జూలు విదిల్చిన జూదం!

ABN , First Publish Date - 2020-09-23T09:40:53+05:30 IST

గుంటూరు జిల్లా మునుగోడులో జూదక్రీడ మూడు రాజులు, ఆరు రాణులుగా విచ్చల విడిగా సాగుతోంది. ఈ వ్యసనానికి బానిసలైన ఎందరో నిత్యం పేకముక్కలతో

జూలు విదిల్చిన జూదం!

కీలక నేత కనుసన్నల్లో జోరుగా పేకాట 

ప్రభుత్వ పెద్దకు అత్యంత సన్నిహితుడి సోదరుడి కనుసన్నల్లో వ్యవహారం 

రోజూ చేతులు మారుతున్న రూ.కోట్లు 

అధికారం, నోట్లతో పోలీసుల కళ్లకు గంతలు 

నిర్వాహకులకు రోజుకు 20 లక్షల ఆదాయం 

జూదరులకు టిఫిన్‌, టీలు, భోజనాలు ఫ్రీ 


(గుంటూరు-ఆంధ్రజ్యోతి) 

గుంటూరు జిల్లా మునుగోడులో జూదక్రీడ మూడు రాజులు, ఆరు రాణులుగా విచ్చల విడిగా సాగుతోంది. ఈ వ్యసనానికి బానిసలైన ఎందరో నిత్యం పేకముక్కలతో సహవాసం చేస్తూ చివరకు జోకర్లుగా మిగిలిపోతున్నారు. ‘‘మద్యాన్ని మాఫీ చేస్తాం... జూదాన్ని అణచివేస్తాం...’’ అంటూ ప్రగల్భాలు పలికే ప్రభుత్వ పెద్దకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఓ వైసీపీ పెద్దాయన ఇలాకాలో పెద్ద ఎత్తున పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. ఆయన సోదరుడి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోంది. బంకినీ రూపంలో అతనికే రోజుకు రూ.20లక్షలు చొప్పున నెలకు దాదాపు రూ.6కోట్లు మిగులుతున్నాయంటే అక్కడ రోజూ ఎన్ని రూ.కోట్లు చేతులు మారుతున్నాయో, ఎన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడుతున్నాయో ఊహించుకోవచ్చు. నిజాంపట్నానికి కూతవేటు దూరంలోని మునుగోడు గ్రామంలో ఏకంగా రెండంతస్థుల భవనాన్ని జూదగృహంగా మార్చి ‘మా ప్రభుత్వం... మా ఇష్టం’ అనే తరహాలో పేకముక్కల పారాయణం చేస్తున్నారు.


గుంటూరు, తాడేపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లోని ప్రముఖ క్లబ్‌లు మూతపడటంతో జూదరులంతా ఈ అడ్డాను వెతుక్కుంటూ వస్తున్నారు. పేకాటలో వీరు సంపాదించినా, లేకపోయినా నిర్వాహకులకు మాత్రం నిత్యం కాసుల వర్షం కురుస్తోంది. వాస్తవానికి రోజుకు రూ.25 లక్షలు మిగులుతుండగా... జూదరులకు కాఫీలు, టీలు, టిఫిన్లు, జ్యూసులు, పసందైన నాన్‌వెజ్‌ భోజనం, పోలీసులకు రోజువారీ మామూళ్లు తదితరాలకు రూ.5లక్షల వరకూ చెల్లిస్తున్నట్లు సమాచారం.  వీటితో పాటు ప్రశాంతంగా జూదమాడుకునేందుకు ఏసీ సదుపాయాలు కూడా కల్పించారు. అయితే ఉన్నతాధికారులు, ప్రజల కళ్లు కప్పేందుకు స్థానిక పోలీసులు ఒకటి రెండుసార్లు దాడులు నిర్వహించి వాస్తవంగా జూదమాడేవారిని కాకుండా అనామకుల (కిరాయి మనుషులను) అరెస్ట్‌ చూపి తమ రాబడిని కాపాడుకుంటున్నారని పలువురు విమరిస్తున్నారు.  


కోతముక్కలో రూ.కోట్లు 

ఈ జూదగృహంలో లక్ష బ్యాంకు టేబుళ్లు రెండు, 50వేల బ్యాంకువి నాలుగు, 25వేల బ్యాంకు టేబుళ్లు ఆరు చొప్పున నిత్యం ఆ జూదగృహంలో ఆట యథేచ్ఛగా కొనసాగుతోంది. మరో రెండు టేబుళ్లలో కోతముక్క ఆడిస్తున్నారు. ఈ ఆటలో రోజూ రూ.కోట్లలో డబ్బు చేతులు మారుతోంది. ఇక్కడ జూదమాడేందుకు గుంటూరు, విజయవాడ నుంచే కాకుండా గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి కూడా జూదరులు ఖరీదైన కార్లలో తరలివస్తున్నట్లు సమాచారం. ఇంత పెద్దఎత్తున అక్కడ జూదం జరుగుతున్నా పెద్దాయన తమ్ముడిగారి రౌడీయిజంతో అన్ని వర్గాల వారు కళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు చేశారనే సమాచారం వెంటనే ఆయనకు చేరిపోతుంది. దాంతో ఎవరూ నోరు మెదిపి ఫిర్యాదు చేసే సాహసం చేయడం లేదు. ఇంత జరుగుతున్నా తనకేమీ తెలియదన్నట్టుగా ఆ పెద్దాయన నీతి వాక్యాలు వల్లిస్తుంటారని ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2020-09-23T09:40:53+05:30 IST