శ్రియ ఏడ్చింది.. ఇళయరాజా ‘హే ఆపు’ అన్నారు: సృజనారావు

శ్రియ, శివ కందుకూరి, నిత్యా మీనన్‌, ప్రియాంక జవాల్కర్‌ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘గమనం’. సృజనారావు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 10న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సృజనారావు విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఈ కథ అప్పటికప్పుడు పుట్టింది కాదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్న సంఘటనల సమాచారం ఈ చిత్రం. ఇందులో మూడు, నాలుగు కథలుంటాయి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే లైఫ్‌ సర్కిల్‌ను చూపించాలనుకున్నా. స్ర్కిప్ట్‌ రాసుకున్నప్పుడు ఫలానా పాత్రకు ఫలానా ఆర్టిస్ట్‌ అని అనుకోలేదు. శ్రియా వద్దకి వెళ్లే వరకు కమల పాత్ర ఆమెది అని తెలియదు. సగం కథ చెప్పిన తరువాత ఆమె నా కమల అని ఫిక్స్‌ అయ్యాను. కథ చెప్పడం పూర్తయ్యాక శ్రియా లేచి ఏడ్చేశారు. గట్టిగా హత్తుకున్నారు. నిత్యామీనన్‌ కూడా అంతే! ఈ సినిమాకు క్రిష్‌గారి సపోర్ట్‌ ఉంది. కానీ కథ పరంగా ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేదు. సంగీత దర్శకుడిగా ఇళయరాజాగారు కావాలని అడిగా. నిర్మాత షాకయ్యారు. ఫైనల్‌గా ఆయన్ని కలిసి కథ చెప్పాం. ‘హే ఆపు’ అన్నారు.  నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఓ ఫోటో తీయండి మేం సినిమా చేయబోతోన్నామని ఇళయరాజా గారు అన్నారు. ఆయనకు అంతగా కథ నచ్చింది. పాటలు అద్భుతంగా ఇచ్చారు. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. 

Advertisement