కోడిపుంజు - నక్క

ABN , First Publish Date - 2021-03-11T04:45:04+05:30 IST

ఒక చిన్న ఊరిలో ఒక కోడిపుంజు నివసించేది. అది చాలా తెలివైనది. ఒకరోజు ఆ ఊరికి ఒక నక్క వచ్చింది. ఆ నక్క చెట్టు కొమ్మపై కూర్చుని ఉన్న కోడిపుంజును చూసింది. కోడిపుంజును చూడగానే ‘‘ఈరోజు ఎలాగైనా దీన్ని తినాలి’’ అని మనసులో అనుకుంది

కోడిపుంజు - నక్క

ఒక చిన్న ఊరిలో ఒక కోడిపుంజు నివసించేది. అది చాలా తెలివైనది. ఒకరోజు ఆ ఊరికి ఒక నక్క వచ్చింది. ఆ నక్క చెట్టు కొమ్మపై కూర్చుని ఉన్న కోడిపుంజును చూసింది. కోడిపుంజును చూడగానే ‘‘ఈరోజు ఎలాగైనా దీన్ని తినాలి’’ అని మనసులో అనుకుంది నక్క. చెట్టుపై నుంచి కోడిపుంజును కిందకు వచ్చేలా చేయడం కోసం నెమ్మదిగా మాటలు కలిపింది. ‘‘చెట్టుపైన  కూర్చుని ఏం చేస్తున్నావ్‌! కిందకు రా.. ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం’’ అని అంది. అప్పుడు కోడిపుంజు ‘‘నేను కిందకు రాను, ఎందుకంటే నేను క్రూరమైన జంతువులకు దూరంగా ఉంటాను.


కిందకొస్తే నువ్వు నన్ను పట్టుకుని తినేస్తావ్‌’’ అంది. అప్పుడు నక్క ‘‘ఈ విషయం నీకు తెలియదా! అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండాలని, ఒకరినొకరు చంపుకోవద్దని నిర్ణయించారు. కాబట్టి నువ్వు భయపడాల్సిన పనిలేదు. కిందకు రా! మనం కూర్చుని మాట్లాడుకుందాం’’ అని నెమ్మదిగా మనసు మార్చే ప్రయత్నం చేసింది. నక్క తనను ఫూల్‌ను చేయాలని ప్రయత్నిస్తోందని కోడిపుంజుకు అర్థమయింది. వెంటనే ‘‘అవునా! అయితే మనమందరం కలిసి ఉండొచ్చు’’ అంటూ తల ఎత్తి అటు ఇటూ చూడటం మొదలుపెట్టింది. అది చూసిన నక్క ‘‘ఏం కనిపిస్తోంది? ఎందుకలా చూస్తున్నావు?’’ అని అడిగింది. ‘‘కొన్ని అడవి కుక్కలు అడవిలో నుంచి ఇటువైపు వస్తున్నట్టు కనిపిస్తోంది’’ అంది కోడిపుంజు.


ఆ మాటలు విన్న నక్క భయంతో వణికిపోయింది. వెంటనే అక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు కోడిపుంజు ‘‘ఎక్కడికి వెళుతున్నావు? మనం కూర్చుని మాట్లాడుకుందాం. అడవి కుక్కలు కూడా మనతో చేరతాయి’’ అంది. ‘‘లేదు..లేదు. నేను ఇక్కడే ఉంటే ఆ కుక్కలు నన్ను చంపేస్తాయి’’ అంది నక్క. ‘‘అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండాలని నిర్ణయించారని చెప్పావు కదా!’’ అని అడిగింది కోడిపుంజు. ‘‘ఆ వార్త కుక్కలకు ఇంకా చేరినట్టు లేదు. అందుకే నేను వెళ్లిపోతున్నాను’’ అంటూ అక్కడి నుంచి జారుకుంది నక్క. 

Updated Date - 2021-03-11T04:45:04+05:30 IST