గుర్రపు డెక్కతో నిండిపోయిన ఈస్ట్ స్వాంప్ డ్రెయిన్
కాలువ మరమ్మతులకు కాసులేవి?
జూన్ 10నే సాగునీరు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటన
కాలువల మరమ్మతుల పనులు పేపర్ల పైనే..
నిధులు రాల్చకుండా మాటలతో సరిపెడుతున్న ప్రభుత్వం
నానాటికీ బలహీనపడుతున్న కట్టలు, రెండేళ్ల నుంచి పూడికతీతలే లేవు
ఆందోళనలో అన్నదాతలు
రైతుల మేలు కోరి ఈ ఏడాది ముందస్తు ఖరీఫ్‌ను తీసుకొస్తున్నాం.. దాని కనుగుణంగా జూన్ 10నే కృష్ణాడెల్టా పరిధిలోని ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నాం.. అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ కీలకమైన కాలువల మరమ్మతులు, పూడికతీతల వంటి వాటి విషయంలో గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వాటి పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎక్కడన్నా మైనర్ రిపేర్లు చేసినా ఏవో మొక్కుబడి తంతుగా ముగించారే తప్ప సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం వైపు నుంచి కొరవడడంతో నిర్లక్ష్యపుమేట కాలువలను కమ్మేసి అవి దీనావస్థకు చేరుకున్నాయి.
బాపట్ల, మే22(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా దాదాపు 100 పైబడి పనులకు రూ.13 కోట్ల అంచనాలతో మరమ్మతుల ప్రతిపాదనలను జిల్లా జలవనరుల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. తాజాగా జరిగిన జలవనరుల సలహా మండలి సమావేశంలో కూడా ప్రజా ప్రతినిధులు వివిధ కాలువల మరమ్మతులపై అధికారులను నిలదీశారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిధులు రాల్చకుండా తమ దగ్గర నుంచి ఫలితాలు రావాలనడం ఎంతవరకు భావ్యమని యంత్రాంగం లోలోన మదనపడుతోంది. ఈ పనుల కోసం ముందుకొచ్చే కాంట్రాక్టర్లను కూడా తొలుత పనులు చేస్తే తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని అందుకు అంగీకారమైతేనే ముందుకు రావాలని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనలకు గుత్తేదార్లు ముందుకొచ్చే అవకాశమేలేదని కాలువల మరమ్మతుల పనులు నీటి విడుదల గడువు జూన్ 10లోపుల పూర్తికావడం సాధ్యపడదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా పశ్చిమ డెల్టా కింద 3,50,000 ఎకరాలు..
బాపట్ల జిల్లాలో కృష్ణాపశ్చిమ డెల్టాకింద 3,50,000 ఎకరాలు సాగవుతుందని అధికారిక అంచనా. అనధికారికంగా ఇది ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ప్రధాన సాగునీటి కాలువగా కొమ్మమూరు ఉంది. ప్రకాశం నుంచి కలిసిన పర్చూరు, చీరాల పరిధిలోని 5 మండలాల్లో కొమ్మమూరు కాల్వకింద ఆయకట్టు దాదాపు 65,000 ఎకరాలు ఉండే అవకాశం ఉంది. మిగిలినది వేమూరు, రేపల్లె, బాపట్ల పరిధిలో ఉంది.
మరమ్మతులు కరువు.. బలహీనంగా కట్టలు..
దాదాపు రెండేళ్ల నుంచి కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. పూడిక సమస్యల కారణంగా చివరి ఆయకట్టుకు నీరందక అన్నదాతలు నష్టపోతున్నారు. కొమ్మమూరు కాలువ కట్టలు కోతకు గురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టలు బలహీనంగా ఉన్న కారణంగా పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. నల్లమడ వాగుకట్టలు బలహీనంగా ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తే కట్టలు కొట్టుకుపోయి వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
రూ.13 కోట్ల అంచనాలతో...
రూ.13 కోట్ల అంచనాలతో దాదాపు వందపైన పనులకు జిల్లాజలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదని సమాచారం. బిల్లులు కావనే భయంతో కాంట్రాక్టర్లు ముందు పనులు చేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో ఇద్దరి మధ్య అధికారులు నలిగిపోతున్నారు. సాగునీటి కాలువల మరమ్మతులకు తోడు మురుగు నీటి కాల్వలను కూడా శుభ్రం చేయాల్సి ఉంది. కృష్ణా పశ్చిమడెల్టాకు సాగునీరు విడుదలకు ప్రభుత్వం నిర్దేశించిన జూన్ 10లోగా కాల్వల మరమ్మతుల పనులు ఎంతవరకు పూర్తవుతాయి అనేది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.
నాగార్జున సాగర్ ఆయకట్టుకు..
నాగార్జున సాగర్ ఆయకట్టుకు జూలై 15న నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాగార్జున సాగర్ కుడి కాల్వ పరిధిలోని అద్దంకి బ్రాంచ్ కెనాల్ కింద అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 1,72,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ ఖరీఫ్ ఆలస్యంగా మొదలవుతుంది. ప్రభుత్వం జూలై 15నే సాగర్ నీటిని విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ దీని పరిధిలో కూడా కాలువలు కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో కంప చెట్లు పెరిగి దీనస్థితికి చేరుకున్నాయి.
=====================================================================================