గాంధీలో పవర్‌ కట్‌

ABN , First Publish Date - 2022-05-11T17:05:14+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో ఇంటర్నల్‌ ప్యానల్‌ బోర్డులో తలెత్తిన లోపం వల్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం రోగులు తీవ్ర ఇబ్బందులు

గాంధీలో పవర్‌ కట్‌

 ఆస్పత్రి ఇంటర్నల్‌ ప్యానల్‌ బోర్డులో లోపం

 మరమ్మతులు చేపట్టిన అధికారులు

 ఇబ్బంది పడిన రోగులు


హైదరాబాద్/అడ్డగుట్ట: గాంధీ ఆస్పత్రిలో ఇంటర్నల్‌ ప్యానల్‌ బోర్డులో తలెత్తిన లోపం వల్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవి కావడంతో వేడికి తట్టుకోలేకపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్యానల్‌ బోర్డులో లోపం, కేబుల్‌ ఫెయిల్‌ కావడం వల్లనే సరఫరా నిలిచిపోయిందని విద్యుత్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఓపీ బ్లాక్‌లో అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని విద్యుత్‌ అధికారులకు తెలియజేయడంతో వారు లోపానికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్యానల్‌ బోర్డులో మరమ్మతులున్నాయని, దీంతో యూజీ కేబుల్‌ కాలిపోయిందని తేల్చారు. దీంతో ప్యానల్‌ బోర్డు మరమ్మతులు చేపట్టారు.


ఓపీ బ్లాక్‌లోనే అంతరాయం 

ఓపీ బ్లాక్‌లోనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రిలో నాలుగు జనరేటర్లు ఉన్నాయి. ఆటోమేటిక్‌గా జనరేటర్లు ఆన్‌ అయ్యాయి. అత్యవసర విభాగాలలో ప్రతి వెంటిలేటర్‌కు రెండు నుంచి మూడు గంటలపాటు బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుంది. విద్యుత్‌ సరఫరా ఆగిపోయినా బ్యాక్‌పతో వెంటిలేటర్‌ పనిచేస్తుంది. వెంటనే జనరేటర్లు కూడా పనిచేయడంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. విద్యుత్‌ మరమ్మతు పనులు పూర్తి అవుతున్నాయి. సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. 

- డాక్టర్‌ రాజారావు, 

సూపరింటెండెంట్‌, గాంధీ ఆస్పత్రి


సమస్య పరిష్కరించాలని నోటీసులు 

మంగళవారం ఓపీ బ్లాక్‌లో ఇంటర్నర్‌ ప్యానల్‌ బోర్డులో సమస్య తలెత్తడంతోపాటూ యూజీ కేబుల్‌ ఫెయిలవ్వడంతో సరఫరాలో సమస్యలు తలెత్తాయి. ప్యానల్‌ బోర్డులో తలెత్తిన సమస్యలతో ఫీడర్‌ ట్రిప్పవుతుందని వెంటనే సమస్య పరిష్కరించాలంటూ నోటీసులు కూడా జారీచేశాం. ఆస్పత్రి లోపల విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సరిగా లేదంటూ గతంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. కొవిడ్‌ సమయంలో ప్రత్యేకంగా 500 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశాం. నిరంతరం ఆస్పత్రికి 5 ఫీడర్ల నుంచి నిరంతర విద్యుత్‌ సరఫరా అందిస్తున్నాం. గాంధీ ఆస్పత్రిలో సబ్‌స్టేషన్‌ ఏర్పాటు కోసం 2019లో అధికారులకు విజ్ఞప్తి చేశాం. ప్రత్యేక స్థలం ఇస్తే వెంటనే సబ్‌ స్టేషన్‌ నిర్మాణం చేపడతాం.  

- శ్రీధర్‌, డీఈ, ప్యారడైజ్‌ డివిజన్‌

Read more