మహాత్ముడి.. మధురస్మృతులు

ABN , First Publish Date - 2022-08-15T06:12:53+05:30 IST

బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి కోసం జాతిపిత స్ఫూర్తితో ఎందరెందరో స్వాతంత్య్ర సమరంలో కదంతొక్కారు. పల్లె పట్టణం.. అన్న తేడా లేకుండా సమరోత్సాహంతో స్వాతంత్య్ర సమరంలో జాతి నేతలతో పాదం కదిపారు.

మహాత్ముడి.. మధురస్మృతులు
కావూరు వినయాశ్రమంలో అశ్వద్థ మొక్క నాటుతున్న మహాత్మాగాంధీ

  రేపల్లె, బాపట్ల, మాచర్ల, ఆగస్టు 14: బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి కోసం జాతిపిత స్ఫూర్తితో ఎందరెందరో స్వాతంత్య్ర సమరంలో కదంతొక్కారు. పల్లె పట్టణం.. అన్న తేడా లేకుండా సమరోత్సాహంతో  స్వాతంత్య్ర సమరంలో జాతి నేతలతో పాదం కదిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా స్వాతంత్య్ర ఉద్యమం పతాకస్థాయిలో జరిగింది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నాడు మహాత్మాగాంధీ పలు ప్రాంతాల్లో పర్యటించారు. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి.. నేటికీ జేజేలు అందుకుంటున్న జాతిపిత మహాత్ముడి నాటి పర్యటనలను నేటికీ  మరపురాని మధురానుభూతులుగా పలువురు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆజాదీకా అమృతోత్సవాల్లో భాగంగా ఆనాటి మధుర స్మృతులను ప్రతిఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాడు మహాత్ముడు నడియాడిన ప్రాంతాలు, ఉద్యమ ఘటనలను చూస్తే.. 

- రేపల్లె మండలం కావూరులోని వినయాశ్రమంలో 1933లో మహాత్మాగాంధీ పర్యటించి స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపిచ్చారు. గ్రామానికి చెందిన తుమ్మల బసవయ్య, దుర్గాంబ దంపతులు మహాత్మాగాంధీ స్ఫూర్తితో 50 ఎకరాల భూమిని వినయాశ్రమం స్థాపనకు అందజేశారు. ఆ సమయంలో అశ్వద్ధ వృక్షాన్ని గాంధీ నాటారు. ఆశ్రమంలో కుటీరాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్య్రం కోసం పోరాటాల గురించి వివరించారని పలువురు గుర్తు చేసుకుంటూ ఉంటారు.   

- ఉద్యమాలకు ఊపిరిలూదిన రేపల్లె మండలం నల్లూరు గ్రామ స్పూర్తిని మెచ్చిన గాంధీ గ్రామంలో పర్యటించారు. ఆయన మాటలకు ఉత్తేజితులై ఎందరో ఉద్యమంలోకి ఉరికారు. తెనాలికి చెందిన వెంకటప్పయ్య నల్లూరు గ్రామ కేంద్రంగా హిందీతోపాటు ఉద్యమ పాఠాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన యార్లగడ్డ శ్రీకృష్ణయ్య, యార్లగడ్డ రామకృష్ణయ్య, కోనేరు మంగమ్మ, కొల్లి భూషణమ్మ, యార్లగడ్డ కోటేశ్వరరావు, పరుచూరి చినబసవయ్య, సుంకర సుబ్బారావు, పుట్టగుంట బుచ్చియ్య, మలిపెద్ది శేషయ్య, కోనేరు కుటుంబరావు, పుట్టగుంట రాఘవయ్య, పుట్టగుంట నరశింహయ్య, పుట్టగుంట బుల్లికృష్ణయ్య, పరుచూరి రామకోటయ్యలు నాడు ప్రచారం నిర్వహించారు. 1934 జనవరి 18న గాంధీ స్తూపం నిర్మించారు.  

- రేపల్లె మండలం పేటేరులో 1943లో గాంధీ పర్యటించి ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్య గ్రంఽథాలయంలో బసచేశారు. రావు రాయన్న, రావు వెంకట్రాయణం, రావు వెంకయ్య తదితరులు స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు.  

- నల్లూరుపాలెంలో గాంధీ పర్యటించారు. ఇందుకు గుర్తుగా ఊరి నడిబొడ్డులో 1946లో గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు.  

- హోంరూల్‌ ఉద్యమంపై బ్రిటీష్‌ ప్రభుత్వ ధమన నీతిని నిరసిస్తూ 1916లో బాపట్లలో సభ జరిగింది. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా బ్రిటీష్‌ ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను విద్యార్థులు బహిష్కరించారు. వీరి కోసం బాపట్లలో 1921 ఫిబ్రవరిలో జాతీయ కళాశాల నెలకొల్పారు.  

- బ్రిటీష్‌ ప్రభుత్వ పునాదులు కదుపుతూ 1921 ప్రాంతంలో చీరాల-పేరాల సత్యగ్రహ ఉద్యమం జరిగింది. 

- పన్ను నిరాకరణోద్యమంలో పెదనందిపాడు అగ్రభాగాన నిలిచింది. నాడు పరిస్థితి చక్కదిద్దడానికి బాపట్ల తాలూకాకు వచ్చిన బ్రిటీష్‌ అధికారి రూఽథర్‌ఫోర్డ్‌ అనేక ఇబ్బందులు పడ్డారు. 

- బాపట్లకు చెందిన భట్టిప్రోలు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో   బాపట్ల తాలూకాలోని గణపవరం కేంద్రంగా ఉప్పు సత్యగ్రహ ఉద్యమం జరిగింది. 

- క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా 1940 ఆగస్టు 12న ప్రజలు బాపట్ల రైల్వేస్టేషన్‌, బాపట్ల సబ్‌కోర్టుపై దాడి చేశారు.    రామచంద్రరావు సబ్‌ జడ్జి కుర్చీలో కూర్చొని బాపట్ల స్వతంత్ర పట్టణమని ప్రకటించారు.  

- బాపట్లలో 1905లో నిర్మించిన టౌన్‌హాలు వేదికగా గాంధీ, నెహ్రూ, డాక్టర్‌ బాబు రాజేంద్రప్రసాద్‌ వంటి ఎందరో జాతియనాయకులు ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 1913 మేనెలలో జరిగిన ప్రధమాంధ్ర మహాసభకు వేధికగా టౌన్‌హాలు నిలిచింది. 

- పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం గ్రామంలో  1928 ఏప్రిల్‌ 18న గాంధీజీ సందర్శించారు. కనుమూరి వెంకటరాజు ఇంట్లో అతిథ్యం పొందారు. ఇక్కడ  రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆంగ్లేయులు గాంధీ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో గ్రామంలో 33 అడుగుల ఏక స్తంభంపై గాంధీజీ విగ్రహాన్ని నిర్మించారు. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహత్ముడు విడిది చేసిన కనుమూరి వెంకటరాజు గృహాన్ని పలువురు సందర్శిస్తుంటారు.  

- 1929 ఏప్రిల్‌ 21 రెంటచింతలలో గాంధీ పర్యటించారు. ప్రస్తుతం వైఆర్‌ఎస్‌హైస్కూల్‌ ప్రాంతంలో నాడు తాటాకు పందిళ్లను వేసి 800 మందితో నూలు ఉడికించారు. విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా రహదారిపై విదేశీ వస్త్రాలను వేసి దహనం చేశారు. గ్రామంలో లాలాలజపతిరాయి పాఠశాల ఏర్పాటుకు మహాత్ముడు శంకుస్థాపన చేశారు.  




Updated Date - 2022-08-15T06:12:53+05:30 IST