మళ్లీ కొవిడ్‌ ఆస్పత్రిగా గాంధీ

ABN , First Publish Date - 2021-04-17T08:49:44+05:30 IST

కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండడంతో గాంధీ ఆస్పత్రి మళ్లీ కొవిడ్‌ ఆస్పత్రిగా మారుతోంది.

మళ్లీ కొవిడ్‌ ఆస్పత్రిగా గాంధీ

  • పూర్తి స్థాయిలో కరోనా చికిత్సలు.. 
  • అన్ని పడకలు మహమ్మారి వైద్యానికే
  • నేటి నుంచి ఓపీ, అత్యవసర, సాధారణ అడ్మిషన్లు బంద్‌
  • ప్రస్తుతమున్న నాన్‌కొవిడ్‌ రోగులకు చికిత్స కొనసాగింపు


హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండడంతో గాంధీ ఆస్పత్రి మళ్లీ కొవిడ్‌ ఆస్పత్రిగా మారుతోంది. గాంధీలో పూర్తి స్థాయిలో కొవిడ్‌ సేవలను అందించాలని ఆస్పత్రి అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వ్యులు జారీచేసే వరకు కొవిడ్‌ రోగులనే గాంధీలో చేర్చుకోవాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం నుంచి అత్యవసర, సాధారణ అడ్మిషన్లు నిలిచిపోనున్నాయి. సాధారణ ఓపీ సేవలకు వైద్య సేవలు అందించరు. గాంధీ ఆస్పత్రిలో మొత్తం 1,850 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 500 మంది కరోనా పాజిటివ్‌లు, 500 వరకు నాన్‌ కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. 


ఇకనుంచి అన్ని పడకలను సీరియస్‌ కొవిడ్‌ రోగులకు కేటాయించనున్నారు. ప్రస్తుతం 500 మంది కొవిడ్‌యేతర జబ్బులకు చికిత్స పొందుతున్నారు. వారికి నయమయ్యే వరకు గాంధీలోనే చికిత్స అందిస్తారు. వారిలో ఆరోగ్యం మెరుగ్గా ఉన్న వారిని ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారు. కొత్తగా ఎవరైనా వస్తే వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తారు. నాన్‌కొవిడ్‌ ప్రెగ్నెసీ కేసులను సుల్తాన్‌ బజార్‌ ప్రసూతి, పేట్లబురుజు మెటర్నిటీ, నిలోఫర్‌ ఆస్పత్రికి తరలిస్తారు. రోడ్డు ప్రమాదాల కేసులు, సీరియస్‌ నాన్‌కొవిడ్‌ రోగులు ఎవరైనా వస్తే వారికి ప్రాథమిక చికిత్స చేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తారు. ఇకపై ఇతర జబ్బులకు ఎంపిక (ఎలెక్టివ్‌) చేసిన శస్త్రచికిత్సలను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నారు. 600 వరకు ఐసీయూ, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ చికిత్సలకు కేటాయించారు. అవసరాన్ని బట్టి ఐసీయూ ఆక్సిజన్‌ వార్డులను పెంచనున్నారు. కరోనా పాజిటివ్‌లకు త్రీలైన్‌ ఆక్సిజన్‌ సదుపాయాన్ని కల్పించనున్నారు. 


విభాగాధిపతులతో సమావేశం

గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు ఆస్పత్రి విభాగాల అధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న నాన్‌కొవిడ్‌ రోగుల వైద్య సేవలు, వారిని ఇతర ఆస్పత్రులకు తరలించే పరిస్థితులపై చర్చించారు. దశల వారీగా ఇతర వైద్య సేవలను తగ్గించనున్నట్లు కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి చెప్పారు. 


ఫ్లోర్‌కు ఒక ఆర్‌ఎంఓకి బాధ్యతలు

గాంధీ ఆస్పత్రిలో కొవిడ్‌ రోగుల ఆరోగ్య పరిస్థితుల పర్యవేక్షణకు ఒక్కో అంతస్తుకు ఒక ఆర్‌ఎంవోను ఇన్‌చార్జిగా నియమిస్తున్నారు. అవసరమైతే వారికి సహాయంగా మరి కొందరు సీనియర్‌ వైద్యులను కేటాయిస్తారు. ఆయా ఫ్లోర్లలో రోజూ ఎంత మంది కొవిడ్‌ రోగులు అడ్మిట్‌ అవుతున్నారు, ఎందరు డిశ్చార్జి అవుతున్నారు, ఏయే కారణాలతో చనిపోతున్నారనే అంశాలపై ఎప్పటికప్పడు రికార్డులు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Updated Date - 2021-04-17T08:49:44+05:30 IST