కరోనాతో గేమ్స్‌!

ABN , First Publish Date - 2020-07-11T07:51:02+05:30 IST

నాయకులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కరోనాతో గేమ్స్‌ ఆడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ‘సహాయం’ పేరిట జన జాతర చేసిన నాయకులు... ‘అన్‌లాక్‌’ మొదలయ్యాక మరింత

కరోనాతో గేమ్స్‌!

  • నిబంధనల గీత దాటుతున్న నాయకులు
  • వారికీ, గన్‌మెన్‌, అనుచరులకు వైరస్‌.. లాక్‌, అన్‌లాక్‌లో రూల్స్‌కు పాతర
  • గన్‌మెన్‌, అనుచరుల పేరిట పరీక్షలు.. నెగెటివ్‌ వచ్చిందంటే గొప్పగా ప్రకటన
  • పాజిటివ్‌ తేలితే గుట్టుగా క్వారంటైన్‌కు.. రిస్క్‌లో అనుచరులు, ప్రజలు
  • మంత్రి కుమారుడికి కొవిడ్‌?  ముగ్గురు గన్‌మెన్లకూ వైరస్‌ 

నాయకులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కరోనాతో గేమ్స్‌ ఆడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ‘సహాయం’ పేరిట జన జాతర చేసిన నాయకులు... ‘అన్‌లాక్‌’ మొదలయ్యాక మరింత విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీంతో కరోనా వైరస్‌ బారిన పడుతున్న నాయకులు, వారి అనుచరులు, గన్‌మెన్‌ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నాయకుల కుటుంబ సభ్యులూ కొవిడ్‌ బాధితులవుతున్నారు. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కరోనా తమదాకా రాదనే అతి విశ్వాసమో, ఒకవేళ వస్తే గుట్టుగా వైద్యం చేసుకొని గట్టెక్కగలమనే ఽధీమానో... కొందరు నేతలు యథేచ్ఛగా నిబంధనలకు పాతరేస్తున్నారు. కొందరైతే కరోనా అని తేలితే... ఇబ్బంది వస్తుందనే భయంతో గన్‌మెన్‌, పీఏ, పీఎస్‌, అనుచరుల పేరిట పరీక్షలు చేయించుకుంటున్నారు. పాజిటివ్‌ వస్తే గుట్టుగా క్వారంటైన్‌ లోకి వెళ్లిపోతున్నారు. వీరి చర్యలు సొంత అనుచరులు, కార్యకర్తలు, పనులపై వచ్చే ప్రజల ప్రాణాలను రిస్క్‌లోకి నెట్టేస్తున్నాయి. కర్నూలు, చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు అవసరం లేకున్నా రాజకీయ హడావుడి చేశారు. లాక్‌డౌన్‌ సమయంలోనే మందీమార్బలంతో సమావేశాలు, ర్యాలీలు, అనధికారిక మీటింగ్‌లు నిర్వహించారు. వీటికి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీల కార్యకర్తలు, నేతలు, అనుచరులను సమీకరించారు. ఫలితం ఆయా ప్రాంతాల్లో వారి కారణంగా అనేక మంది అనుచరులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు కరోనా బారినపడ్డారు. ఈ నేతలకు రక్షణగా నిలిచే గన్‌మెన్‌లే తొలి బాధితులుగా మారారు. ఆ తర్వాత వారికి ప్రొటోకాల్‌ డ్యూటీచేసిన ప్రభుత్వ అధికారులు కరోనా బారినపడ్డారు. అన్‌లాక్‌ అమలవుతున్న దశలోనూ మరి కొందరు ఇంకా దూకుడును ప్రదర్శించారు. 


లేదంటే గొప్పగా.. ఉంటే గుట్టుగా..

నేతలు, ప్రజాప్రతినిధుల్లో కరోనా లక్షణాలు  బయటపడితే కొందరు తమ పేరిట, మరి కొందరు గన్‌మెన్‌, పీఏ, పీఎస్‌, ఇంకా నమ్మకస్తుడి పేరిట పరీక్షలు చేయించుకుంటున్నారు. నెగెటివ్‌ వస్తే తనకు కరోనాలేదని గొప్పగా ప్రకటిస్తున్నారు. పాజిటివ్‌ వస్తే మాత్రం దాన్ని గుట్టుగా ఉంచేసి...మూడోకంటికి తెలియకుండా క్వారంటైన్‌కు వెళ్లిపోతున్నారు. నెగెటివ్‌ వచ్చిందని చెప్పకపోయినా నష్టం లేదు. కానీ పాజిటివ్‌ వస్తేనే అధికారికంగా ప్రకటించాలి. ఎందుకంటే, అప్పటి దాకా ఆ ప్రజాప్రతినిధి వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు, పనులకోసం వచ్చిన సామన్య ప్రజలు కూడా అప్రమత్తమై పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొందరు నేతలు  పరీక్ష ఫలితాలను గుట్టుగా ఉంచడంతో వారి కుటుంబంతోపాటు అనుచరులు, ప్రజలు మరింత ప్రమాదంలో పడుతున్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు.


ఈ విషయంలో కొందరు నేతలు మాత్రం ఆదర్శంగా ఉంటున్నారు. కరోనా రాగానే దాన్ని బహిరంగంగా ప్రకటించి తమతోపాటు ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ‘‘ప్రజాప్రతినిధులకు కరోనా వస్తే బయటకు చెప్పడం వల్ల వారి గౌరవం ఏమాత్రం తగ్గదు. వారు ఆదర్శంగా ఉండి కరోనా వచ్చిందని ప్రకటిస్తే, అప్పటి వరకు  వారితో ఉన్న వారు కూడా అప్రమత్తమై వైద్యపరమైన పరీక్షలు, జాగ్రత్తలు తీసుకోగలరు. తమ ప్రాణాలను కాపాడుకోగలరు. అలాకాకుండా సైలెంట్‌గా క్వారంటైన్‌కు వెళ్లిపోతే ప్రజలు, అనుచరులు ఏమైనా ఫరవాలేదా? ఇదేనా ఆదర్శం? కరోనాను దాయడం అతిపెద్ద ప్రమాదకరచర్య’’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.


బహుపరాక్‌!

  1. అనంతపురం జిల్లాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఇంట్లో ఐదు కరోనా కేసులొచ్చాయి.  ఆయన పరిస్థితి ఏమిటో బయటకు చెప్పడం లేదు. ఆయన క్వారంటైన్‌కు వెళ్లిపోయారని తెలిసింది. ఇదే జిల్లాలో మరో ముగ్గురు ప్రజాప్రతినిధుల రక్షణ సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. 
  2. ఉత్తరాంధ్రకు చెందిన ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి ఇంట్లో కరోనా కేసులు వెలుగుచూశాయి. వారసుడికి, రక్షణ సిబ్బందికి పాజిటివ్‌ అని తేలింది. ప్రజాప్రతినిధికి పరీక్షించగా నెగెటివ్‌ వచ్చింది. అయితే ఆయన హోమ్‌క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. 
  3. విజయనగరం జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి, అధికారపార్టీ ముఖ్యనేత కరోనా బారినపడ్డారు. వారిద్దరూ ఆ విషయం అధికారికంగా ప్రకటించి హోమ్‌ క్వారంటైన్‌కు వెళ్లారు. 
  4. కడప జిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధికి పాజిటివ్‌ వచ్చినట్లు తొలుత అనధికారిక సమాచారం ఇచ్చారు. దీనిపై గందరగోళం తలెత్తడంతో ఆయనకు నెగెటివ్‌ అని మరోసారి ప్రకటన ఇచ్చారు. కానీ ఆయన మాత్రం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. సీఎం పర్యటనకు దూరంగా ఉండిపోయారు. ఇదే జిల్లాలో మరో నాయకుడి సోదరుడికీ పాజిటివ్‌ వచ్చింది. కుటుంబమంతా హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటోంది. 
  5. నెల్లూరు జిల్లాలో ఓ ప్రజాప్రతినిధికి పాజిటివ్‌ వస్తే కుటుంబమంతా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు వారు అధికారికంగానే ప్రకటించారు. 


సీఎం మాస్క్‌ పెట్టుకోకపోతే ప్రజలెలా పెట్టుకుంటారు?: టీడీపీ 

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.    టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ నాగుల్‌మీరా శుక్రవారం  మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వం చేసే కరోనా టెస్టుల్లో 60ు మాత్రమే కచ్చితత్వం ఉందని అధికారులే చెప్తున్నందున వాస్తవం ఏంటో జగనే ప్రజలకు చెప్పాలి. ముఖ్యమంత్రే మాస్క్‌ పెట్టుకోకపోతే... ప్రజలేం పెట్టుకుంటారు? 6 కోట్ల మందికి 18 ల్యాబులు ఏం సరిపోతాయి? పాజిటివ్‌ కేసులు 29వేలని ప్రభుత్వం చెప్తుంటే, వాస్తవానికి అంతకు పది రెట్లు అధికంగా ఉంటాయి. ప్రభుత్వం టెస్టులు చేయలేక చాలా జిల్లాల్లో ఆపేశారు. కొవిడ్‌ నివారణ చర్యల పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది’ అని వారు ఆరోపించారు. 

Updated Date - 2020-07-11T07:51:02+05:30 IST