గేమ్‌ఛేంజర్‌!

ABN , First Publish Date - 2021-06-23T09:13:04+05:30 IST

‘‘ఆట స్థలం అనేది వినోదాన్నిచ్చే విలాసవంతమైన చోటు కాదు. పిల్లల్లో ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందుబాటులో ఉండాల్సిన ప్రదేశం.

గేమ్‌ఛేంజర్‌!

బడుల్లో ప్లే గ్రౌండ్స్‌, సదుపాయాలు లేక ఆటలకు దూరమౌతున్న పిల్లలు...

దేశంలో ఏటా పది కోట్లకు పైగా పేరుకుపోతూ, పర్యావరణానికి సవాల్‌గా మారిన టైర్ల వ్యర్థాలు...

భిన్నమైన ఈ రెండు అంశాలకు సృజనాత్మకమైన పరిష్కారం చూపిస్తున్నారు పూజా రాయ్‌...


‘‘ఆట స్థలం అనేది వినోదాన్నిచ్చే విలాసవంతమైన చోటు కాదు. పిల్లల్లో ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందుబాటులో ఉండాల్సిన ప్రదేశం. ఒకప్పుడు ప్రతి బడికీ తప్పనిసరిగా ప్లే గ్రౌండ్‌ ఉండేది. వాటిలో పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యాలు ఉండేవి. కొన్ని చోట్ల పబ్లిక్‌ పార్కుల్లోనూ ఆడుకొనే పిల్లలు కనిపించేవాళ్ళు. ఇప్పుడు చాలా పాఠశాలల్లో ఆటస్థలాలు కరువైపోయాయి. కొన్ని చోట్ల ఉన్నా సరైన సదుపాయాలు లేవు. దీంతో బాలలు... ప్రధానంగా ప్రభుత్వ బడుల్లో చదివే అట్టడుగు వర్గాల పిల్లలు ఆటలకు దూరమైపోతున్నారు. దీనివల్ల వాళ్ళ శారీరక, మానసిక వికాసం కుంటుపడుతుంది. అంతిమంగా ఆ ప్రభావం పడేది సమాజం మీదే’’ అంటారు ఇరవయ్యారేళ్ళ పూజా రాయ్‌. 


ఆ వార్తా కథనం చదివాక...

ఐఐటి ఖరగ్‌పూర్‌లో ఆర్కిటెక్చర్‌ ఫైనలియర్‌ చదువుతున్నప్పుడు అట్టడుగు వర్గాల పిల్లల కోసం నిర్వహిస్తున్న ఒక స్కూల్లో పని చెయ్యడానికి వాలంటీర్‌గా ఆమె వెళ్ళారు.  అక్కడ ఇద్దరు పిల్లలు బ్యాడ్మింటన్‌ ఆడుతూ... రాకెట్లకు బదులు చెప్పులు ఉపయోగిస్తున్నారు. మరి కొందరు విరిగి పోయిన కుళాయి గొట్టాలతో క్రికెట్‌ ఆడుతున్నారు. ‘‘ఆటల పట్ల వాళ్ళ ఆసక్తికి సంతోషించాలో, ఏమాత్రం సురక్షితం కాని పద్ధతుల్లో ఆడుతున్నందుకు బాధపడాలో నాకు అర్థం కాలేదు’’ అని ఆ సందర్భాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘పిల్లలకు ఆట స్థలాలు ఏర్పాటు చేయాలి. అదే సమయంలో అవి పర్యావరణహితంగానూ ఉండాలనే ఆలోచన చేస్తున్నప్పుడు... నేను చదివిన ఒక వార్తా కథనం గుర్తొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 98 కోట్లకు పైగా పనికిరాని టైర్లను విసిరేస్తున్నాం. మన దేశంలోనే ఇలాంటి టైర్లు ఏడాదికి పది కోట్ల వరకూ రోడ్ల పక్కన, నీటి వనరుల్లో, డంపింగ్‌ యార్డుల్లో పేరుకుపోతున్నాయి.


కొన్నిటిని కాల్చేస్తున్నారు. అవి పర్యావరణానికి తీవ్రమైన ముప్పు  కలిగిస్తున్నాయి. ఈ టైర్లను బడి పిల్లల ఆటల కోసం పునర్వినియోగించడం వల్ల ప్రకృతికి కూడా మేలు కలుగుతుందనిపించింది. నా కాలేజీ స్నేహితులు, అధ్యాపకులతో మాట్లాడాను. అప్పుడే ‘అంతిల్‌ క్రియేషన్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు బీజం పడింది’’ అన్నారు పూజ. బెంగళూరు కేంద్రంగా 2017లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 250కి పైగా ఆటస్థలాలను పిల్లల కోసం తీర్చిదిద్దింది.


అన్ని దశల్లో పిల్లలకు భాగస్వామ్యం...

పిల్లలు ఆడుకోవడానికి అనువుగా టైర్లను మార్చేందుకు పూజ పెద్ద కసరత్తే చేశారు. పాఠశాలల అధికారుల నుంచి అనుమతులు తీసుకున్న తరువాత... ఆట స్థలాన్ని శుభ్రపరచడంతో పని మొదలవుతుంది. టైర్లు, డ్రమ్ములు లాంటివన్నీ సాధ్యమైనంతవరకూ స్థానికంగానే సేకరించాలని నియమం పెట్టుకున్నారు. వాటికి రంగులు వేసి, పిల్లలకు ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దడం మరో ఎత్తు. ఖర్చు తక్కువగా ఉండాలి. అన్ని చోట్లా అమలు చేయగలిగేలా ఉండాలి. ‘‘ఎన్నో పరిమితుల మధ్య... ఆట స్థలాలనూ, ఆట వస్తువులనూ డిజైన్‌ చెయ్యడంలో నా ఆర్కిటెక్చర్‌ నేపథ్యం పనికొచ్చింది. కానీ ప్రాజెక్ట్‌ ప్రారంభానికి ముందు  చాలా పరిశోధన చేశాం. ఆటల విషయంలో పిల్లల దృక్పథాలు ఎలా ఉంటాయో, వారిని ఆకట్టుకొనే అంశాలేమిటో అత్యంత సహజమైన పద్ధతుల్లో వాళ్ళు నేర్చుకోవడానికీ, ఎదగడానికీ దోహదపడేలా ఆట స్థలాలను ఎలా అభివృద్ధి చెయ్యాలో అధ్యయనం చేయాల్సి వచ్చింది. దీనికి లెగో ఫౌండేషన్‌కూ, ఐక్య రాజ్య సమితికీ చెందిన చైల్డ్‌ స్పెషలిస్టులు, నిపుణులు, డిజైన్‌ ప్రొఫెసర్లు సహకారం అందించారు.


జారుడు బల్లలు, చిన్న ఊయలలు, వివిధ జంతువులు, ఆట గదుల్లో కూర్చోవడానికీ, చదువుకోవడానికీ కుర్చీలు, పంచింగ్‌ బ్యాగ్స్‌... ఇలా ఎన్నో తయారు చేశాం. డిజైన్‌ రెడీ అవగానే పిల్లలకు వాటిని చూపించి, అభిప్రాయాలు అడుగుతాం. వారి ఊహాశక్తికి పదును పెట్టి డిజైన్లు గీయాల్సిందిగా ప్రోత్సహిస్తాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుంటాం. ఆ తరువాత తయారీలోకి దిగుతాం. ఇందులోనూ పిల్లలు పాలుపంచుకుంటారు. ఇలా ప్రతి దశలోనూ తమ భాగస్వామ్యం ఉండడంతో పిల్లలు మరింత ఉత్సాహంగా ఆటపాటల్లో నిమగ్నమవుతారు. ఒక ప్లే గ్రౌండ్‌ను సిద్ధం చెయ్యడానికి ఎనభై వరకూ టైర్లు అవసరం అవుతాయి. స్థానికంగానే కాకుండా...ప్రముఖ టైరు కంపెనీలు, టైర్లు మార్చే దుకాణాలు, డంపింగ్‌ యార్డుల నుంచి టైర్లను, పునర్వినియోగానికి అనువైన వ్యర్ధాలను సేకరిస్తాం. స్థానికుల నుంచి సహకారం ఉంటే... ఒక ప్లే గ్రౌండ్‌ను నాలుగు రోజుల్లో సిద్ధం చేయవచ్చు’’ అని చెప్పారామె.


ఏడు ఆటలతో ‘ప్లే ఇన్‌ ఎ బాక్స్‌’ 

కిందటి ఏడాది లాక్‌డౌన్‌ ప్రకటించడంతో, పిల్లలు ఇళ్ళు దాటి బయటకు రాలేని పరిస్థితులు చాన్నాళ్ళు కొనసాగుతాయని పూజ గ్రహించారు. ఇంట్లోనే వాళ్ళు ఆడుకోవడానికి ఏదైనా చెయ్యాలనుకున్నారు. ‘‘మా టీమ్‌ అందరం ఆలోచించి, ‘ప్లే ఇన్‌ ఎ బాక్స్‌’ అనే కిట్‌కు రూపకల్పన చేశాం. వీటిలో పిల్లల అభ్యాసానికీ, వినోదానికీ దోహదపడే ఏడు ఆకర్షణీయమైన ఆటలుంటాయి. ఒక బాక్స్‌ తయారీకి వెయ్యి రూపాయల వరకూ ఖర్చవుతోంది. స్పాన్సర్ల సహకారంతో ఇప్పటి వరకూ అయిదు వేలకు పైగా కిట్లను పిల్లలకు పంపిణీ చేయగలిగాం. మరోవైపు భువనేశ్వర్‌, బెంగళూర్‌ నగరాల్లోని డంపింగ్‌ యార్డుల్ని శుభ్రం చేసి, సామాజిక వినియోగ ప్రదేశాలుగా మార్చాం. కొవిడ్‌ వల్ల జీవనోపాధి కోల్పోయిన వారికి సాయం అందించాం’’ అని వివరించారు పూజ. 


‘‘కరోనా రెండో విడత తరువాత... విద్యా సంస్థల ప్రారంభానికి ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. తమ పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్‌, పార్కులు నిర్మించాలంటూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు వందలకు పైగా విన్నపాలు అందాయి. పిల్లలు ఆటస్థలాలకు నోచుకోని దుస్థితి తీవ్రతకు ఇది అద్దం పడుతోంది. చాలా చోట్ల పాఠశాలల ఆట స్థలాలు ఆక్రమణల్లోనూ ఉన్నాయి. పట్టణీకరణ కారణంగా పచ్చదనం కనుమరుగైపోతోంది. మేము ఎక్కడ ప్రాజెక్ట్‌ చేపట్టినా స్థానికులకూ, బాలలకూ, పాఠశాల బాధ్యులకూ పర్యావరణ పరిరక్షణ గురించీ, బాలల జీవితాల్లో క్రీడల ప్రాధాన్యం గురించీ వివరిస్తున్నాం. సానుకూలమైన మార్పు వస్తుందన్న నమ్మకం మాకుంది’’ అంటున్నారు పూజ. 

Updated Date - 2021-06-23T09:13:04+05:30 IST