ఆర్‌సీబీకి కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగడంపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-11-07T23:24:28+05:30 IST

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇంటి బాట పట్టడంపై...

ఆర్‌సీబీకి కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగడంపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఇంటి బాట పట్టడంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడిన గంభీర్.. కోహ్లీ కెప్టెన్సీపై ఆర్‌సీబీ పునరాలోచించాలని వ్యాఖ్యానించాడు. ఫ్రాంచైజీ స్థానంలో తాను ఉంటే నూటికి నూరు శాతం కెప్టెన్సీ బాధ్యతలను వేరొకరికి అప్పగించేవాడినని గంభీర్ స్పష్టం చేశాడు. ‘ఎనిమిదేళ్లు.. ట్రోపీ సాధించకుండా ఎనిమిదేళ్లా’ అని గంభీర్ విస్మయం వ్యక్తం చేశాడు. ఎనిమిదేళ్లు చాలా ఎక్కువ సమయమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘ఈ స్థితిలో ఉన్న వేరే కెప్టెన్ గురించి చెప్పండి.. కెప్టెన్ కాదు.. ఎనిమిదేళ్ల నుంచి టైటిల్ సాధించకుండా టీంలో కొనసాగుతున్న ఏ ఒక్క ఆటగాడినైనా చూపించండి’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి జవాబుదారీతనంతో వ్యవహరించాలని, తాను ఈ ఒక్క సంవత్సరం గురించి మాత్రమే చెప్పడం లేదని గంభీర్ చెప్పాడు. తాను కోహ్లీకి ఏమాత్రం వ్యతిరేకం కాదని.. కానీ.. ఒకానొక సమయానికి కోహ్లీ తనకు తానుగా.. ‘ఔను.. వైఫల్యాలకు నాదే బాధ్యత.. అందుకు నేనే జవాబుదారీ’ అని చెప్పాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.


ఆర్‌సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ ఎనిమిదేళ్ల నుంచి కొనసాగడం చాలా ఎక్కువ సమయమని.. ఆర్.అశ్విన్ విషయంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుచేసుకోవాలని గంభీర్ చెప్పుకొచ్చాడు. అశ్విన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు రెండేళ్లు కెప్టెన్‌గా వ్యవహరించాడని.. ఆశించినంతగా రాణించకపోవడంతో తప్పుకున్నాడని గంభీర్ చెప్పాడు. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, కోహ్లీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. ధోనీ కెప్టెన్సీలో చెన్నై మూడు సార్లు టైటిల్ గెలిచిందని, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై నాలుగు సార్లు టైటిల్ కొట్టిందని.. అలా రాణించినందువల్లే ఇంత కాలంగా వారిద్దరూ కెప్టెన్లుగా కొనసాగుతున్నారని గంభీర్ తెలిపాడు. రోహిత్ శర్మ ఎనిమిదేళ్లు కెప్టెన్‌గా ఉండి, టైటిల్ సాధించకపోయి ఉంటే.. కచ్చితంగా కెప్టెన్‌గా అతనిని తప్పించేవాళ్లని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా రూల్స్ ఉండవని వ్యాఖ్యానించాడు.



Updated Date - 2020-11-07T23:24:28+05:30 IST