Abn logo
Oct 28 2021 @ 02:09AM

ఆడుతూ..పాడుతూ

8 వికెట్లతో బంగ్లాపై గెలుపు

ఇంగ్లండ్‌ మరో సునాయాస విజయం సాధించింది.. బంగ్లాదేశ్‌ను ఎనిమిది వికెట్లతో ఓడించి సూపర్‌-12లో వరుసగా రెండో గెలుపును ఖాతాలో వేసుకుంది..బ్యాటింగ్‌ వికెట్‌పై ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే పరిమితం చేసి, అనంతరం జేసన్‌ రాయ్‌ ధాటి బ్యాటింగ్‌తో ఐదు ఓవర్లకుపైగా మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసేసింది..  నాలుగు పాయింట్లతో గ్రూప్‌-1లో టాప్‌లో నిలిచింది.


అబుధాబి: వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లు అదరగొడుతున్నారు. మొన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ పూర్తిగా కట్టడిచేసిన వారు.. బ్యాటింగ్‌ పిచ్‌పై బంగ్లాదేశ్‌కూ కళ్లెం వేశారు. స్పిన్నర్లు, పేసర్లు సమష్టిగా సత్తా చాటడంతో బుధవారంనాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చిత్తయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 124/9 స్కోరే చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (29) టాప్‌స్కోరర్‌. నసూమ్‌ అహ్మద్‌ (19 నాటౌట్‌), మహ్మదుల్లా (19) పర్లేదనిపించారు. మిల్స్‌ (3/27) మూడు, లివింగ్‌ స్టోన్‌, మొయిన్‌ అలీ  చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్‌ 14.1 ఓవర్లలోనే 126/2 స్కోరు చేసి ఇంగ్లండ్‌ గెలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జేసన్‌ రాయ్‌ (38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) హాఫ్‌ సెంచరీ చేయగా, డేవిడ్‌ మలాన్‌ (28 నాటౌట్‌) రాణించాడు. షోరిఫుల్‌ ఇస్లామ్‌, నసూమ్‌ అహ్మద్‌ ఒక్కో వికెట్‌ తీశారు.


జేసన్‌ దూకుడు: లక్ష్యం చిన్నదే అయినా ఇంగ్లండ్‌ ఓపెనర్లు ముఖ్యంగా ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. మరోవైపు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొనే ప్రయత్నం ఏమాత్రం చేయని బంగ్లాదేశ్‌ బౌలర్లు పదేపదే షార్ట్‌పిచ్‌ బంతులేసి ప్రత్యర్థి బ్యాటర్ల పని మరింత సులువు చేశారు. అయితే బట్లర్‌ (18) ఐదో ఓవర్లో నసూమ్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అనంతరం జేసన్‌ రాయ్‌ భారీషాట్‌ ఆడబోయి షోరిఫుల్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అప్పటికే ఇంగ్లండ్‌ గెలుపు తీరాలకు చేరగా.. షోరిఫుల్‌ బంతిని బౌండరీకి తరలించిన బెయిర్‌స్టో (8 నాటౌట్‌) లాంఛనాన్ని పూర్తి చేశాడు. 


బ్యాటింగ్‌ వికెట్‌పై బంగ్లా బోల్తా: టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మహ్మదుల్లా మొదట బ్యాటింగ్‌ ఎంచుకుని బోల్తాపడ్డాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్లు, పేసర్ల  దెబ్బకు బంగ్లా జట్టు క్రమంతప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. మొయిన్‌ అలీ వేసిన రెండో ఓవర్లోని రెండు బంతుల్లో లిటన్‌ దాస్‌ (9), నయీమ్‌ (5) అవుటయ్యారు. వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో బంగ్లా స్కోరుబోర్డు వేగం పూర్తిగా మందగించింది. ఐదో ఓవర్లో మొయిన్‌ బౌలింగ్‌లో ముష్ఫికర్‌ బౌండరీ సాధించగా.. వోక్స్‌ షార్ట్‌పిచ్‌ బంతిని హుక్‌ చేయబోయిన షకీబల్‌ షార్ట్‌ఫైన్‌ లెగ్‌లో ఆదిల్‌ రషీద్‌ పట్టిన అద్భుత క్యాచ్‌తో నిష్క్రమించాడు. ఫలితంగా పవర్‌ ప్లే ముగిసేసరికి 27 రన్సే చేసిన బంగ్లాదేశ్‌ టాపార్డర్‌ మూడు వికెట్లు నష్టపోయింది. ఈ దశలో ముష్ఫికర్‌, మహ్మదుల్లా జాగ్రత్తగా ఆడుతూ వీలు చిక్కితేనే షాట్లు కొడుతూ నాలుగో వికెట్‌కు 37 రన్స్‌తో ఇన్నింగ్స్‌ పునర్నిర్మాణ పనిలోపడ్డారు. ఈ దశలో ముష్ఫికర్‌ రహీమ్‌ను ఎల్బీచేసిన స్పిన్నర్‌ లివింగ్‌స్టోన్‌ బంగ్లాను మరోసారి దెబ్బకొట్టాడు. ఇక అఫిప్‌ రనౌట్‌కాగా కుదురుకున్న మహ్మదుల్లాను లివింగ్‌స్టోన్‌ పెవిలియన్‌ చేర్చాడు. 83/6తో మరోసారి బంగ్లా ఇబ్బందుల్లోపడగా..నూరుల్‌ హసన్‌ (16), మెహ్దిహసన్‌ (11), చివర్లో నసూమ్‌ అహ్మద్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో స్కోరును సెంచరీ దాటించారు. 


స్కోరుబోర్డు

బంగ్లాదేశ్‌: లిటన్‌ దాస్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) అలీ 9, నయీమ్‌ (సి) వోక్స్‌ (బి) అలీ 5, షకీబల్‌ (సి) రషీద్‌ (బి) వోక్స్‌ 4, ముష్ఫికర్‌ (ఎల్బీ) లివింగ్‌స్టోన్‌ 29, మహ్మదుల్లా (సి) వోక్స్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 19, అఫిఫ్‌ రనౌట్‌ (మిల్స్‌/బట్లర్‌) 5, నూరుల్‌ (సి) బట్లర్‌ (బి) మిల్స్‌ 16, మెహ్దిహసన్‌ (సి) వోక్స్‌ (బి) మిల్స్‌ 11, నసూమ్‌ (నాటౌట్‌) 19, ముస్తాఫిజుర్‌ (బి) మిల్స్‌ 0, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం: 20 ఓవర్లలో 124/9, వికెట్లపతనం: 1/14, 2/14, 3/26, 4/63, 5/73, 6/83, 7/98, 8/124, 9/124, బౌలింగ్‌: మొయున్‌ అలీ 3-0-18-2, వోక్స్‌ 4-0-12-1, ఆదిల్‌ రషీద్‌ 4-0-35-0, జోర్డాన్‌ 2-0-15-0, టైమల్‌ మిల్స్‌ 4-0-27-3, లివింగ్‌స్టోన్‌ 3-0-15-2


ఇంగ్లండ్‌: రాయ్‌ (సి) నసూమ్‌ (బి) షోరిఫుల్‌ 61, బట్లర్‌ (సి) నయీమ్‌ (బి) నసూమ్‌ 18, మలాన్‌ (నాటౌట్‌) 28, బెయిర్‌స్టో (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం: 14.1 ఓవర్లలో 126/2, వికెట్లపతనం: 1/39, 2/112, బౌలింగ్‌: షకీబల్‌ 3-0-24-0, ముస్తాఫిజుర్‌ 3-0-23-0, షోరిఫుల్‌ ఇస్లామ్‌ 3.1-0-26-1, నసూమ్‌ అహ్మద్‌ 3-0-26-1, మెహ్దిహసన్‌ 2-0-21-0.