మూడు తొండాల గణపతి

ABN , First Publish Date - 2021-02-12T08:13:36+05:30 IST

‘తొండము నేకదంతము తోరపు బొజ్జయు’... అంటూ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడం పరిపాటి. కానీ ఆ ఆలయానికి వెళ్ళినవారు మాత్రం ‘త్రితొండముల్‌ ఏకదంతము’ అనాల్సిందే! ఎందుకంటే అక్కడ

మూడు తొండాల గణపతి

ఆలయ దర్శనం


‘తొండము నేకదంతము తోరపు బొజ్జయు’... అంటూ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడం పరిపాటి. కానీ ఆ ఆలయానికి వెళ్ళినవారు మాత్రం ‘త్రితొండముల్‌ ఏకదంతము’ అనాల్సిందే! ఎందుకంటే అక్కడ వినాయకుడు మూడు తొండాలతో దర్శనం ఇస్తాడు. ఈ అరుదైన ఆలయం మహారాష్ట్రలోని పుణేలో ఉంది.


కార్యం ఏదైనా దాన్ని సిద్ధింపజేసే వేలుపుగా తొలి పూజను అందుకొనేది గణపతే. ఆయన పేరు వినగానే తొండం, ఏకదంతం, ఎలుక వాహనం, పెద్ద చెవులు కళ్ళముందు మెదులుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో... గణపతి భిన్న రూపాల్లో కనిపించే ఆలయాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ప్రత్యేకమైనది పుణే నగరంలోని సోమవార్‌ పేటలో ఉన్న త్రిశుండ్‌ గణపతి ఆలయం. అందులో కొలువైన గణపతికి ఎన్నో విశిష్టతలున్నాయి. ఎక్కడా లేని విధంగా మూడు తొండాలతో, ఆరు చేతులతో, ఒడిలో దేవేరితో... విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. అంతేకాదు... ఆ గణనాథుడు మూషిక వాహనుడు కాదు- మయూర వాహనుడు! 


ఈ ఆలయానికి 250 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఇండోర్‌ సమీపంలోని ధర్మపూర్‌కు చెందిన భీమ్‌జీగిరి గోసవీ అనే వ్యక్తి నగఝరి నదీ తీరంలో 1754లో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. పదహారేళ్ళ తరువాత... 1770లో గణపతి ప్రతిష్ఠ జరిగింది. శిల్పకళా వైదుష్యం రీత్యా కూడా ఈ ఆలయానికి ఎంతో గుర్తింపు ఉందది. గర్భాలయంలోని గోడ మీద మూడు భాషల్లో శాసనాలు చెక్కి ఉన్నాయి. రెండు శాసనాలు సంస్కృతం (దేవనాగరి లిపి)లో ఉంటే, మూడో శాసనం పర్షియన్‌ లిపిలో ఉంటుంది. మొదటి శాసనంలో ఈ ఆలయ నిర్మాణ వివరాలు, రెండో శాసనంలో భగవద్గీత శ్లోకం, మూడో శాసనం మీద గురుదేవదత్త నిర్మాణానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. మహాలక్ష్మి, విష్ణువు, శివుడు, నటరాజు, కృష్ణుడు, కాలభైరవుడు, బుద్ధుడు ... ఇలా వివిధ దేవతా మూర్తుల బొమ్మలనూ, భూలోక, దేవలోక జీవరాశుల చిత్రాలనూ ఆలయం గోడలపై చెక్కారు. ఆలయ ప్రవేశం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు స్వాగతిస్తాయి. రాజస్థానీ, మాల్వా, దక్షిణ భారత శిల్ప శైలులు ఈ శిల్పాలలో కనిపిస్తాయి. ఆలయం బయట... బ్రిటిష్‌ సైనికుడు గొలుసులతో ఖడ్గమృగాన్ని బంధిస్తున్నట్టున్న శిల్పం చూపరులను ఆకర్షిస్తుంది. 


ఈ ఆలయం కింది అంతస్థులో... ఆలయ వ్యవస్థాపకుడు భీమ్‌జీగిరి గోసవీ సమాధి ఉంది. సాధారణంగా ఈ కింది భాగం ఎప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది. గురుపౌర్ణమి రోజున మాత్రమే దాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తారు. ఆ రోజున ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి, నీటిని తొలగిస్తారు. ఆధ్మాత్మిక గురువుగా పరిగణించే భీమ్‌జీగిరి గోసవీకి నివాళులు అర్పించడానికి భక్తులను అనుమతిస్తారు. వినాయకచవితి, సంకటహర చతుర్థి సందర్భంగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

Updated Date - 2021-02-12T08:13:36+05:30 IST