గాంధీ బ్యాంక్‌లో గల్లీ రౌడీ

ABN , First Publish Date - 2021-10-27T06:30:28+05:30 IST

ఆ బ్యాంక్‌కు సుమారు తొమ్మిది దశాబ్దాలకుపైగా చరిత్ర ఉంది.

గాంధీ బ్యాంక్‌లో గల్లీ రౌడీ
టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో జోగరాజు

టీడీపీ కార్యాలయంపై దాడిలో జోగరాజు

ఈయన గాంధీ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌

బ్యాంక్‌లో మితిమీరిన రాజకీయ జోక్యం

గాడి తప్పుతున్న బ్యాంక్‌ పాలన

35 శాతం దాటేసిన నిరర్థక ఆస్తులు 

అడ్డగోలుగా నియామకాలు.. నష్టాల బాటలో బ్రాంచ్‌లు

ఆందోళనలో వినియోగదారులు


ఆ బ్యాంక్‌కు సుమారు తొమ్మిది దశాబ్దాలకుపైగా చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వమే సహకార స్ఫూర్తితో అహింసామూర్తి మహాత్మా గాంధీ పేరుతో ఏర్పడిన బ్యాంక్‌ అది. అలాంటి బ్యాంక్‌లో హింసా మార్గాన్ని ఎంచుకున్న వారు డైరెక్టర్‌ స్థానంలో తిష్ట వేస్తున్నారు. ఫలితంగా దశాబ్దాల చరిత్ర ఉన్న బ్యాంక్‌పై వినియోగదారులు నమ్మకాన్ని కోల్పోతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడలోని గాంధీ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ 1928లో ఏర్పడింది. నాటి నుంచి క్రమేణా అభివృద్ధి చెందుతూ పొరుగు జిల్లాల్లోనూ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన బ్యాంక్‌ కొందరు డైరెక్టర్ల పనితీరు కారణంగా అప్రతిష్టపాలవుతోంది. కొద్ది రోజుల క్రితం బ్యాంక్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జోగరాజును పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిలో జోగరాజు కీలక పాత్రధారి. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి, స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. బ్యాంక్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా నేర ప్రవృత్తి ఉన్న వారికి డైరెక్టర్లుగా స్థానం కల్పించడంపై బ్యాంక్‌ సభ్యుల్లోనూ, వినియోగదారుల్లోనూ ఆందోళన నెలకొంది. బ్యాంకింగ్‌ రంగంపై ఎలాంటి అవగాహన లేని వారిని రాజకీయ జోక్యంతో డైరెక్టర్లుగా నియమిస్తుండటంతో బ్యాంక్‌ నష్టాల బాట పడుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బ్యాంక్‌ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోతోంది.


అడ్డగోలు నియామకాలు

గాంధీ సహకార బ్యాంక్‌ చైర్మన్‌ నియామకంపైనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు ఏడాది క్రితం బ్యాంక్‌ చైర్మన్‌ వేమూరి బసవకుటుంబరావు అలియాస్‌ చిట్టియ్య కన్నుమూశారు. నిబంధనల ప్రకారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు ఉపాధ్యక్షుడిని ఇన్‌చార్జ్‌గా నియమించాలి. కానీ కో-ఆప్టెడ్‌ డైరెక్టర్‌ను చైర్మన్‌ను చేశారు. కో-ఆప్టెడ్‌ డైరెక్టర్ల నియామకంలోనూ అడ్డదారే. ఆర్బీఐ రిటైర్డ్‌ అధికారులను, బ్యాంకింగ్‌ రంగంతో సంబంధం ఉన్న వారిని, ఆడిటర్లను, న్యాయవాదులను కో-ఆప్టెడ్‌ డైరెక్టర్లుగా నియమించాల్సి ఉండగా  రాజకీయ పైరవీలతో నియామకాలు జరిపారు. సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి అనుచరుడిని ఇటీవల కో-ఆప్టెడ్‌ డైరెక్టర్‌గా నియమించారు. బ్యాంక్‌ పాలకవర్గం పదవీకాలం గత ఏడాది సెప్టెంబరుతో ముగియగా, తాత్కాలిక పాలకవర్గంతోనే నెట్టుకొస్తున్నారు. 


ఇష్టమొచ్చినంత లాగేస్తారు..!

బ్యాంక్‌ మూలధనాన్ని డైరెక్టర్లు హారతి కర్పూరంలా కరిగించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాలకవర్గం సమావేశాలకు సిట్టింగ్‌ చార్జీల కింద రూ.5వేల చొప్పున చెల్లిస్తున్నారు. కామన్‌ గుడ్‌ ఫండ్‌ కింద ఏటా ఒక్కో డైరెక్టర్‌కు రూ.50వేలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంక్‌ సభ్యుల పిల్లల సంక్షేమానికి ఖర్చు చేయాల్సి ఉండగా, ఎవరికి వారు సొంతగా వాటిని వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే గాంధీ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్లు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు రాగా, తాజాగా జోగరాజు లాంటి నేరప్రవృత్తి ఉన్న వారిని డైరెక్టర్లుగా తీసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


అంతా డైరెక్టర్ల ఇష్టారాజ్యం

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పాలకవర్గం మాత్రమే కో-ఆప్టెడ్‌ డైరెక్టర్లను నియమించుకోవాలి. ఇన్‌చార్జ్‌ పాలకవర్గానికి ఆ అర్హత లేదు. కానీ నియామకాలు జరిగిపోయాయు. మరోవైపు డైరెక్టర్లు ఎవరికి వారు ఉద్యోగుల నియామకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టర్ల బంధువులు అయితే అదే అర్హతలా అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. ఓ డైరెక్టర్‌కు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు బ్యాంక్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. పలువురు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. తాత్కాలిక పాలకవర్గం ఉద్యోగుల నియామకాల జోలికి వెళ్లకూడదు.. కానీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ట్రైనింగ్‌ ఆఫీసర్‌ అంటూ మూడు పోస్టులను సృష్టించి నియామకాలు చేసేశారు. ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడిన నిర్ణయాలకు తాత్కాలిక పాలకవర్గం దూరంగా ఉండాలి. కానీ సుమారు 35 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చారు. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. అడ్డగోలు నిర్ణయాల కారణంగా ఇప్పటికే పలు బ్రాంచ్‌లు నష్టాల బాటలో నడుస్తున్నట్టు సమాచారం. నిరర్థక ఆస్తులు 35 శాతం దాటేశాయి. నష్టాలు మరింత పెరిగితే భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-10-27T06:30:28+05:30 IST