమ ఆలోచనలు సాగుతున్నాయని, ఇందుకోసం సుమారు వెయ్యి మంది విద్యార్థులతో స్వచ్ఛందంగా పనిచేసే గాంధీ సేవాదళం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని వివరించారు.  


విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):

కార్మికనేత, స్వాతంత్య్ర సమరయోధుడు కేఎస్‌ శాస్త్రి విశాఖపట్నంలో సుమారు 35 సంవత్సరాల క్రితం గాంధీ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇందులో నగరంలోని అనేకమంది గాంఽధేయవాదులు, ఏయూ ఉపకులపతులుగా పనిచేసిన వ్యక్తులు, సామాజిక సేవకులను భాగస్వామ్యం చేశారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, విలువలు, సూత్రాల అమలుకోసం ఈ సంస్థ పనిచేస్తోంది. మహిళా సాధికారత, అక్షరాస్యత, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాల అమలుకు అహరహం కృషి చేస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం బుల్లయ్య కళాశాల నుంచి పనిచేస్తోంది. సమాజంలో గాంధీ సిద్ధాంతాల అమలు కోసం పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని గాంధీ సెంటర్‌ తాజాగా నిర్ణయించింది. గ్రామ/వార్డు సచివాలయాలు/ గ్రామ పంచాయతీలను కేంద్రంగా చేసుకుని గాంధీ సిద్ధాంతాలను అమలుచేయాలని ప్రతిపాదించింది. ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా గాంధీ సెంటర్‌ అధ్యక్షుడు ఆచార్య వి.బాలమోనదాసు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 


సామాజిక రుగ్మతలకు అడ్డుకట్ట పడాలి 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా... ఇప్పటికీ మహాత్మాగాంధీ చెప్పిన సూత్రాలు.. సిద్ధాంతాల అవసరం సమాజానికి ఉందని మోహనదాసు అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంస్కరణల అమలు తరువాత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితులు, ప్రజల ఆలోచనల నేపథ్యంలో సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని, మతం పేరిట అభద్రతా భావం పెరుగుతోందన్నారు. మౌలిక విద్య  అందడం లేదని మద్య నిషేధం అమలు కావడంలేదని నిట్టూర్చారు. ఇలాంటి సామాజిక రుగ్మతులకు అడ్డుకట్టవేయాలంటే గాంధీ సూత్రాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలన్నారు. స్వాతంత్య్ర పోరాటం వరకే గాంధీ సిద్ధాంతాలు పరిమితంకాదని, సమాజంలో చెడు, హింస, అసమానతలు, ఇతర సాంఘిక దురాచారాలు పారదోలడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 


గాంధీ ఆశయాలు తెలుసుకోవాలి 

మహాత్ముని ఆశయాలు, విలువలు, సిద్ధాంతాలకు ఉండే ప్రాధాన్యత ప్రస్తుత తరం తెలుసుకుని భావితరాలకు చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు.  ఇందుకోసం నగరంలో 20 నుంచి 25 కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులను గుర్తించి, గాంధీ సేవాదళం ఏర్పాటుచేయాలని భావిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థికి బ్యాడ్జ్‌తోపాటు శిక్షణ ఇవ్వడం ద్వారా నగరంలో మిగిలిన కళాశాలలు, పాఠశాలలు, వర్సిటీల్లో విద్యార్థులకు గాంఽధీ విలువలపై ప్రచారం చేసేలా ఓ కార్యక్రమం రూపొందిస్తున్నామని వివరించారు. వలంటీర్లుగా ఎంపికైన సేవాదళంలో ఓ కళాశాల అఽధ్యాపకుడ్ని సమన్వయకర్తగా గుర్తిస్తామని, నగరంలో రెసిడెన్షియల్‌ అసోసియేషన్ల ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. గ్రామ పంచాయతీలు, సచివాలయాల సిబ్బందికి ముందుగా గాంధీ సిద్ధాంతాలపై శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. ప్రతి పంచాయతీ, వార్డు స్థాయిలో ప్రజలకు స్వచ్ఛభారత్‌, మద్యపాన నిషేధం, మౌలిక విద్య, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం, మత సామరస్యం ప్రాధాన్యతను వివరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


మనలోనే గాంధీ... గాడ్సే!

మహాత్ముడి సూత్రాలు ఎల్లవేళలా... ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అవసరమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరిలో గాంఽధీ (మంచి), గాడ్సే (చెడు) ఉంటారు... చేసే పని మంచిది అయినపుడు గాంధీ.. చెడు అయినపుడు గాడ్సే ఉంటాడు.. పనిచేసిపుడు మనిషి సంఘర్షణకు గురవుతాడు... అటువంటప్పుడు గాడ్సేను చంపేసి గాంధీని అమలుచేయాలి... అని వివరించారు. గాంధీ సిద్ధాంతాలు, విలువలపై త్వరలో నగరంలో వర్సిటీ ఉపకులపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని బాలమోహనదాసు పేర్కొన్నారు. 


వందేళ్లకు ముందే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అన్న కాన్సెప్ట్‌ ఇప్పుడొచ్చినది కాదు. వందేళ్లకు ముందు దేశంలో ఇళ్లల్లోనే అనేక కుటీర పరిశ్రమలు నెలకొల్పి జీవనం సాగించేవారు... దానిని కాపాడేందుకు మహాత్ముడు స్వదేశీ వస్తువుల వాడకం, విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో భాగంగా ఖాదీ ఉద్యమం ప్రారంభించి ప్రతి ఒక్కరు నూలువడికి దుస్తులు తయారుచేసుకోవాలని పిలుపునిచ్చారు. కుటీర పరిశ్రమలను పునః ప్రారంభించడానికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ దోహదపడుతుంది. మౌలిక విద్య అంటే ప్రతి విద్యార్థి విద్యతోపాటు ఏదో ఒక వృత్తిలో ప్రావీణ్యత సాధించాలని గాంధీ సూత్రీకరించారు. ఇప్పుడు మౌలిక విద్య లేకపోవడం తో యువశక్తిని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం.  ప్రాథమిక, సెకండరీ విద్య మాతృభాషలో అందించడం ద్వారా పిల్లల్లో సంగ్రహణశక్తి పెరిగి ప్రతి అంశాన్నీ ఆకళింపుచేసుకు సామర్థ్యం లభిస్తుంది. కార్మిక సంక్షేమం అమలుచేయాలన్న గాంధీ ఆశయాలకు తూట్లు పడుతున్నాయి. కొవిడ్‌ సమయంలో కార్మికులు కుటుంబాలతో సహా వేల కిలోమీటర్లు నడుచుకుంటూ సొంత ఊళ్లకు వెళ్లడం అత్యంత విషాదకరమైన అంశం. మహాత్ముడే ఉండి ఉంటే.. దీనికి అంగీకరించేవారు కాదు. కార్మికులకు అండగా బలమైన నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2022-08-11T06:43:58+05:30 IST