రాజధాని నడిబొడ్డున ‘గాంధీ’లో గ్యాంగ్‌రేప్‌..?

ABN , First Publish Date - 2021-08-17T08:47:38+05:30 IST

రాజధాని నడిబొడ్డున.. నిత్యం వందలాది మంది రోగులు వచ్చిపోయే గాంధీ ఆస్పత్రిలో.. తనపైన, తన అక్కపైన ఐదారుగురు గ్యాంగ్‌రే్‌పకు పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనారోగ్యంతో

రాజధాని నడిబొడ్డున ‘గాంధీ’లో గ్యాంగ్‌రేప్‌..?

  • రోగికి సాయంగా వచ్చిన అక్కచెల్లెళ్లపై అఘాయిత్యం!
  • మత్తు ఇచ్చి సెల్లార్‌లోని గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి
  • వారం పాటు కనిపించకపోవడంతో కుమారుడి ఆరా
  • ఆస్పత్రి వెనుక అపస్మారకస్థితిలో చెల్లి.. అక్క మిస్సింగ్‌
  • గ్యాంగ్‌ రేప్‌ జరిగినట్టు బాధితురాలి ఫిర్యాదు

బౌద్ధనగర్‌/అడ్డగుట్ట, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాజధాని నడిబొడ్డున.. నిత్యం వందలాది మంది రోగులు వచ్చిపోయే గాంధీ ఆస్పత్రిలో.. తనపైన, తన అక్కపైన ఐదారుగురు గ్యాంగ్‌రే్‌పకు పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన బావకు చికిత్స చేయించేందుకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించి.. తాను, తన అక్క సహాయకులుగా ఉన్నామని.. అక్కడ తమకు మత్తు మందు ఇచ్చి, ఆస్పత్రి సెల్లార్‌లో ఐదారుగురు లైంగికదాడి చేశారని ఆరోపించింది. వారం పాటు ఆ మహిళలిద్దరూ ఏమయ్యారో అటు ఆస్పత్రిలో ఉన్న పేషెంట్‌కు.. ఇటు ఇంటి దగ్గర ఉన్న కుటుంబసభ్యులకూ తెలియని పరిస్థితి. చివరకు.. అక్క ఆచూకీ గల్లంతు కాగా, చెల్లెలు ఆస్పత్రి వెనుక భాగంలో అపస్మారక స్థితిలో కనిపించింది!! గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


బాధితురాలు, ఆమె అక్క కొడుకు  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి రెండు కిడ్నీలూ పాడైపోవడంతో ఈ నెల 4న ఆయన్ను గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి సహాయకులుగా అతడి భార్య, మరదలు ఆస్పత్రిలో ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో రేడియాలజీ విభాగంలో డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌గా పనిచేసే ఉమామహేశ్వర్‌ అనే వ్యక్తి వారికి బంధువు. అతడి సహకారంతోనే ఆమె తన భర్తను గాంధీ ఆస్పత్రిలో చేర్చింది. ఏడో తేదీ నుంచి ఆమె, ఆమె చెల్లెలు ఇద్దరూ పేషెంట్‌ వద్దకు వెళ్లట్లేదు. పేషెంట్‌ కుమారుడు ఈ నెల 9వ తేదీన.. తన తండ్రి వద్దకు వచ్చాడు. తల్లి, పిన్ని 7వ తేదీ నుంచి తండ్రి వద్దకు రావట్లేదని అతడికి తెలిసింది. వారి కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో.. 11వ తేదీన అతడు తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. ఎట్టకేలకు ఆదివారంనాడు ఉమామహేశ్వర్‌ అతడికి ఫోన్‌ చేసి.. ‘‘ఆస్పత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశంలో దుస్తులు లేని స్థితిలో మీ పిన్ని ఉంది’’ అని చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అక్కడ తుప్పల్లో అపస్మారక స్థితిలో ఉన్న పిన్నికి సపర్యలు చేసి ప్రశ్నించగా.. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపిందని అతడు వివరించాడు. చిన్నమ్మను తన తల్లి ఆచూకీ గురించి అడిగినా చెప్పలేకపోయిందని.. ఆమె తేరుకుంటే అన్ని వివరాలూ తెలుస్తాయనే ఉద్దేశంతో తమ ఊరికి తీసుకెళ్లానని తెలిపాడు.


బాధితురాలి ఫిర్యాదు..

సోమవారం ఉదయానికి కోలుకున్న బాధితురాలు.. తనపై ఉమామహేశ్వర్‌, అతడితోపాటు మరో ముగ్గురు నలుగురు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. జేబురుమాలులో మత్తుమందు స్ర్పే చేసి నోటికి అదిమిపెట్టారని.. తాను స్పృహ తప్పాక సెల్లార్‌లోని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని వెల్లడించింది. దీనిపై మహబూబ్‌నగర్‌ పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా.. వారు ఈ కేసు తమ పరిధిలోకి రాదని, గాంధీ ఆస్పత్రి చిలకలగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఉన్నందున అక్కడ ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితురాలిని తీసుకుని ఆమె బంధువులు సోమవారం మధ్యాహ్నం చిలకలగూడ పీఎ్‌సకు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని ముందుగా భరోసా కేంద్రానికి పంపించి ఆమె స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. ఆ తర్వాత వైద్యపరీక్షలకు పంపించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఉమామహేశ్వర్‌పై రేప్‌ కేసు నమోదు చేసి, అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరికొంతమంది రేప్‌ చేసినట్టు బాధితురాలు చెప్పినందున వారిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపారు. అలాగే.. బాధితురాలి అక్క ఆచూకీ తెలుసుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.


బాధితురాలు విచారణకు సరిగా సహకరించట్లేదని.. ఈ కేసులో కొన్ని అనుమానాలున్నాయని.. తప్పిపోయిన మహిళ ఆచూకీ లభిస్తే మరింత సమాచారం వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఈ నెల 7 నుంచి 15వ తేదీ దాకా వారిద్దరూ ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గత ఐదు రోజులుగా ఉమామహేశ్వర్‌ విధులకు సరిగ్గా హాజరు కావట్లేదని.. ఒకవేళ వచ్చినా రెండు, మూడుగంటలు పనిచేసి కంగారుగా వెళ్లిపోతున్నాడని, తోటి ఉద్యోగులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఇక.. గ్యాంగ్‌రే్‌పపై ఫిర్యాదు చేసినా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీసులపై బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు అక్కడి పోలీసులను సంప్రదించగా.. ఆమె మహబూబ్‌నగర్‌ వచ్చినట్టు తమకు తెలియదని, ఫోన్‌లో  ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించడంతో హైదరాబాద్‌లోనే ఉన్నట్టు భావించి, అక్కడే ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించామని తెలిపారు.


విచారణ జరిపిస్తున్నాం

ఈ ఘటనపై ఆస్పత్రి ఆర్‌ఎంవోలు, ఇతర వైద్యులతో విచారణకు ఆదేశించాం. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నాం. నిందితుడు, ఆ మహిళలు ఆస్పత్రిలో తిరిగిన దృశ్యాలు ఉంటే వాటిని పరిశీలిస్తాం. విచారణ పూర్తి అయిన తర్వాత దోషులు ఎవరో తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం.

డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆస్పత్రి

Updated Date - 2021-08-17T08:47:38+05:30 IST